ఏ విషయంలోనైనా సూటిగా, ఘాటుగా స్పందించే గుణం శివాజీ సొంతం. ఆ నైజమే ఆయన్ని సామాన్యులగా మరింత దగ్గర చేసింది. ఇటీవల ఆయన మల్టీప్లెక్సుల వైఖరిపై గళం విప్పారు. పాప్కార్న్, కూల్ డ్రింక్, కాఫీ రేట్లతో ప్రేక్షకుల్ని దోచుకొంటున్నారని దుయ్యబెట్టారు. ”ఒక్క కాఫీ రూ.350 ఏమిటండీ…? నేను ఇంట్లోఇ వారమంతా ఫ్యామిలీతో కలిసి తాగినా ఇంత ఖర్చు అవ్వదు” అని బహిరంగంగానే తన అసహనం వెళ్లగక్కారు. మల్టీప్లెక్సుల్లో జరుగుతున్న ఈ దోపిడీ వల్లే ప్రేక్షకుల ఓటీటీలకు దగ్గరవుతున్నారని ఆవేదన వెళ్లగక్కారు.
ఇప్పుడు తెలుగు360 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. లిక్కరు అమ్ముకొనే అవకాశం కల్పించమని మల్టీప్లెక్సులు ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాలను వేడుకొంటున్నాయని, అదే జరిగితే.. సినిమాని మందులో మంచింగ్ కోసం వాడేసుకొంటారని హెచ్చరించారు శివాజీ. నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికే మల్టీప్లెక్సులు సినిమాని తమ వ్యాపారం కోసం ఇష్టం వచ్చినట్టు వాడుకొంటున్నాయి. ఇక లిక్కరు అమ్ముకొనే ఛాన్సూ వాళ్లకు ఇచ్చేస్తే దోపిడీకి పట్టపగ్గాలు ఉండవు. అదృష్టం కొద్దీ.. ప్రభుత్వాలు మల్టీప్లెక్సుల విజ్ఞాపన పట్టించుకోలేదు. కానీ పీవీఆర్, ఐనాక్స్ లాంటి సంస్థలు ఇప్పటికీ… తమ ప్రయత్నాలు ఆపలేదని, చిన్న అవకాశం దక్కినా, మద్యం అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
సింగిల్ స్క్రీన్లు పడగొట్టి, మల్టీప్లెక్సులకు అలవాటు చేయడం వెనుక కూడా పెద్ద కుట్రే ఉందన్నది సినీ విశ్లేషకుల మాట. థియేటర్లకు వెళ్లడానికి ప్రేక్షకుల్ని భయపెట్టగలిగితే, వాళ్లంతా ఓటీటీలకు అంకితం అవుతారు. ఓటీటీ మార్కెట్ మరింత బలపడుతుంది. సింగిల్ స్క్రీన్లు ఎంతగా కరిగిపోతే…. ఓటీటీ ప్రాబల్యం అంత పెరుగుతుందన్న సత్యాన్ని చిత్రసీమ ఎంత త్వరగా అర్థం చేసుకొంటే అంత మంచిది.


