Single Movie review
తెలుగు360 రేటింగ్: 2.75/5
సినిమాకి ఏం కావాలి? కథ, క్యారెక్టరైజేషన్, కొత్తదనం, సంఘర్షణ, భారీ హంగులు.. ఇలా రకరకాలుగా మాట్లాడుకొంటుంటాం. కానీ ఏ సినిమాకైనా ‘రైటింగ్’ చాలా ముఖ్యం. ముందు చెప్పుకొన్న విషయాలేం లేకపోయినా కేవలం ‘రైటింగ్‌తో’ మెస్మరైజ్ చేసిన సినిమాలు కొన్నుంటాయి. ఇప్పుడు శ్రీవిష్ణు నుంచి వచ్చిన `సింగిల్`లోనూ అదే కనిపించింది. మేకింగ్ దశలో ‘సింగిల్’ పై పెద్దగా బజ్ లేదు. అసలు ఇలాంటి సినిమా ఒకటొస్తోందని కూడా చాలామందికి తెలీదు. టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమా గురించిన అవగాహన ఏర్పడింది. కొన్ని వివాదాస్పద విషయాలు మరింత పబ్లిసిటీ తీసుకొచ్చాయి. అలా కొంత పాజిటీవ్ వైబ్రేషన్స్ తో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. కామెడీ టైమింగ్ తో ఇరగదీసే శ్రీవిష్ణు ఈసారి ఎన్ని నవ్వులు పంచాడు. కేవలం `రైటింగ్`పై ఆధారపడిన ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వచ్చింది?
విజయ్ (శ్రీవిష్ణు) జంట కోసం ఆశగా ఎదురు చూస్తున్న సింగిల్ బ్రహ్మచారి. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్) కూడా సింగిలే. కానీ ఏదోలా కష్టపడి గాయత్రి అనే అమ్మాయి ప్రేమ సాధిస్తాడు. దాంతో ఎలాగైనా సరే.. ఒక అమ్మాయిని ప్రేమలో దించేయాలన్న తపన విజయ్‌లో మరింత కలుగుతుంది. పూర్వ (కేతిక శర్మ)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. కానీ పూర్వ మాత్రం విజయ్‌ని పెద్దగా పట్టించుకోదు. మరోవైపు హరిణి (ఇవానా) విజయ్‌ని ప్రేమిస్తుంది. కానీ విజయ్ మాత్రం హరిణిని పట్టించుకోడు. ఈ ముక్కోణపు లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి విజయ్ తన సింగిల్ స్టేటస్ నుంచి ఎలా బయటకు వచ్చాడు? అనేది మిగిలిన కథ.
రెండు ముక్కల్లో ఈ కథ చెబితే ‘శ్రీవిష్ణు ఈ కథని ఎలా ఒప్పుకొన్నాడు’ అనిపిస్తుంది. అసలు ఇలాంటి కథల్ని అంగీకరించడం చాలా కష్టం. ఎందుకంటే ఈ తరహా కథలు చాలా వచ్చాయ్. చూసి చూసి జనాలూ విసిగిపోయారు. మళ్లీ అదే కథ పట్టుకొన్నాడు. హీరోగానీ, దర్శకుడు కానీ నమ్మింది.. కథని కాదు. కేవలం సన్నివేశాల్ని, అందులో రాసుకొన్న సింగిల్ లైనర్లని. కథని చాలా సింపుల్ గా, ఎలాంటి హడావుడి లేకుండా మొదలెట్టేశారు. స్నేహితుడి ప్రేమ కథని చూసి హీరో కుళ్లు కోవడం, అనవసరమైన బిల్డప్పులు ఇచ్చి, పుల్లలు పెట్టడం ఈ వ్యవహారాలన్నీ సరదాగా సాగిపోతాయి. ఆ తరవాత హీరోయిన్ మనసులో స్థానం సంపాదించడానికి హీరో చేసే పనులన్నీ అల్లరి అల్లరిగా అనిపిస్తాయి. ఆడి షోరూమ్ లో సీన్ అయితే.. కేవలం వెన్నెల కిషోర్ ఎక్స్ప్రెషన్స్, సింగిల్ లైనర్స్‌తో పేలిపోయింది. ఆ మూమెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కేవలం లుంగీ చుట్టూ పది నిమిషాల సీన్ నడిపాడు దర్శకుడు. ఇదంతా కథగా చెబుతున్నప్పుడు అక్కర్లేని విషయాలు. కేవలం రైటింగ్ కెపబులిటీ వల్ల, కామెడీ టైమింగ్ వల్ల నడిచిన సీన్ ఇది. ఇదొక్కటే కాదు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. దాంతో సినిమాలో కథేం లేకపోయినా, కేవలం ఆ ఫన్ మూమెంట్స్ వల్ల ఎంజాయ్ చేయగలుగుతారు.
