రెడ్ బుక్, బ్లూబుక్, పింక్బుక్ల్లాంటివేమీ ఉండవు.. కానీ ఖాకీ బుక్ ఉంటుంది. సోషల్ మీడియాలో గీత దాటితే తాటతీయడం ఖాయమని తెలంగాణ కొత్త డీజీపీ శివధర్ రెడ్డి గట్టి ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ డీజీపీకే కాదు.. ఏపీ డీజీపీకి కూడా ఇదే పెద్ద సమస్య. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఇదే అంశంపై ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. సోషల్ సైకోలను అసలు ఉపేక్షించవద్దని అన్నారు.
రాజకీయ పార్టీల నాయకత్వాల్లో నేరమనస్థత్వం ఉంటే.. దానికి తగ్గట్లుగా కింది స్థాయి సోషల్ మీడియా క్యాడర్ కూడా అదే దారి పడుతోంది. వ్యక్తిత్వ హననం చేయాలని టార్గెట్ గా పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా లీడర్లు, వారి కుటంబసభ్యులపై హీనంగా మాట్లాడుతున్నారు. వారిని చూసి మరొకరు ఇలా అందరూ అదే దారిలో పడుతున్నారు. ఏపీ అయినా..తెలంగాణ అయినా అంతే. ప్రభుత్వంపై ఆగ్రహం అంటూ రోడ్డున పోయే వారిని కూడా పార్టీ ఆఫీసులకు పిలుచుకువచ్చి పదో పరకో చేతిలో పెట్టి తిట్టించిన సందర్భాలు ఉన్నాయి.
రాజకీయం ఇలా వికృతంగా మారడంతో సోషల్ మీడియా కూడా రాక్షసంగా మారింది. అందుకే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కట్టడి చేయాలనుకుంటున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వేచ్ఛ ఇలా బూతులు తిట్టడానికి, మార్ఫింగ్లు వేయడానికి కాదని పోలీసులు గట్టిగానే తెలియచెప్పబోతున్నారు.