టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. టీటీడీ ఈవో పోస్టు కంటే.. జీఏడీ ముఖ్యకార్యదర్శి పోస్టు కీలకమైనది. కానీ.. టీటీడీ ఈవో పోస్టుకు ఉండే డిమాండ్ వేరు. ఆ స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు.
అనిల్ కుమార్ సింఘాల్ గతంలోనూ .. అంటే టీడీపీ హయాంలోనూ టీటీడీ ఈవోగా చాలా కాలం పాటు పని చేశారు. వైసీపీ వచ్చిన వెంటనే ఆయనను బదిలీ చేయలేదు. చాలా రోజుల పాటు ఆయనే కొనసాగారు. కానీ ధర్మారెడ్డిని డిప్యూటీ ఈవోగా పెట్టడంతో పెత్తనం అంతా ఆయనే చేసేవారు. తర్వాత ఆయనను తప్పించి జవహర్ రెడ్డిని నియమించారు. టీటీడీ ఈవోగా పని చేయాలన్నది జవహర్ రెడ్డి కల. జగన్ వద్ద ఉన్న పలుకుబడితో దాన్ని సాకారం చేసుకున్నారు. అయితే తర్వాత సీఎస్‌గా చేసి ఆయనను మళ్లీ అమరావతికి పిలిపించుకున్నారు. దాంతో అర్హత లేకపోయినా ధర్మారెడ్డికి ఈవో పోస్టింగ్ ఇచ్చారు. ఐఏఎస్‌లనే ఈవోగా నియమించారు. ధర్మారెడ్డి ఐఏఎస్ కాదు.. కేవలం రక్షణ శాఖ ఉద్యోగి మాత్రమే.
టీడీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం తిరుమలను ప్రక్షాళన చేయడానికి శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు మరికొంత మంది అధికారులు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అనిల్ కుమార్ సింఘాల్‌కు .. చాలా పై స్థాయి నుంచి మద్దతు ఉండటంతో ఆయననే నియమించక తప్పలేదు. అనిల్ కుమార్ కూడా.. సీఎస్‌గా పోస్టింగ్ కన్నా.. టీటీటీ ఈవో పోస్టునే కోరుకుంటారు.