రివ్యూ: సార్

SIR Movie Telugu Review

రేటింగ్‌: 2.75/5

‘’విద్య అనేది లాభదాయకమైన వ్యాపారంలా వుండకూడదు. విద్య నాన్ నాన్ ప్రాఫిటబుల్ సర్విస్. లాభాలు ఆర్జించడాని విద్య సంస్థలు పెట్టకూడదు. అందరికీ అందుబాటులో ఫీజులు వుండాలి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తాము కోరుకునే కోర్సు చదువుకునే విధంగా ఫీజులని నిర్ణయించాలి’’ అనేక మార్లు, అనేక న్యాయస్థానాలు చెప్పిన మాటలివి. కానీ ఇలా జరుగుతుందా ? అంటే లేదు. నాన్ ప్రాఫిటబుల్ సర్విస్ గా ఉండాల్సినవిద్య .. ఈ రోజుల్లో సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలింది. క్యాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే లక్షలు కుమ్మరించాల్సిందే. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి ? లాభాపేక్షలేని సేవగా ఉండాల్సిన విద్య.. ఇంత కమర్షియల్ గా ఎలా మారిపోయింది ? ప్రభుత్వ కళాశాలకు ఆదరణ ఎందుకు తగ్గింది ? క్యాలిటీ విద్య పేరుతో కార్పోరేట్ శక్తులు ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారు ? ధనుష్ కథానాయకుడిగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన ‘సార్’లో ఈ అంశాలన్నీ ప్రస్తావనలోకి వస్తాయి. మరా ప్రస్థానం ఎలా సాగింది ? సార్ ఎలాంటి పాఠం చెప్పారు ?

1990 లో ప్రారంభమయ్యే కథ ఇది. దేశంలోని ఆర్ధిక సంస్కరణలతో సమాజంలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. సంస్కరణలతో ఇంజనీరింగ్, మెడిషన్ చదువులపై అందరిలో అవగాహనతో పాటు ఆసక్తి ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో కొంతమంది వ్యాపారవేత్తలు నాన్ ప్రాఫిటబుల్ సర్విస్ గా వుండే విద్యని పక్కా బిజినెస్ మోడల్ గా మార్చి మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బులు గుంజుకోవడం మొదలుపెడతారు. అందులో ముందువరుసలో ఉంటాడు త్రిపాఠి విద్య సంస్థల అధినేత శ్రీనివాస త్రిపాఠి ( సముద్రఖని) కావాల్సిన డబ్బులు ఇచ్చి రాష్ట్రంలోని ప్రతిభ గల లెక్చరర్స్ ని తమ సంస్థలోకి లాక్కోవడం, ప్రభుత్వ కాలేజీలని బ్రస్టుపట్టించడం, తన వ్యాపారం పెంచుకోవడం.. ఇదీ త్రిపాఠి దందా. అయితే దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పై ఒత్తిడి వస్తుంది. దీంతో ఫీజులు తగ్గించే ఒక చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దమౌతున్న తరుణంలో త్రిపాఠి మరో ఎత్తుగడ వేస్తాడు. ప్రభుత్వ కాలేజీలకు తన సంస్థ నుంచి అధ్యాపకులని పంపించి ప్రభుత్వ కాలేజీలని దత్తత తీసుకునే ఒక స్కీం తెరపైకి తీస్తాడు. తమ సంస్థలోని థర్డ్ గ్రేడ్ అధ్యాపకులని ప్రభుత్వ కాలేజీలకు పంపి అక్కడ వ్యవస్థకు ఇంకా నష్టం కలిగించి తాను బలపడాలనేది త్రిపాఠి ప్లాను. అలా త్రిపాఠి సంస్థ నుంచి సిరిపురం ప్రభుత్వ కళాశాలకు జూనియర్ మాథ్స్ లెక్చరర్ గా వస్తాడు బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు సార్ (ధనుష్) సిరిపురం వచ్చిన బాలు సార్ కి ఎలాంటి అభుభావాలు ఎదురయ్యాయి ? ఎలాంటి సవాళ్ళని ఎదురుకున్నాడు ? విద్యార్ధుల జీవితాలని ఎలా తీర్చిదిద్దాడనేది కథ.