సోషల్ మీడియాలోనే విపరీతమైన ఫన్ ఉంది. ట్రోల్స్, మీమ్స్.. దాంతోనే టైమ్ పాస్ అయిపోతుంటుంది. వాటిని సినిమాల్లో వాడుకోవడం చాలా కామన్. ఈజీ కూడా. కానీ ఆ స్టఫ్‌ని సరైన టైమ్‌లో, సరైన ప్లేస్‌లో వాడాలి. `సింగిల్`లో అది కనిపించింది. ‘ఒరేయ్ పందిపిర్రలోడా’, ‘కుమారీ ఆంటీ’, ‘ఐరనే వంచాలి ఏంటి’.. ఇలా చాలా చాలా డైలాగులు ఈ సినిమా నిండా పేరుకుపోయాయి. కానీ వాటి ప్లేస్మెంట్ పక్కాగా కుదిరింది. అందుకే ఫన్ జనరేట్ అయ్యింది. కేవలం ఆ మీమ్స్‌ని అలానే వాడుకోకుండా కొన్నింటికి కౌంటర్లు కూడా ఇచ్చాడు. ఉదాహరణకు ‘ఒరేయ్ పంది పిర్రలోడా’ అన్న చోట థియేటర్ ఘోల్లుమంది. అక్కడితో ఆగితే రైటింగ్ స్కిల్ అనిపించుకోదు. దానికి కొనసాగింపుగా ‘నువ్వెప్పుడు చూశావ్’ అనే డైలాగ్ తో ముగించాడు. అక్కడ రచయిత తాలుకూ షార్ప్‌నెస్ కనిపించింది. చివర్లో పెళ్లికొడుకు పాత్రలో సత్య ఎంట్రీ ఇస్తాడు. సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని ఇష్టపడే పాత్ర అది. ఆ వాలకం చూసిన వెన్నెల కిషోర్ ‘ఏం క్యారెక్టర్ రా నీది’ అని అంటాడు వెటకారంగా. వెంటనే సత్య ‘సోలో బతుకే సో బెటరులో నీ పాత్ర కంటే కాదులే..’ అని కౌంటర్ వేస్తాడు. ఆ సినిమాలో వెన్నెల కిషోర్ చేసింది అలాంటి క్యారెక్టరే అనేది గుర్తొచ్చిన వాళ్లకు ఆ డైలాగ్ మరింత కిక్ ఇస్తుంది.
