జోగి రమేష్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. కల్తీ మద్యం కేసులో ఆయనపై చార్జిషీటును సిట్ అధికారులు దాఖలు చేశారు. తాము చేసిన ఆరోపణలన్నింటికీ ఆధారాలు జత చేశారు. అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరూ జోగి రమేష్‌కు ఆయన సోదరుడికి పెద్ద ఎత్తున ముట్టచెప్పిన ముడుపుల వివరాలన్నీ చార్జిషీట్ లో ఉన్నాయి. వాళ్లెవరో అసలు తెలియదని వాదించే ప్రయత్నం చేసిన జోగి రమేష్‌కు ఈ ఆధారాలన్నీ పెద్ద షాక్ లాంటివే.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నం కేంద్రంగా నకిలీ మద్యం తయారీ, సరఫరాలో జోగి రమేష్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారని సిట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. నిందితులతో ఆయనకు దశాబ్ద కాలపు అనుబంధాన్ని కూడా చార్జిషఈటులో వివరించారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుతో కలిసి జోగి రమేష్ గతంలో వ్యాపార లావాదేవీలు జరిపారని, ఆ చొరవతోనే మంత్రి హోదాలో ఈ అక్రమ మద్యం ముఠాకు పూర్తి రక్షణ కల్పించారని దర్యాప్తులో తేలింది.
ముఠా సభ్యుల నుండి జోగి రమేష్‌కు చేరిన ముడుపుల విషయంలో సిట్ కీలక సాక్ష్యాలను సేకరించింది. ఈ దందా సాఫీగా సాగేందుకు ప్రతి రెండు మూడు నెలలకోసారి నిందితులు రూ. 3 నుండి 5 లక్షల వరకు జోగి రమేష్‌కు లేదా ఆయన అనుచరులకు బదిలీ చేశారు. కాల్ డేటా రికార్డులు , నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌లు , బ్యాంక్ లావాదేవీల వివరాలను ఛార్జిషీట్‌కు జత చేశారు.
ప్రభుత్వం మారాక.. కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి కూడా ఈ నకిలీ మద్యం దందాను జోగి రమేష్ ప్రోత్సహించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది” అనే ముద్రను ప్రస్తుత ప్రభుత్వంపై వేసేందుకు, గత ఏడాది ఏప్రిల్‌లో ఈ తయారీని పునఃప్రారంభించాలని రమేష్ ఒత్తిడి చేసినట్లు ఛార్జిషీట్లో వివరించారు. ఇవన్నీ కేవలం ఆరోపణలు కాకపోవడం ఆధారాలతో సహా ఉండటంతో జోగికి గట్టి షాక్ తగిలినట్లయిందని భావిస్తున్నారు.
