జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలకు ఎక్కడ లేనంత టెన్షన్ తెచ్చి పెడుతున్నాయి. రెండు పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి . భారతీయ జనతా పార్టీ రేసులో ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్యనే జరుగుతోంది. అభ్యర్థి ఎంపికలో ఆలస్యం, ప్రచారంలోనూ దూకుడుగా లేకపోవడం వంటి కారణాలతో బీజేపీ సీరియస్ గా పోటీ చేయడం లేదని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అందుకే ముఖాముఖి పోరు జరుగుతోంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఓటర్లు సైలెంట్ ఓటింగ్ కు దిగుతున్నారని ఓటింగ్ మాదంటే మాదని అంటున్నారు.
ప్రజలు సైలెంట్‌గానే ఓటు వేస్తారు !
ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు గుంభనంగా తమ తీర్పు చెబుతారు. తాము ఎవరికి ఓటు వేస్తామో ఎవరికీ చెప్పరు. ఫలితమే తేలుస్తుంది. ఉపఎన్నికల్లో అయితే ఇంకా ఎక్కువ సైలెంట్ గా ఉంటుంది. ఎంత ఎక్కువగా రాజకీయ పార్టీలు హడావుడి చేసినా ఓటర్లు తాము వేయాలనుకున్నవారికే వేస్తారు. అంతా సైలెంట్ గా పూర్తి చేస్తారు. అందుకే జూబ్లిహిల్స్ ఓటర్ల మనసులో తెలుసుకోవడానికి రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని అది తమకే జరుగుతుందని రెండు పార్టీలు అనుకుంటున్నాయి. కానీ సైలెంట్ ఓటింగ్ అయితే ఖాయం కానీ ఏ పార్టీకి అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి.
కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలంటే బీఆర్ఎస్కు ఓటెయ్యాలా?
రాజకీయ పార్టీల స్ట్రాటజీనే ఫలితాలను నిర్ణయిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ పూర్తిగా కాంగ్రెస్ ను ఓడించి బుద్ది చెప్పాలన్న కోణంలోనే జరుగుతుంది. కాంగ్రెస్ ను ఓడించాలంటే.. బీఆర్ఎస్ కే ఓటేస్తారని కేటీఆర్ నమ్మకంగా ఉన్నారు. తమకు అధికారం లేదు కాబట్టి ఓటేసినా ప్రయోజనం ఉండదని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకు ఐదు వందల రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఐదు వందల రోజుల్లో మా ప్రభుత్వం వస్తుందని ఆయన చెబుతున్నారు. ఎంత మంది ప్రజలు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతారో కానీ.. చిన్న చాన్స్ కూడా వదులుకోకుండా.. కాంగ్రెస్ వ్యతిరేకత ప్రయోజనం అంతా తమ వైపు వచ్చేలా చేసుకునేందుకు కేటీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
ఓటింగ్ పై జూబ్లిహిల్స్ ఓటర్ల ఆసక్తి ఎంత వరకు ?
పల్లె ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ ఉపఎన్నికల్లో అయినా 90 శాతం ఓటింగ్ జరుగుతుంది. ఎక్కెడక్కడి ఓటర్లు అందర్నీ పిలిపించుకుని మరీ ఓట్లు వేయించుకుంటారు. కానీ జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో అలా ఉండదు. ప్రజలు అసలు ఈ ఎన్నికపై ఎంత ఆసక్తిగా ఉన్నారన్నది కూడా తెలియదు. ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటే బీఆర్ఎస్ లేదా బీజేపీకి మేలు జరగవచ్చు. కానీ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోతే.. నవీన్ యాదవ్ కు ప్లస్ అవుతుంది. ఆయన కోసం ఓట్లకు వచ్చేవారు.. రప్పించుకునేవారు ఉంటారు. అందుకే సైలెంట్ ఓటింగ్ కూడా ఈ సారి ఫలితాల తర్వాత పెద్ద సౌండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
