“ సోషల్ మీడియాలో మీ ధైర్యం చూసి ఆర్మీలోకి రిక్రూట్ చేసుకోవడానికి వచ్చారు. మీరెక్కడున్నారు?” అని అతని భార్య గుమ్మం వద్ద నుంచి కేకలేస్తూ ఉంటుంది. బయట ఆర్మీ ఆఫీసర్లు ఉంటారు. కానీ ఆ సోషల్ మీడియా వీరుడికి సినిమా అర్థమైపోయి.. మంచం కింద దాక్కుని బిక్కు బిక్కు మంటూ ఉంటాడు. సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారి గురించి చాలా కాలం నుంచి వైరల్ అయ్యే కార్టూన్ ఇది. ఎప్పుడు సందర్భం వచ్చినా ఇదే చాలా మంది కి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇది వంద శాతం నిజం.
తీర్పులు చేప్పేస్తున్న పనీపాటా లేని సోషల్ మీడియా సైనికులు
భారత్, పాకిస్తాన్ తీసుకున్న కాల్పులు విరమణ ఒప్పందం గురించి ఇలా బయటకు తెలియగానే అలా సోషల్ మీడియాలో తీర్పులు చెప్పేశారు. ఇక్కడా దేశం పేరుతో.. తమ రాజకీయ ఆసక్తుల ప్రకారం ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ప్రపంచం మొత్తం భారత్ పవర్ ఎండ్ తెలిసిందని అంటే..ఇక్కడ వీరు మాత్రం పాకిస్తాన్ ను తుడిచి పెట్టేయకుండా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ నులాక్కోకుండా.. బలూచిస్తాన్ ను .. ప్రత్యేక దేశం చేయకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నారు. వీరి వాదనలు విని నవ్వుకోవాలో..అజ్ఞానానికి బాధపడాలో కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న వారికి అర్థం కాదు.
దేశ బాధ్యత ఉన్నవారికి.. సరిహద్దుల్లో సైన్యానికి తెలుసు అసలు నిజం !
ఓ కుటుంబ పెద్ద..తన కుటుంబానికి చిన్న సమస్య వస్తే నిద్రలేని రాత్రులు గడుపుతాడు. పక్కింటి వాడు సైకో అయితే.. వాళ్లు పెట్టే టార్చర్ ను ఎలా అనుభవించాలో తెలియక తన కుటుంబంపై ఆ ఎఫెక్ట్ పడకుండా మధనపడతాడు. కావాలంటే ఇల్లు మారిపోయి తన సమస్యను ఆ ఇంటి యజమానికి పరిష్కరించుకుంటారు.కానీ అటల్ బిహారీ వాజ్ పేయి చెప్పినట్లుగా పొరుగుదేశాల్ని మార్చలేం. వారిని మార్చుకునే ప్రయత్నం చేయాలి లేదా వారికి తగ్గట్లుగా వ్యవహరించాలి. ఇక్కడ భారత ప్రభుత్వం వంద శాతం అదే చేసింది. దేశాన్ని నడుపుతున్న వారికి గత వారం పది రోజులుగా నిద్ర పట్టిందని అనుకోలేం. పాకిస్తాన్ కు ఇంత నష్టం స్వల్పకాలంలోనే పెద్దగా ఎటాక్ చేయకుండానే వ్యూహాత్మకంగా చేశామంటే చిన్న విషయం కాదు. కానీ సోషల్ మీడియా సైనికులు మాత్రం రెచ్చిపోతూంటారు. సింపుల్ గా అయిపోయేదని అనుకుంటూ ఉంటారు. కానీ బాధ్యత ల్లో ఉన్న వారికి.. బరువులు మోసేవారికే అసలు కష్టం తెలుస్తుంది.
సోషల్ మీడియా సైనికులు కాదు సైకోలు
సోషల్ మీడియాకు సక్రమంగా వినియోగించుకుంటే.. జీవితాలను బాగు చేసుకోవచ్చు. కానీ పనీ పాటా లేని వాళ్లు.. బాధ్యతలు లేని వాళ్లు.. బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడని వాళ్లు కేంద్రం నిర్ణయాలను విమర్శిస్తున్నారు. కానీ పాకిస్తాన్ కు బుద్ది చెప్పి కాల్పుల విరమణ దిశగా తెచ్చినందుకు 99శాతం మంది ప్రజలు రిలీఫ్ ఫీలయ్యారు. ఎందుకంటే..భారత ప్రజలు ఎవరి నాశనాన్ని కోరుకోరు..తమ జోలికి వస్తే మాత్రం ఊరుకోరు.!