లిక్కర్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టులో వస్తున్న బెయిల్స్ పై సిట్ హైకోర్టును ఆశ్రయిస్తోంది. సహజంగా ఇలాంటి కేసుల్లో దిగువ కోర్టుల్లో బెయిల్ రావడం దాదాపుగా అసాధ్యం. పై కోర్టుల్లోనే వారి బెయిల్ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. కానీ ఏసీబీ కోర్టులోనే వారికి బెయిల్స్ వస్తున్నాయి. ఇప్పటికే కీలకమైన నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి వంటి వారు బయటకు వచ్చారు. డిఫాల్ట్ బెయిల్ లభించింది వారికి. మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చారు. వీరి బెయిళ్లను రద్దు చేయాలని సిట్ హైకోర్టును ఆశ్రయించింది.
ఏసీబీ కోర్టు తాము చార్జిషీటు సమయానికే దాఖలు చేసినా.. బెయిల్ ఇచ్చిందని సిట్ హైకోర్టులో వాదిస్తోంది. విడుదలవుతున్న నిందితులు అంతా.. కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలవారేనని అంటోంది. అయితే ఓ సారి బెయిల్ వచ్చిన తర్వాత హైకోర్టు కూడా రద్దు చేయడం క్లిష్టమైన వ్యవహారమే. ఇప్పటికే విడుదలైన ముగ్గురి విషయంలో హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పుడు మిథున్‌రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైనా విచారణ జరపనుంది.
లిక్కర్ స్కామ్ కేసులో మనీ ట్రయల్ కూడా సిట్ చూపిస్తోంది. పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారని చెబుతోంది. అలాగే సూట్ కేసు కంపెనీల పేరుతో డబ్బులు లాండరింగ్ అయ్యాయని వివరాలు రాబట్టారు. ఈడీ కూడా మనీ లాండరింగ్ చేసినట్లుగా అనుమానాలు ఉన్న వారిపై దాడులు చేసింది. ఆ వివరాలన్నింటితో సూత్రధారిని బయట పెట్టాల్సి ఉంది. అది ఎంత త్వరగా జరిగితే.. కేసు అంత బలంగా ఉంటుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.