ఇండియన్ సెల్యులాయిడ్ పై శివ ఓ ట్రెండ్ సెట్టర్…
సినిమా మేకింగ్ టేకింగ్ రైటింగ్ స్టైల్ ని మార్చేసిన కల్ట్ క్లాసిక్.
శివ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకొన్నా.. ఎంత చెప్పుకొన్నా ఎన్నో కొన్ని మిగిలిపోయే ఉంటాయి. అంతటి ప్రభావాన్ని చూపించిన సినిమా.. శివ.
రేపు అంటే.. నవంబరు 14న శివకు ఆధునిక హంగులు జోడించి రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు..
* రామ్ గోపాల్ వర్మ తొలి సినిమా శివ. అయితే… శివ కంటే ముందు `రాత్రి` అనే కథ రాశాడు వర్మ. హారర్ జోనర్లో సాగే ఈ కథ నిర్మాత అక్కినేని వెంకట్ కు ఏమాత్రం నచ్చలేదు. దాంతో వెంటనే కాలేజీ బ్యాక్ డ్రాప్ లో నడిచే `శివ` అనే పాయింట్ తో కథ తయారు చేసుకొన్నాడు వర్మ. `రాత్రి` కథ వెంకట్ కి నచ్చితే.. అదే వర్మ తొలి సినిమా అయ్యేది.
* హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి శివపై చాలా ఉంది. బ్లూసీ నటించిన ఎంటర్‌ది డ్రాగన్ సినిమాని కాపీ కొట్టి ఈ కథ రాశా అని వర్మ చాలా సందర్భాల్లో చెప్పాడు. క్లైమాక్స్ ఫైట్ లో కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది.
* టెక్నీషియన్ల లిస్టులో వర్మ రాసిన తొలి పేరు ఎం.ఎం కీరవాణి. సంగీత దర్శకుడిగా కీరవాణిని ఎంచుకోవాలని వర్మకు బలంగా ఉండేది. కానీ నాగార్జున ఒప్పుకోలేదు. దర్శకుడిగా తొలి సినిమా కాబట్టి, అనుభవజ్ఞులైన సంగీత దర్శకుడి అవసరం ఉండాలని నాగ్ భావించాడు. అందుకే ఇళయరాజాని తీసుకొన్నారు. ఇళయరాజా రాకతో ఈ సినిమా సౌండింగ్ పూర్తిగా మారిపోయింది. నేపథ్య సంగీతంలో కొన్ని ప్రయోగాలు చేశారు ఇళయరాజా.. అవన్నీ ఈ సినిమా స్థాయిని పెంచాయి.
* హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో కనిపించే నటీనటులందర్నీ ఆడిషన్స్ చేసి ఎంచుకొన్నారు. జేడీ చక్రవర్తి కూడా ఇలానే ఆడిషన్స్ ద్వారా ఎంచుకొన్న నటుడే. ఈ పాత్రలకు వర్మ ఏదో యాధృచ్చికంగా పేర్లు పెట్టలేదు. విజయవాడ సిద్దార్థ్ కాలేజీలో తన స్నేహితుల పేర్లే.. యదాతథంగా వాడేశాడు.
* వర్మ స్క్రిప్టు రాసుకొన్నప్పుడు హీరో పాత్రకు భవానీ అని, విలన్ పాత్రలకు శివ అని పేర్లు పెట్టాడు. అయితే నాగార్జునకు శివ అనే పేరు బాగా నచ్చింది. దాంతో విలన్ పాత్రకు భవానీ అని పెట్టి, హీరోకు శివ అని మార్చాల్సివచ్చింది. లేదంటే ఈ సినిమా టైటిల్ కాస్త… భవానీ అయ్యేది.
* అప్పటికే కామెడీ చిత్రాల రైటర్‌గా పేరు తెచ్చుకొన్న తనికెళ్ల భరణిని సంభాషణ రచయితగా ఎంచుకొన్నారు. భరణి తనదైన స్టైల్ లో కామెడీ మిక్స్ చేసి, జోకులతో స్క్రిప్టు పూర్తి చేశారు. కానీ తన సినిమాలో ఒక్క జోకు కూడా వినిపించకూడదని వర్మ ఆర్డర్ వేయడంతో తనికెళ్ల భరణి స్క్రిప్టుని రీరైట్ చేయాల్సివచ్చింది. భరణి స్క్రిప్టు రాస్తూ. రాస్తూ.. `భవానీ.. భవానీ` అని గట్టిగా తనలో తాను అనుకొంటుంటే.. వంటింట్లోంచి భరణి అర్థాంగి పరుగు పరుగున వచ్చేవార్ట. ఎందుకంటే భరణి భార్య పేరు కూడా భవానీనే.
* ఫైట్ మాస్టర్లు రెగ్యులర్ పేట్రన్ లో ఫైట్స్ కంపోజ్ చేయడం వర్మకు నచ్చలేదు. నా సినిమాలో హీరో కొడితే పది మంది గాల్లో లేచే సీన్లు వద్దు అని తెగేసి చెప్పారు. ఆయనే ఓ ఫైట్ కంపోజ్ చేసి చూపించారు. నాకు ఇలాంటి ఫైట్లు మాత్రమే కావాలి.. అని గైడ్ చేశారు. అలా.. ఈ సినిమా కోసం వర్మ ఫైట్ మాస్టర్ అవతారం ఎత్తాల్సివచ్చింది,
* నానాజీ పాత్రకు చాలామంది నటుల్ని అనుకొన్నారు. ఓ పెద్ద నటుడి దగ్గరకు వెళ్తే.. `డైరెక్టర్ ఏమిటి ఇలా ఉన్నాడు.. ఇతనేం సినిమా తీయగలడు?` అని ఒప్పుకోలేదట. ఓ రోజు భరణి సరదాగా సెట్ కి వెళ్తే.. `మనకు నానాజీ ఇంకా దొరకలేదు కదా.. ఆ పాత్ర మీరే ఎందుకు చేయకూడదు` అని భరణిని బలవంతంగా ఒప్పించార్ట వర్మ. పదంటే పది నిమిషాల్లో భరణి నానాజీ గెటప్‌లోకి మారిపోయారు. ఆ సినిమా రచయితగానే కాదు, నటుడిగానూ భరణికి మంచి మైలేజీ ఇచ్చింది.
* కేవలం 55 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశారు వర్మ. రఘువరన్‌తో సహా ఎవరి పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకొన్నారు. బడ్జెట్ కూడా 75 లక్షల లోపే అయ్యింది. చెన్నైలో యూనియన్ స్ట్రైక్ జరగడం వల్ల.. రీ రికార్డింగ్ పనులు ముంబైలో పూర్తి చేశారు.
* ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో… చిత్రంలో పని చేసినవాళ్లందరికీ శివ పేరుతో బంగారపు ఉంగరాలు చేయించి కానుకగా పంపించారు అక్కినేని నాగేశ్వరరావు. వంద రోజుల సందర్భంగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఓ పేపర్ ప్రకటన రూపొందించాలనుకొన్నారు. కానీ వర్మ తిరస్కరించారు. `ప్రేక్షకులకు మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే తిరిగి నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా.. నేనెందుకు చెప్పాలి` అంటూ లాజిక్ తీశారు. దాంతో నాగేశ్వరరావు సైతం ఆశ్చర్యపోయార్ట.


