Sir Madam Movie Review
–రివ్యూ బై అన్వర్
తెలుగు360 రేటింగ్ 2.25/5
జంధ్యాల తీసిన ‘మొగుడు పెళ్లాలు’ సినిమా భలే గమ్మత్తుగా వుంటుంది. భార్యని ఎప్పుడూ తిడుతూ వుండే సుత్తి వీరభద్రరావు ఆమె చనిపోయాక ఏం చేయాలో తోచక కొద్దిరోజుల్లోనే ఆయనా కాలం చేసేస్తాడు. అదే సినిమాలో శ్రీలక్ష్మీ పాత్ర ఇంకా సరదాగా వుంటుంది. చిన్న మాట అంటే చాలు.. పుట్టింటి బాట పట్టేస్తుంటుంది. భర్తయిన శుభలేఖ సుధాకర్, “ఉత్తర.. ఉత్తర..” అంటూ ఆమె వెంట పరుగులు తీస్తాడు. ఎదురుపడిన అత్తగారితో “మీ అమ్మాయికి ఏ ముహూర్తాన ఉత్తర అనే పేరుపెట్టారో కానీ మేమిద్దరం ఉత్తర దక్షిణ ద్రువాలైపోయాం అత్తయ్య” అంటూ నిట్టూరుస్తాడు. మనం రెగ్యులర్ లైఫ్‌లో చూసే పాత్రలే ఇవి. కానీ తెరపైకి చాలా అందంగా గుర్తుపెట్టుకునేలా వచ్చాయి.
అయితే కాలంతో పాటు కథలు మారిపోయాయి. అసలు భార్యాభర్తల కథల్ని చాలా వరకు ఆలోచించడమే మానేశారు మేకర్స్. మనకు నిత్యం కనిపించే ఒక మామూలు పాత్ర గురించి చెబితే.. “ఇందులో కొత్తగా ఏముంది.. సీరియల్స్ చేస్తున్నామా?” అనుకునే పరిస్థితి వచ్చింది. కాకపోతే కొంతమంది దర్శకులు అలాంటి మామూలు పాత్రలు, ప్రతి ఇంట్లో సాధారణంగా జరిగే సన్నివేశాల అల్లికతో సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పాండిరాజ్ తీసిన ‘సార్ మేడమ్’ కూడా లాంటి ఓ మామూలు భార్యభర్తల కథే. మరి ఇలాంటి మామూలు కథని విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ లాంటి మేటినటులు ఎంచుకోవడానికి కారణం ఏమిటి? ఈ కథలో వాళ్ళు బలంగా నమ్మిన అంశాలు తెరపైకి ఎలా వచ్చాయి? అవి ఎలాంటి వినోదాల్ని పంచాయి?
ఆకాష్ అలియాస్ ఆకాశవీరుడు (విజయ్ సేతుపతి) టెన్త్ ఫెయిల్. ఐతేనేం… మంచి పరోటా మేకర్. పాల పరోటా, ఆకాశ పరోటా.. ఇలా కొత్త వెరైటీలు కనిపెట్టి తన ఏరియాలోనే పాపులర్ క్యాంటీన్ నడుపుతుంటాడు. పెళ్లిచూపుల్లో రాణి (నిత్యా మేనన్)ని చూసి ఇష్టపడతాడు. అయితే ఆకాష్ కుటుంబ నేపథ్యం తెలిసిన రాణి తల్లితండ్రులు పెళ్లికి నిరాకరిస్తారు. కుటుంబాన్ని కాదని ఆకాష్‌ని పెళ్లి చేసుకుంటుంది రాణి. పెళ్లైన కొత్తలో వాళ్ల వైవాహిక జీవితం హాయిగానే వుంటుంది. తర్వాత మొగుడు పెళ్లాల మధ్య గిల్లికజ్జాలు మొదలవుతాయి. అవి ఓ దశ దాటాక పెద్ద గొడవలుగా మారతాయి. ఆకాష్ నుంచి విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వస్తుంది రాణి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వీరి గొడవలకు కారణమేంటి? చివరికి వీళ్ల కీచులాటలు ఏ ఒడ్డుకు చేరాయి? అనేది కథ.
సహజమైన పాత్రలు, ముఖ్యంగా భార్యభర్తల బంధాన్ని చూపించే కథలు చేయడం అంత ఈజీ కాదు. కొంచెం తేడా కొట్టినా సీరియల్ ఫీలింగ్ కలిగించే ప్రమాదం వుంది. సార్ మేడమ్ కథ సినిమాల్లోనే కాదు, ఎన్నో సార్లు నిజ జీవితంలో కూడా చూసినదే. అయితే ఈ కథకి దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్, ముఖ్యంగా విజయ్ సేతుపతి, నిత్య మేనన్ పాత్రల్ని డిజైన్ చేసిన తీరు ఓ ప్రత్యేకతని తీసుకొచ్చింది.
