రివ్యూ: స్కెచ్ అని తెలిసీ..

తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5

ఇదియొక తమిళ చిత్రము యొక్క అనువాదము.

ఓ ఫైట్ సీన్, ఓ మామూలు సీన్, ఓ లవ్ సీన్ ఇలా ఒకదానికి వెనుక ఒకటి పేర్చుకుంటూ తీసిన ఫక్తు ఫార్ములా చిత్రము.

నేతిబీరకాయలో నెయ్యి, స్కెచ్ సినిమాలో కొత్త పాయింట్ వెదుకుట అనవసరము.

అపరచితుడు లాంటి విక్రమ్ ను ఆశించినా, గ్లామర్ డాల్ తమన్నా వుందని వెళ్లినా, నిర్మాత, దర్శకులు వేసిన స్కెచ్ లో ఇరుక్కుని బలికావుట తధ్యము.

ఇలా చెప్పుకోవాలేమో, స్కెచ్ సినిమా గురించి. 2016 మొదలు పెట్టి, 2018 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రము, తమిళనాట బాక్సాఫీసు దగ్గర దారుణంగా విఫలమైంది. అక్కడే విపలమైన ఈ సినిమా పొరపాటున ఇక్కడ సఫలమవుతుందన్న ఆశతో విడుదల చేసారు. కానీ అంత స్కెచ్ లేదక్కడ అన్నది తెలియడానికి సినిమా అంతా కూర్చోనక్కరలేదు. సినిమా ప్రారంభమైన పావుగంటకే విషయం అర్థమైపోతుంది. ఇది ఎల్కేజీ సినిమా అని. అంటే ఎ తరువాత బి, బి తరువాత సి, సి తరువాత డి వచ్చినట్లు సీన్లు అలా పేర్చుకుంటూ వెళ్తారు. ఇంతోటి ఆ పాతచింతకాయపచ్చడి సీన్లకు వీర బిల్డఫ్ షాట్లు. హీరో హావభావాలు. పైగా ఇవన్నీ చాలవన్నట్లు సినిమాలో చివర్న పెద్ద ట్విస్ట్. మనే తెలుగు సినిమా ప్రేక్షకులు ఏమన్నా తక్కువోళ్లా..ఇలాంటి సినిమాలు సవాలక్ష చూసి, అందులో 90శాతం సినిమాలను దిగ్విజయంగా ఇంటికి పంపేసిన చరిత్ర వారిది.

ఇంతకీ ఈ స్కెచ్ కథేంటీ అంటే…

వాయిదాలు కట్టని బళ్లను సీజ్ చేసే దందా నడుపుతుంటాడు ఓ సేఠ్. అతగాడికి రైట్ హ్యాండ్ స్కెచ్ (విక్రమ్). కన్ఫ్యూజన్ వద్దు. హీరోగారి పేరే స్కెచ్. అతగాడికి ఓ ముగ్గురు మిత్రులు. వీరు కలిసి బళ్లు ఎత్తుకొస్తుంటారు. ఈ సేఠ్ కు, ఈ స్కెచ్ కు రెండు రైవల్ పార్టీలు. మధ్యలో కాలేజీలో చదివే అమ్మాయితో స్కెచ్ లవ్ లో పడడం. ఇంతలో ఎవరు చంపుతున్నారో తెలియకుండా ఇద్దరిపై అనుమానాలు కలిగేలా చూపిస్తూ, స్కెచ్ ఫ్రెండ్స్ ను చంపేస్తుంటారు. దాంతో స్కెచ్ ఏం చేసాడు అన్నది మిగిలిన సినిమా. అన్నట్లు చివర్న ఓ మెసేజ్ కూడా ఇస్తాడండోయ్ దర్శకుడు. అదీ కథ.
ముందే చెప్పినట్లు ఫక్తు తమిళ కమర్షియల్ సినిమా గా నడుస్తుంది స్కెచ్. సినిమా ఓపెనింగ్ షాట్. ఆపై హీరో పరిచయ గీతం, వెంటనే ఫైట్. ఆపై హీరోయిన్ పరిచయం. ఆపై రెండు మూడు మందు సీన్లు. తరువాత విలన్ ఎంట్రీ. అతి భయంకరమైన వ్యవహారం. ఇంతలో ఇంటర్వెల్. ఆ తరువాత కథలో మలుపు. మళ్లీ పాట, ఫైటు, కామెడీ ఆపై అదే వరుస రీపీట్

విజయ్ చందర్ అనే దర్శకుడు ఇలాంటి కథతో విక్రమ్ లాంటి వైవిధ్యమైన నటుడిని ఎలా ఒప్పించాడో? అతగాడు అప్పడప్పుడు మాస్ సినిమా చేయకపోతే నట జీవితానికి హానికరం అని ఏమన్నా భ్రమపడ్డాడో ఏమో? మొత్తం మీద అలా స్కెచ్ అనే సినిమా పుట్టేసింది. తమన్నా ఇంత ఘోరంగా కనిపించడం, నటించడం ఆమె కెరీర్ లోనే ఇదే నేమో? ఒకటి బాగుంటే అన్నీ బాగుంటాయి అన్న సామెత మాదిరిగా ఈ సినిమాలో ఏ ఒక్కటీ బాగుండదు. అందువల్ల టోటల్ గా సినిమానే బాగుండదు.
ఇక సినిమాలో తమిళ మొహాలు, తమిళ వాసన మామూలే. లక్కీగానో అన్ లక్కీగానో మిస్సయింది తమిళ కామెడీనే. అది కూడా వుండి వుంటే సినిమా జన్మ పరిపక్వం అయి వుండేది. సినిమా క్లయిమాక్స్ ఏదో ఊడపొడిచేస్తుంది అనుకుంటే, అది కూడా తుస్సుమంటుంది.

తనో అద్భుతమైన నటుడిని అని అప్పుడప్పుడు గుర్తుచేయడానికి, తరచు ఒకటి రెండు ఎక్స్ ప్రెషన్లు ఇస్తూ నటించేసాడు విక్రమ్. తమన్నా సంగతి సరే సరి, మిగిలిన తమిళ నటుల మేళం గురించి చెప్పుకునేదేముంది. మన థమన్ బాబు పాటలు చెప్పుకోవడానికి లేదు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ సినిమాకు తగినట్లే వుంది.

తీర్పు :

కథ, మాటలు, స్కీన్ ప్లే, దర్శకత్వం ఇలా ఏ ఒక్క విభాగం గురించి కూడా పోరపాటున ప్రస్తావించి, ప్రశంసించే అవకాశం లేకుండా సినిమా చేయగలగడాన్ని మెచ్చుకోగలగాలి. తమిళ సినిమాలు బాగుంటాయి, బాగా తీస్తారు అనే అభిప్రాయం సరికాదు అనడానికి అన్నట్లు అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. అందువల్ల ఇలాంటి స్కెచ్ లో ఇరుక్కోకుండా దూరంగా వుండడం బెటర్.

ఫినిషింగ్ టచ్ : స్కెచ్ లో పడ్డారంటే..

తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.