గజిని, తుపాకీ లాంటి సినిమాలతో తనదైన మార్క్ వేసిన దర్శకుడు మురుగదాస్. మురుగదాస్ ఎంచుకొనే కాన్సెప్టులు.. స్క్రీన్ ప్లే భలే ఉండేవి. అయితే క్రమంగా మురుగదాస్ తన మార్క్ కి దూరమయ్యాడు. పరాజయాలు పలకరించాయి. పెద్ద స్టార్లు అవకాశాలు ఇచ్చినా, వాటిని వృధా చేసేశాడు. ఇప్పుడు తన నమ్మకమంతా ‘మదరాసీ’పైనే. శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా ఇది. సెప్టెంబరు 5న విడుదల అవుతోంది. శివ కార్తికేయన్ మంచి ఫామ్ లో ఉండడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. సప్త సాగరాలు ఫేమ్.. రుక్మిణి వసంతన్ కథానాయికగా నటించడం మరో ఆకర్షణ. ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ లో కాన్సెప్ట్ మొత్తం రివీల్ చేసేశాడు మురుగదాస్. ఇతరుల్ని కూడా తనలానే ప్రేమించే ఓ వ్యక్తి కథ. లోకల్ మేడ్ ఆయుధాల్ని తమిళనాడు తరలించి, విధ్వంసం సృష్టించాలనుకొనే ఓ ముఠాని ఎలా ఆపాడు? అనేదే కాన్సెప్ట్. ట్రైలర్ చూస్తే.. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాలా కనిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా డిజైన్ చేశారని అనిపిస్తోంది. శివకార్తికేయన్ బాగా కష్టపడ్డాడు. మురుగదాస్ సినిమాల్లో స్క్రీన్ ప్లే బాగుంటుంది. లవ్ స్టోరీ కొత్తగా రాసుకొంటాడు. ఆ మ్యాజిక్ ఈ సినిమాలో కనిపిస్తే.. మురుగదాస్ హిట్ కొట్టినట్టే. అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. పాటలెలా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టడం అనిరుథ్కి మామూలే. ఈసారీ.. తనపైనే ఎక్కువ భారం పడినట్టు కనిపిస్తోంది. సెప్టెంబరు 5న తెలుగులో ‘ఘాటీ’ కూడా విడుదల అవుతోంది. ఆ సినిమాతో `మదరాసి`కి గట్టి పోటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ‘మదరాసి’ ప్రమోషన్లు తమిళనాట ఇప్పటికే మొదలయ్యాయి. తెలుగులో కూడా ప్రమోషన్లు గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది.