సంక్రాంతి తరవాత సరైన సినిమా రాలేదు. మధ్యలో ‘కోర్ట్’ అనే ఓ చిన్న సినిమా మంచి వసూళ్లు దక్కించుకొంది. అయితే బాక్సాఫీసుకు జోష్ ‘హిట్ 3’తోనే వచ్చింది. తొలి 4 రోజుల వసూళ్లు ‘హిట్ 3’ని హిట్ సినిమాగా నిలబెట్టాయి. ఈవారం కూడా ఈ జోరు కొనసాగాలని చిత్రసీమ భావిస్తోంది. ఎందుకంటే ఈ వారం 4 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘సింగిల్’, ‘శుభం’, ‘కలియుగమ్’తో పాటుగా ‘బ్లైండ్ స్పాట్’ అనే ఓ చిన్న సినిమా ఈవారమే వస్తున్నాయి.
శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’పై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొంటున్నాయి. పైగా ఇది పూర్తి స్థాయి వినోద భరిత చిత్రం. శ్రీవిష్ణుకి ఈ జోనర్ బాగా అచ్చొచ్చింది. ‘సామజవరగమన’ సినిమా తరవాత శ్రీవిష్ణు పూర్తి స్థాయి ఎంటర్టైనర్ ఎంచుకోవడం కూడా ఇదే. కాబట్టి ఆశలు పెరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రమోషన్ల విషయంలో పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు. ‘ప్రేమలు’ ఫేమ్ ఇవానా కథానాయికగా నటించడం మరో ప్రధాన ఆకర్షణ.
సమంత నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం ‘శుభం’. ఓ టీవీ చుట్టూ తిరిగే హారర్ కథ ఇది. ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని రేపారు. సమంత అతిథి పాత్రలో కనిపించడం మరో విశేషం. సమంత కోసమైనా టికెట్లు తెగుతాయని చిత్రబృందం నమ్మకం పెట్టుకొంది. హారర్ జోనర్ ఎప్పటికీ హాట్ కేకే. కాబట్టి ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ తీసుకొనే అవకాశం ఉంది. ఓపెనింగ్స్ తక్కువైనా, మౌత్ టాక్ ని బట్టి వసూళ్లు పెరుగుతాయని చిత్రబృందం గట్టిగా చెబుతోంది.
కిషోర్, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘కలియుగమ్’. 2064 నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పటి మనుషులు, వాళ్ల ప్రవర్తన, వాతావరణం ఎలా ఉంటుందో ఊహించి చెబుతున్న సైన్స్ ఫిక్షన్. ఓ రకంగా టైమ్ ట్రావెల్ కథ అనుకోవొచ్చు. ఈ జోనర్ ని ఇష్టపడేవాళ్లకు ఇది మంచి ఆప్షన్. నవీన్ చంద్ర హీరోగా నటించిన ‘బ్లైండ్ స్పాట్’ కూడా ఈ వారమే వస్తోంది. ఇదో క్రైమ్ థ్రిల్లర్. రాశీ సింగ్ కథానాయికగా నటించింది.
ఈ సినిమాలతో పాటు మే 9న అలనాటి క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలకు సిద్ధమైంది. త్రీడీ హంగులతో ఈ సినిమాని రీరిలీజ్ చేస్తుండడం విశేషం. ఈ మధ్య పాత సినిమాలకు బాక్సాఫీసు దగ్గర ఆదరణ బాగుంటోంది. త్రీడీ సినిమా అంటే చిన్న పిల్లలు ఇష్టపడతారు. పైగా ‘జగదేక వీరుడు..’ ఓరకంగా చిన్న పిల్లల్ని ఎట్రాక్ట్ చేసే జోనర్. కాబట్టి మరోసారి థియేటర్లు కళకళలాడడం ఖాయంగా కనిపిస్తోంది.