వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారు. వారంతా కీలక సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు. ఈ చనిపోవడాల గురించి మాట్లాడుకుంటే మొదట పరిటాల రవి కేసు గుర్తుకు వస్తుంది. పరిటాల రవి హత్యకేసులో సాక్షులు కూడా వరుసగా చనిపోయారు. ఇప్పుడు అదే సీరిస్ వివేకా కేసులో నడుస్తోంది.
వివేకా కేసులో ఇప్పటికి ఆరుగురు సాక్షుల మరణాలు
2019 మార్చ్ 15 న జరిగిన వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ముందు గుండెపోటు అన్నారు. గాయాలకు కుట్లు వేసి కనపడకుండా పూలు చల్లేసి అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. పోస్టుమార్టమ్ చేయాల్సిరావడం అది హత్య అని తేలిన తర్వాత దానిని చంద్రబాబుపై కట్టేశారు. తర్వాత అవసరాన్ని బట్టి ఈ హత్యను వివేకా కుమార్తె, అల్లుడిపైకే నెట్టే ప్రయత్నం చేసారు. అప్పటి నుంచి సాక్షులు ఒకరొకరుగా చనిపోతున్నారు. ఇప్పటికి ఆరుగురు చనిపోయారు.
శ్రీనివాస రెడ్డి అనే సాక్షి 2019 లో చనిపోయాడు. ఆత్మహత్య అని డిసైడ్ చేసిన పోలీసులు కేసు క్లోజ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ సాక్షి మరణం చోటు చేసుకుంది. సిట్ పోలీసులు వేధించారని కూడా పోలీసులు చెప్పారు అంటే.. ఈ మరణం వెనుక ఏం ఉందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈసీ గంగిరెడ్డి చనిపోయారు. భారతి రెడ్డి తండ్రి.వివేకా బాడీకి కవరప్ చేశారు. గంగాధర్ రెడ్డి అనే సాక్షి కూడా చనిపోయారు. రూ. 10 కోట్లు ఇస్తాం మర్డర్ కేసు నీ మీద వేసుకో అని శివశంకర్ రెడ్డి బెదిరిస్తున్నారు అని సీబీఐకి చెప్పాడు. తర్వాత మాట మార్చాడు. అనారోగ్యంతో చనిపోయాడు.
జగన్ రెడ్డి డ్రైవర్ నారాయణ కూడా చనిపోయారు. వివేకానందరెడ్డి చనిపోయారని తెలిసిన తర్వాత జగన్ ఆఘమేఘాలపై పులివెందుల వెళ్లలేదు. ఆర్చుకుని..తీర్చుకుని ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న హెలికాఫ్టర్లు ఉన్నా హైదరాబాద్ నుంచి కారులోనే వెళ్లారు. జగన్, భారతి ఇద్దరూ కారులో వెళ్తూ చాలా పనులు చక్కబెట్టారు. ఆ సమయంలో కారు నడిపింది నారాయణ. వారు మాట్లాడుకున్నదంతా విన్న నారాయణ ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవల 30ల్లోనే ఉన్న డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోయాడు. వివేకా బాడీ కి కవరప్ చేయడంలో సహాయం చేసిన వ్యక్తి. జగన్ కోడికత్తికి రోజుల తరబడి వైద్యం చేసిన ఆస్పత్రిలో నెలల తరబడి కోమాలోకి ఉండి చనిపోయే ముందు ఏఐజీకి తరలించారు. అక్కడే చనిపోయినట్లుగా ప్రకటించారు. తాజాగా వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న చనిపోయారు. సాక్షులు చనిపోతున్నారని మొత్తుకుంటూ వివేకా కుమార్తె హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇప్పుడు మంత్రివర్గంలో కూడా దీనిపై చర్చ జరిగింది. అత్యంత క్రూర రాజకీయ నేతలు చట్టాలను అపహాస్యం చేస్తూ ఏం చేస్తున్నారో కళ్ల ముందు కనిపిస్తున్నా ఏం చేయాలేని నిస్సహాయత ప్రజల్ని కూడా నిర్వేదానికి గురి చేస్తుంది. ఇది వ్యవస్థలకు మంచిది కాదు.