తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్ నుండి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు సన్నాహక పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అంశంలో అధికారులకు శిక్షణ కూడా ప్రారంభించారు.
ప్రతి ఒక్కరికీ వెరీఫికేషన్ తప్పదు !
ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలన్నా, కొత్తగా నమోదు చేసుకోవాలన్నా ఈ ప్రక్రియలో పాల్గొనడం అత్యవసరం. ఏప్రిల్ నుండి బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి మూడు నుండి నాలుగు సార్లు స్వయంగా వస్తారు. మొదటి సందర్శనలో మీకు ఎన్యూమరేషన్ ఫామ్ అందజేస్తారు. 2002-2004లో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత సుమారు 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇటువంటి భారీ కార్యక్రమం చేపడుతున్నందున, ఓటర్లందరూ తమ వివరాలను సరిచూసుకోవడం ముఖ్యం.
ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిందే!
వలసల వల్ల ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం, మరణించిన వారి పేర్లు జాబితాలో అలాగే ఉండటం వంటి లోపాలను సరిదిద్దడమే ఈ సిర్ ప్రధాన లక్ష్యం. ఇంటింటి సర్వే సమయంలో అధికారులు మీ నివాస ధృవీకరణను పరిశీలిస్తారు. ఒకవేళ మీరు ఆ సమయంలో ఇంట్లో లేకపోయినా, అధికారులు మళ్లీ వస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుల ద్వారా తమ వివరాలను అనుసంధానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఓటు కోల్పోకుండా చూసుకోవడం ముఖ్యం !
ఓటు హక్కును కాపాడుకోవడానికి పౌరులు తమ బూత్ స్థాయి ఏజెంట్లు లేదా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి అర్హులు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫామ్-7 ద్వారా, తప్పుల సవరణకు ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు అనేది మీ వజ్రాయుధం, కాబట్టి ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పాల్గొని మీ పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోండి.