గీతా ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన సినిమా ఇది. అందుకేనేమో అల్లు అరవింద్ స్తుతి ఎక్కువైపోయింది. వెన్నెల కిషోర్‌కు అరవింద్ అనే పేరు పెట్టడం దగ్గర్నుంచి, ట్రిపుల్ ఏ సినిమాలో ‘పుష్ప 2’ చూడడం వరకూ చాలా రిఫరెన్సులు కనిపిస్తాయి. ఓ దశ వరకూ ఓకే. కానీ.. అవి మరీ శ్రుతి మించి ఏవగింపు వచ్చేంత వరకూ లాగారు. వాటిని కాస్త తగ్గించుకొంటే బాగుండేది. ఈ కథని ఎమోషన్‌గా టర్న్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ని దింపింది అందుకే. చివర్లో హీరోని సింగిల్ చేసేసి, అక్కడ కూడా కావల్సినంత భావోద్వేగాల్ని పిండే అవకాశం ఉంది. కానీ మరీ డెప్త్ లోకి వెళ్లకుండా పై పై పూతల వరకే వాడాడు. అప్పటి వరకూ ఎలాంటి ఫన్ మూడ్ లో సినిమాని నడిపించాడో, క్లైమాక్స్ లో కూడా అంతే సింపుల్ గా కథని ముగించాడు. క్లైమాక్స్ కాస్త గుర్తుండిపోయేలా డిజైన్ చేసి ఉంటే – అవుట్ పుట్ ఇంకా బెటర్‌గా ఉండేది.
శ్రీవిష్ణు సింగిల్ హ్యాండెడ్ గా ఈ సినిమా నడిపించేశాడు. తన కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా కుదిరింది. చాలా ఈజ్ తో చేశాడు. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అని టైటిల్ కార్డ్‌లో వేసుకొన్నందుకైనా దానికి న్యాయం చేశాడు. కొన్ని చోట్ల కేవలం శ్రీవిష్ణు డైలాగ్ మాడ్యులేషన్ వల్ల నవ్వొచ్చింది. ఇంకొన్ని చోట్ల తన ఎక్స్ప్రెషన్స్ తో ఫన్ చేశాడు. శ్రీవిష్ణు కెరీర్లో గుర్తిండిపోయే క్యారెక్టరైజేషన్ ఇది. వెన్నెల కిషోర్ తనవంతు సాయం చేశాడు. సినిమా అంతా వీరిద్దరే కనిపిస్తారు. అయినా ఎక్కడా బోర్ కొట్టదు. కథానాయికలవి మరీ తీసి పారేసే పాత్రలు కావు. ఇంత ఫన్ పుట్టడానికి వాళ్లూ తమ వంతు పాత్ర పోషించారు.
పాటలు ఓకే అనిపిస్తాయి. సింగిల్ పాట హుషారుగా సాగింది. అయితే మేకింగ్ లో క్వాలిటీ లేదు. మీడియం రేంజ్ సినిమాని, చిన్న సినిమాలా చుట్టేశారు. మెట్రో స్టేషన్, ఆఫీసు సెటప్, పెంట్ హౌస్ తప్ప పెద్దగా లొకేషన్లు కూడా కనిపించవు. రైటింగ్ బలం ఏమిటో చెప్పిన సినిమా ఇది. గుర్తుండిపోయే డైలాగులు కంటే, గుర్తు తెచ్చుకొని మరీ నవ్వుకొనే డైలాగులు ఎక్కువ ఉన్నాయ్ ఇందులో. అవి సన్నిశాన్ని చూస్తున్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలం. 2 గంటల్లో ముగిసిన సినిమా ఇది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. దాంతో బోర్ కొట్టేలోపే శుభం కార్డ్ వేసి, ఇంటికి పంపించేశారు.
కొన్ని సినిమాలు ఎప్పుడు చూసినా ఫ్రెష్‌గా అనిపించి, సినిమా చూస్తున్నంత సేపూ అదే మూడ్ క్యారీ చేసుకొంటూ – హాయిగా నవ్వుకొంటుంటాం. అలాంటి సినిమాల్లో ‘సింగిల్’ ఒకటి. పేరు సింగిల్ కదా అని సింగిల్ గా థియేట్లకు వెళ్లొద్దు. మీ బ్యాచ్‌తో వెళ్తే మరింత ఎంజాయ్ చేయొచ్చు.
తెలుగు360 రేటింగ్: 2.75/5