ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సాయంత్రం ఏడున్నర వరకూ సిట్ అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించారు. నాలుగున్నర గంటల పాటు ముందుగా సిద్ధం చేసిన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. విచారణ మొత్తం వీడియో తీశారు. ప్రధానంగా ప్రశ్నలు ప్రభాకర్ రావు నియామకం.. వారు ఫోన్లు ట్యాప్ చేయడానికి ఆదేశాలు ఇచ్చిన అంశాలపై వివరాలు తెలుసుకునే దిశగా విచారణ సాగినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ అసలు తాను ఎవరికీ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇవ్వలేదని.. తనకు ఇంటలిజెన్స్ విభాగం ఎప్పుడూ బ్రీఫింగ్ కూడా ఇవ్వలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనేది అంతర్గతంగా పోలీసు శాఖ చూసుకునే విషయమని వాటి వివరాలు ముఖ్యమంత్రికి కూడా చెప్పాలన్న రూల్ లేదని ఆయన గుర్తు చేసినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ విచారణాధికారులకు కొన్ని ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది.
విచారణ బృందంలో సిట్ చీఫ్ సజ్జనార్ లేరు. కానీ ఆయన ఎప్పటికప్పుడు విచారణను పర్యవేక్షించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నత స్థాయిలో అందర్నీ ప్రశ్నించినట్లు అవుతుంది. తదుపరి సిట్ ఎలాంటి అడుగులు వేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.
