మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సమగ్ర విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసు మూలాలను, దుబాయ్ లింకులను ఛేదించేందుకు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
రాజకీయ నాయకులు , పారిశ్రామికవేత్తలు ఈ కేసులో పట్టుబడటంతో, విచారణలో ఎక్కడా రాజీ పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిట్ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనుంది. మొదటిది, ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? దీని వెనుక ఉన్న దుబాయ్ లింకులు ఏమిటి? అన్న కోణంలో దర్యాప్తు జరగనుంది. రెండవది, పోలీసుల తనిఖీ సమయంలో జరిగిన గన్ ఫైరింగ్ ఉదంతం. నిందితులు పోలీసులను బెదిరించేందుకు కాల్పులు జరిపారా లేదా అనేది సిట్ తేల్చనుంది. ఇక మూడవది, ఈ పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్తల ఆర్థిక లావాదేవీలు ,వారి రియల్ ఎస్టేట్ నెట్‌వర్క్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు నమిత్ శర్మ, రితేష్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయగా, వీరికి ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఒక వైపు బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుండగా, ప్రభుత్వంపై బురద చల్లడానికే ఈ కేసులు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రోహిత్ రెడ్డిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ ఆదేశించింది.


