నటుడిగా, నిర్మాతగా శివాజీ పరిచయమే. కొన్నాళ్ల పాటు ఆయన పొలిటికల్ గానూ బిజీగా ఉన్నారు. ఆ తరవాత రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పుడు నటుడిగా, నిర్మాతగా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే మధ్యలో శివాజీ రియల్ ఎస్టేట్ రంగంలోనూ ప్రవేశించారు. అక్కడ కొంతమేర సంపాదించారు కూడా. భూమి పై పెట్టుబడి పెడితే, రూపాయికి రూపాయి వస్తుందన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ఓ దశలో రియల్ ఎస్టేట్ ద్వారా శివాజీ బాగా సంపాదించారన్న ప్రచారం కూడా జరిగింది. వీటిపై తెలుగు360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టారు శివాజీ.
రియల్ ఎస్టేట్ లో తాను సంపాదించిన మాట వాస్తవమే అని, అయితే జనాలు అనుకొంటున్నట్టు మరీ కోట్లకు కోట్లు కూడబెట్టలేదని, ఓ మోస్తరు మాత్రమే ఆర్జించానని చెప్పుకొచ్చారు. తాను అప్పట్లో కొని, అమ్మేసిన భూములు ఇప్పుడు వందల కోట్లకు పడగలెత్తాయని, ఫైనాన్షియల్ డిస్టిక్ట్ లో 18 ఎకరాలు కొని, అమ్మేశానని, ఇప్పుడు ఆ స్థలం విలువ దాదాపు 18 వందల కోట్లని చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో కొని, అమ్మేయడం మామూలే అని, ఇప్పటి రేట్లు చూసి నష్టపోయామని అనుకోవడానికి వీల్లేదని చెప్పుకొచ్చారు.
శివాజీ నటించి, నిర్మించిన `’సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. లయ కీలక పాత్ర పోషించారు. `లెనిన్`లోనూ శివాజీ ఓ కీలక పాత్ర పోషించారు. అఖిల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.