సిరిపురం ప్రభుత్వ కళాశాలలో46 మంది విద్యార్ధుల భవిష్యత్ ని తీర్చిద్దిన లెక్చరర్ కథ ఇది. త్రీ ఇడియట్స్ స్టయిల్ లో బాలు సార్ కోసం ఓ ముగ్గురు విద్యార్ధులు అన్వేషించడంతో కథ మొదలౌతుంది. జిల్లా కలెక్టర్ గా ఎఎస్ మూర్తి (సుమంత్) బాలు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, లెక్చరర్ గా బాలు పరిచయం, సిరిపురం రావడం, మీనాక్షి (సంయుక్త) తో పరిచయం, హైపర్ ఆది జోకులు.. విద్యార్ధులతో ఎదురైనా అనుభవాలు.. ఇవన్నీ రొటీన్ గానే ఉంటాయి. పంచాయితీలో బాలు సార్ చెప్పిన ఏపీజే అబ్దుల్ కలాం కథకు చప్పట్లు పడతాయి. కుల వివక్ష గురించి సార్ చెప్పిన పాఠం కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. అయితే కథ ముందుకు నడపకుండా వరుసగా సందేశాలు ఇవ్వడం ఒక దశలో ఓవర్ డ్రామా అనిపిస్తుంది. ఈ కథలో బాలు, త్రిపాఠి పాత్రల మధ్య సంఘర్షణ వుండాలి. కానీ కథని ఓపెన్ చేసిన .. ఆ సంఘర్షణ రావడానికి ఇంటర్వెల్ బాంగ్ వరకూ టైం పాస్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ.. సహజంగా కథ నడిపినట్లు అనిపించదు. పైగా కథలో కీలకమైన కాలేజీల దత్తత గురించి చాలా సింపుల్ గా తేల్చేశాడు దర్శకుడు. ఎయిడెడ్ కాలేజీలు గురించి అవహగన లేని వారకి అంతా గందరగోళంగా వుంటుంది. ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ కాలేజీలు ఎప్పుడు దత్తత తీసుకున్నాయి ? అలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా ? అని గూగల్ లో వెదుక్కునే పరిస్థితి నెలకొంటుంది. దత్తత కి బదులు ఎయిడెడ్ కాలేజీలు అని మాట వాడివుంటే.. ప్రేక్షకుడు కథలోకి ఇంకా సహజంగా వెళ్ళే పరిస్థితి వుండేది. బహుసా ఆ పదం వాడితే చిక్కులు వస్తాయని భావించారో.. దర్శకుడు సరైనా రీసెర్చ్ చేయలేదేమో కానీ.. దత్తత అనే మాట చాలా తికమక క్రియేట్ చేసింది.

విరామం వరకూ కథ ఊహించినట్లుగానే ఉన్నప్పటికీ మరీ అంత బోర్ కొట్టకుండా ఎదో అలా సాగుతుంది. అయితే విరామం తర్వాత మాత్రం సార్ ట్రాక్ తప్పారు. పాకలో పాఠాలు చెప్పాలనుకోవడం, దాన్ని ప్రత్యర్ధులు నాశనం చేయడం, ఫైటు, పోలీసు కేసు, సిరిపురం నుంచి బహిష్కరణ.. ఇవన్నీ అంత సహజంగా వుండవు. బాలు సార్ .. సిరిపురం నుంచి వెల్లిపోతున్నపుడు విద్యార్ధులు గురువు గారిని సాగనంపిన తీరు .. హత్తుకునేలా తీశారు. తర్వాత మీనాక్షి వూరు వెళ్ళడం, ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు కథకు బలం చేకూర్చవు. సూపర్ 30 సినిమాని పోలినట్లు.. సిరిపురం ‘సూపర్ 46’ విద్యార్ధులకు ఎంసెట్ టాప్ ర్యాంకులు తీసుకొచ్చే లక్ష్యాన్ని పెట్టుకున్న బాలు సార్.. దాని కోసం వీడియో క్యాసెట్ లని ఆశ్రయించడం, మారు వేషంలో పాఠాలు చెప్పడం.. జస్ట్ ఓకే అనిపిస్తాయి. చివర్లో విద్య విలువ, నిజమైన గెలుపు గురించి చెప్పి కథని ముగించిన తీరు.. ఒక స్పీచ్ విన్నట్లుగానే వుంటుంది కానీ ఒక క్లైమాక్స్ చూసిన ఫీలింగ్ అయితే కలిగించలేకపోయింది.

ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయడమే ధనుష్ కి తెలుసు. బాలు సార్ పాత్రని కూడా చక్కగా పోషించాడు. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. ఫైట్లు కూడా బాగా చేశాడు కానీ ఈ కథకు యాక్షన్ సీన్లు అనవసరం. సంయుక్త మీనన్ అందంగా వుంది. మొదట బలంగా అనిపించిన ఆమె పాత్రని తర్వాత రొటీన్ గానే ముగించారు. సముద్రఖని రెగ్యులర్ విలనిజం పంచారు. ఆ పాత్రని ఇంకాస్త బలంగా చూపించాల్సింది. సాయి కుమార్ కి మంచి పాత్ర దక్కింది. ఆది జోకులు బావున్నాయి కానీ పాత్రకు సడన్ ప్యాకప్ చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది. తనికెళ్ళ భరణి, విద్యార్ధులు, మిగతా పాత్రధారులు పరిధిమేర చేశారు.

జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన మాస్టరు మాస్టరు పాట మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేలా వుంది. చిత్రీకరణ కూడా చక్కగా కుదిరింది. కెమరాపని తన బావుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. 90 సెట్ వరకూ ఇంకా నేచురల్ గా చేయాల్సింది. ‘విద్య అనేది గుడిలో ప్రసాదం.. పంచండి. ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లా అమ్మకండి”, అవసరానికి కులం వుండదు. అవసరం లేని మనిషి ఉండడు’.లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. దర్శకుడు వెంకీ అట్లూరి ఒక కథలో చాలా సందేశాలు విషయాలు చెప్పెయాలనే ప్రయత్నం చేశాడు. అయితే చర్చించాల్సిన కీలకమైన అంశాలపైనే పెద్ద కసరత్తు చేయాలేదనిపించింది. ఒక సందేశాత్మక చిత్రం కొత్త స్ఫూర్తిని నింపాలి. అలోచింప జేయాలి. అప్పుడది మంచి సినిమా జాబితాలో చేరుతుంది. ‘సార్’ లో సందేశం వుంది. ఆ ప్రయత్నం కూడా మంచిదే. అయితే అది ఒక ‘కొత్త’ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం అయితే కాదు.

రేటింగ్‌: 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

కన్నప్ప.. అంతా శివయ్య మహిమ

https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. నిమిషన్నర నిడివి గల టీజర్ లో యాక్షన్ ఘట్టాలకు పెద్దపీట వేశారు....

అందుకే.. వంగలపూడి అనితకు హోంశాఖ!

ఏపీలో అత్యంత కీలకమైన హోంశాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా నేత వంగలపూడి అనితకు కేటాయించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ సభ్యులను కూడా కాదని అనితకు హోంశాఖను కేటాయించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది....

విష్ణు క‌న్న‌ప్ప వెనుక కృష్ణంరాజు

రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'క‌న్న‌ప్ప‌'. త‌న సొంత బ్యాన‌ర్‌లో బాపు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం కృష్ణంరాజుకు న‌టుడిగా, నిర్మాత‌గా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాని ప్ర‌భాస్‌తో...

తీహార్‌ జైల్లో కవితను కలిసిన కేటీఆర్

తీహార్ జైల్లో ఉన్న కవితతో చాలా రోజుల తర్వాత కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆమె కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close