ఇష్టదైవం వద్ద పాపకు పుట్టువెంట్రుకలు తీయడానికి వచ్చిన సన్నివేశంతో కథ మొదలుపెట్టాడు దర్శకుడు. మొదట ఓ మామూలు సీన్‌గా కనిపించే ఈ సీక్వెన్స్‌ని దర్శకుడు భార్యభర్తల సంగ్రామానికి కురుక్షేత్ర వేదికగా మార్చాడు. ఇలాంటి కథల్ని లీనియర్‌గా చెప్పుకుంటూ వెళ్తే బోర్ కొడతాయి. ఈ విషయంలో తెలివిగా నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే రాసుకోవడం బాగా కుదిరింది. స్క్రీన్‌ప్లేతో ఈ కథకి కొత్త కొట్టింగ్ దొరికింది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇంటర్వెల్ సీన్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం క్లైమాక్స్‌లానే వుంటుంది. ట్రీట్మెంట్ పరంగా మంచి క్రియేటివిటీ చూపించాడు పాండిరాజ్.
కథాగమనంలోకి వస్తే… విజయ్ సేతుపతి, నిత్య పాత్రల్ని మెల్లమెల్లగా రివీల్ చేసుకుంటూ వచ్చిన విధానం ఆసక్తికరంగా వుంటుంది. ఆ పాత్రలు, కుటుంబ నేపథ్యాలు, నేటివిటీ… ఇవన్నీ కూడా భార్యభర్తల కథకు కొంత లేయర్‌ని యాడ్ చేయలిగాయి. పెళ్లికి ముందు వారి కెమిస్ట్రీ, కాపురంలో అత్త, ఆడపడుచు వేలుపెట్టడం, నిత్య ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోవడం… ఇవన్నీ కూడా ఫన్‌ఫుల్ గానే వుంటాయి. ఇకపోతే ఈ జంట వీడిపోయేటంతగా వీరి మధ్య ఏం గొడవ జరిగిందనే సస్పెన్స్‌ని చివరి వరకూ హోల్డ్ చేసిన తీరు బావుంది. అది రివీల్ చేసిన తర్వాత వాలిడ్ రీజన్‌గా కనిపిస్తుంది.
దర్శకుడు ఈ కథని ఫన్ టోన్‌లో చెప్పాలని భావించాడు, అది కొంతమేరకు కుదిరింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని నవ్వించే సన్నివేశాలు వున్నాయి. ముఖ్యంగా విజయ్, నిత్యల క్యారెక్టర్ డిజైన్ ఈ సినిమాకి బలం. సన్నివేశాలు సాదాసీదాగా ఉన్నప్పటికీ వారి పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగారు. విజయ్, నిత్య… ఈ రెండు పాత్రలూ లౌడ్, మొరటుగా వుండే పాత్రలే. పాత్రల్లో మొరటుదనం స్క్రీన్‌పై తీసుకురాగలిగారు. నిజంగా ఆ ఇద్దరూ లేకపోతే అసలు ఇలాంటి సినిమా తెరపై వచ్చేది కాదు. ఫ్యామిలీ మెంబర్స్‌గా కనిపించిన నటీనటులంతా డీసెంట్‌గా చేశారు. విజయ్ తల్లి పాత్ర చేసిన నటికి మంచి మార్కులు పడతాయి. కాళీ వెంకట్, యోగి బాబు కామెడీని యాంకర్ చేయగలిగారు. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ ఈ జానర్‌కి సరిపోయాయి.
ఈ సినిమాలో లోపాలు లేకపోలేదు. చాలా లౌడ్ డ్రామా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ లౌడ్నెస్ ఇబ్బందిపెట్టొచ్చు. అలాగే సినిమా అంతా తమిళ్ ఫ్లేవర్ కొడుతూ వుంటుంది. ఫస్ట్ ఫ్రేం నుంచే ఓ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ నేటివిటీతో డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ వుంది. సినిమా సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ కాస్త సీరియల్ తరహలో టర్న్ తీసుకుంటుంది. కథ అంతా ఒకే చోట, అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. బావ, బావమరిది ట్రాక్ అసంపూర్ణంగా వుంటుంది. చివర్లో ‘ఈగో’ ఇష్యూని టచ్ చేస్తూ కొన్ని సీన్స్ రాసుకున్నారు. ఆలుమగలు కూర్చుని మాట్లాడగలిగితే అన్నీ సమస్యలు తీరిపోతాయి. అది విడిచిపెట్టి మిగతా ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పదలచుకున్న సందేశం ఇదే. అయితే ఈ ప్రయత్నం చాలా లౌడ్‌గా, మొరటుగా వుండటం అందరికీ నచ్చే ట్రీట్మెంట్ కాదు.
ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే న్యాయస్థానాలు కూడా విడదీయలేవు. ప్రేమ లేకపోతే ఐక్యరాజ్య సమితి కూడా ఒక్కటి చేయలేదు. భార్యభర్తల గొడవలు అనంతం. అదొక జీవన వాహిని. భార్య ఒకవైపు, తల్లి, తోబుట్టువు మరోవైపు… ఈ ఇద్దరి మధ్య నలిగిపోయే భర్తలు ఎందరో… అలాంటి వారికి మాత్రం ‘సార్ మేడమ్’ పర్సనల్‌గా కనెక్ట్ అవుతుంది.
తెలుగు360 రేటింగ్ 2.25/5
–రివ్యూ బై అన్వర్