ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎలా ఇస్తారని హరీష్ రావు ఎదురుదాడి చేస్తున్నారు కానీ.. కేసీఆర్ చేసిన ఒ తప్పిదం వల్ల ఆయనకు చిక్కులు వచ్చి పడబోతున్నాయని చెబుతున్నారు. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు వ్యవహారం బయటపడినప్పుడు కేసీఆర్ నందకుమార్, స్వామిజీలు మాట్లాడిన ఆడియోలతో పాటు పలు కీలకమైన డాక్యుమెంట్లను అప్పటి సీఎం కేసీఆర్ విడుదల చేశారు. వాటిని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు పంపించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఆరా తీయడానికి ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలోని సిట్ చాలా వేగంగా స్పందిస్తోంది. ఇప్పటి వరకూ గత దర్యాప్తు బృందం ప్రశ్నించడానికి మొహమాటపడిన పెద్దల్ని ఇప్పుడు నిర్మోహమాటంగా పిలిచి ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ , అప్పటి డిజిపి మహేందర్ రెడ్డి లను వి పిలిచి ప్రశ్నించారు. దాదాపుగా రెండు, మూడు గంటల పాటు వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ గురించి వారికి ఎంత వరకు అవగాహన ఉంది… అన్నీ తెలిసి సైలెంటుగా ఉన్నారా అన్న విషయాలను ఆరా తీశారు.
మరో వైపు సిట్ లోని మరో బృందం.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంపై దృష్టి పెట్టింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో జరిగిన ఆ వ్యవహారంలో కీలక నిందితుడు అయిన నందకుమార్ వద్ద స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన గతంలోనే ఆరోపించారు. గంటన్నర పాటు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ కీలక విషయాలను రాబట్టింది. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా కేసీఆర్ కు.. అలాగే ఆ కేసులో భాగం అయిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
