అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో సింగపూర్ కన్సార్టియం ఏకపక్ష లాభానికి ఉద్దేశించిన మరికొన్ని నిబంధనల ప్రకారం క్రిడా నుంచి కన్సార్టియంకు భూములు బదలాయించిన తర్వాత అనుకున్న అయిదేళ్లలో ప్లాట్లు అమ్ముడుకాకపోతే మరో అయిదేళ్లు పొడగించుకోవచ్చు. ఇలాటి పొడగింపులు ఎన్ని అనేదానిపై పరిమితి వుండదు.కాని వారే గనక వద్దనుకుంటు నిరభ్యంతరంగా పక్కకు తప్పుకోవచ్చు. తమ వాటాను ఎవరికైనా అమ్ముకోవచ్చు. కాని క్రిడా అమ్మదల్చుకుంటే మాత్రం మొదట కన్సార్టియంకే అమ్మాలి. ఇక దీన్నంతటిపై నిర్ణయాధికారం బోర్డుకు వుంటుంది. ఆ బోర్డు చైర్మన్ కూడా కన్సార్టియం నియమిస్తుంది. డైరెక్టర్లుగా ఆరుగురు కన్సార్టియం తరపున వుంటే ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరే వుంటారు. ఏ నిర్ణయమైనా ఇక్కడే జరగాలి. ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుకు వెళ్లడానికి కూడా బోర్డుకు హక్కునిచ్చారు. అంటే ప్రభుత్వ ఆస్తులతో వ్యాపారం చేసుకుంటూ దాన్నే సవాలు చేసే అధికారం ఇవ్వడమన్న మాట. .
సింగపూర్ కన్సార్టియం ఏమైనా అధిక పెట్టుబడులు తీసుకొస్తుందా అంటే అదీ లేదు. అంతా కలసి మొదటి దశలో రు.306 కోట్లు పెట్టనున్నట్టు లెక్క చూపించింది. ప్రభుత్వం కూడా 212 కోట్లు పెడుతుంది. సీడ్ ఏరియా క్యాపిటల్‌లోని 1691 ఎకరాలకు గాను 250 ఎకరాలు ముందే హక్కులతో సహా కన్సార్టియంకు స్వాధీనం చేస్తారు. అది కూడా వ్యాపార ప్రాంతం ఇస్తారు. హైదరాబాదుతో అమరావతిని పోల్చి రాశారు గాని ఆ పరిస్తితి రావడానికి ఎంత కాలం పడుతుంది? ఇక మిగిలిన 1440 ఎకరాలలో 40 శాతం రోడ్లు వగైరాలకు పోగా 765 ఎకరాలు మిగులుతుంది. దీనికి ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం 3060కోట్లు రావాలి. కన్సార్టియం ప్రాజెక్టు చేయడానికి చూపించిన మొత్తం ి 3173 కోట్లు. ఇందులో సగం ప్రభుత్వం భరించితే కూడా నష్టమే. ఎందుకంటే భూములు ఇచ్చి ఇన్ఫ్రా బాధ్యత కూడా తీసుకుంటున్నది గనక.పైగా ఆచరణలో పెట్టుబడి వ్యయం పెంచుకునే అవకాశంకూడా కల్పించారు. కన్సార్టియం చెప్పిన మేరకు నిధులు తేలేకపోతే ప్రభుత్వం మోయవలసిందే. పైగా అది తన వాటా ఎవరికైనా అమ్ముకోవడానికి ముందుకు తేవడానికి అవకాశం వుంది గనక అస్మదీయులు రంగ ప్రవేశంచేయడం ఖాయంగా కనిపిస్తుంది.
స్విస్ చాలెంజి సూత్రాల ప్రకారం సమాచారం తప్పక వెల్లడించాలి. కాని సమాచార హక్కు చట్టం నుంచి కూడా ఈ ఒప్పందానికి మినహాయింపు నిచ్చారు. ఒక వేళ వివరాలు గనక బయిటపడితే దానికి ప్రభుత్వందే బాధ్యత అంటూ కన్సార్టియం చర్య తీసుకోవచ్చు. ఇక వారే గనక వైదొలగాలనుకుంటే తెచ్చిన అప్పునకు నూరుశాతం, వాటా ధనానికి 90 శాతం చెల్లించి వెళ్లిపోవాలి. కాని ప్రభుత్వమే గనక వద్దనుకుంటే వాటాధనానికి 150శాతం చెల్లించాలని షరతు పెట్టారు. ఇందుకు సంబంధించిన లెక్కలన్నీ విదేశీ ఆడిటర్లు మాత్రమే తనిఖీ చేయాలని మరో ఏర్పాటు. కూడా ప్రశ్నార్థకంగా వుంది.ఇదంతా చూస్తే హైదరాబాదులో ఎపిఐఐసి, ఎంఆర్ ఎంజిఎప్ వెంచర్లు గుర్తుకు వస్తాయి