సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చిత్తూరు వైసీపీ ఇంచార్జ్, పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ గా పేరు తెచ్చుకున్న విజయానందరెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. లిక్కర్ స్కాంలో చాలా లెక్కల వ్యవహారాలకు సంబంధించిన వివరాల కోసం ఈ సోదాలు నిర్వహించారు.ఇరవై మందితో కూడిన సిట్ టెక్నికల్ సిబ్బంది కూడా మొత్తం పరిశీలించారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
లిక్కర్ స్కాంలో విచారణకు వెళ్లి సోదాలు చేస్తే ఇతర వ్యవహారాలు ఎన్ని బయటపడతాయో అన్నది ఇప్పుడు చెవిరెడ్డి అనుచరుల్లో ఆందోళనగా ఉంది. చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయానందరెడ్డిపై పదుల సంఖ్యలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ఆయన ఒత్తిడి కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరీ విజయానందరెడ్డికి టిక్కెట్ ఇచ్చారని భావిస్తున్నారు. వీరిద్దరూ పార్టనర్స్ అని చంద్రగిరిలో చెప్పుకుంటారు. అది ఎందులో అన్నది తాజా సోదాల్లో బయటపడి ఉంటే మాత్రం మరిన్ని ఇబ్బందుల్లో చెవిరెడ్డి పడటం ఖాయంగా కనిపిస్తోంది.
చెవిరెడ్డి ఆర్థిక వ్యవహారాలు ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంటాయి. ఆయన అసువుగా కోట్లకు కోట్లు నగదు ఖర్చు పెడతారు. అది ఎలా వస్తుందన్న లింకులు బయటకు లాగనున్నారు. విజయానందరెడ్డి వ్యవహారాలూ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చెవిరెడ్డి ఏదో విధంగా తిరుపతికి రావాలని ప్రయత్నిస్తున్నారు. నడుంనొప్పికి ప్రకృతి చికిత్స స్విమ్స్ లో తీసుకుంటానని కోర్టును అడిగారు. కానీ ఈ లోపు ఆయనపై మొత్తం వివరాలు బయటకు లాగుతున్నారు. తదుపరి సిట్ అధికారులు దాఖలు చేయబోయే చార్జిషీట్లో చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు వ్యవహారాలన్నీ బయట పెట్టే అవకాశం ఉంది.