తిరుమల శ్రీవారి నెయ్యిని కల్తీ చేసి ఐదేళ్ల పాటు భక్తులకు నాసిరకం ప్రసాదం అంటగట్టిన వైనంలో సీబీఐ సిట్ విచారణ పూర్తి చేసి తుది చార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో అంతిమ లబ్దిదారులుగా ఆరోపణలు ఉన్న వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి వారి పేర్లు లేవు. కానీ వైవీ సుబ్బారెడ్డి పీఏగా పని చేసిన చిన్న అప్పన్న అనే వ్యక్తి పేరు ప్రధానంగా ప్రస్తావించారు.
ఏ మాత్రం పలుకుబడి లేని ఓ సామాన్య వ్యక్తి డెయిరీలను బెదిరించి నెయ్యి కి కమిషన్ వసూలు చేసి నకిలీ నెయ్యి సరఫరా చేసినా దాన్ని ప్రసాదం వరకూ ఎలా పంపగలడో సీబీఐ సరిగ్గా అంచనా వేయలేకపోయింది. ఆయన పేరును మాత్రం అడ్డం పెట్టుకుని మిగతా వాళ్లంతా తమ దోపిడీ చేశారు. దేవుడ్ని.. దేవుడి భక్తులను దోచుకున్నారు. దాదాపుగా ఏడాది పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు నియమించిన సిట్.. చాలా వరకూ విషయాలను బయట పెట్టినా సూత్రధారుల వద్దకు మాత్రం వెళ్లలేకపోయిందని చార్జిషీటును బట్టి అర్థమవుతోందని న్యాయవాద నిపుణులు చెబుతున్నారు.
నెల్లూరు కోర్టులో సీబీఐ సిట్ చార్జిషీటు దాఖలు చేసింది. విచారణ పూర్తి చేసింది. అంటే కొత్తగా నిందితులు.. సూత్రాధారులు ఎవరైనా బయటపడాలంటే మళ్లీ విచారణ చేయాలి. అప్పన్న కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు.. అప్పన్న వసూలు చేసిన డబ్బులు ఎవరికి ఇచ్చారు.. అప్పన్న పేరుపై ఉన్న ఆస్తులకు ఎవరు బినామీలాంటివన్నీ తెలితే..కేసు ముగిసిపోతుంది. కానీ సీబీఐ సిట్ అక్కడి వరకూ వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని స్పష్టమవుతోంది.
