చైతన్య : ఔను.. సోనూసూద్‌ను శంకించాల్సిందే..!

ఔను.. సోనూసూద్‌ను శంకించాల్సిందే..!
ముక్కూముఖం తెలియని వాళ్లకి సాయం చేస్తున్న సోనూసూద్‌ నిజాయితీని శంకించాల్సిందే. లాక్‌డౌన్ పేరుతో ప్రభుత్వాలు అన్నీ కట్టడి చేస్తే.. పొట్టగడవక సొంత ఊళ్లకు పోదామనుకున్న వారికి బస్సులు.. రైళ్లు.. చివరికి విమానాలూ ఏర్పాటు చేసిన సోనూసూద్ ఖచ్చితంగా పాపమే చేస్తున్నాడు. సోషల్ మీడియా పుణ్యమా అని.. తన దృష్టికి వస్తున్న వారికి.. ట్రాక్టరో.. మరొకటో అప్పటికప్పుడు … అందేలా చేస్తూ… ఘోరమైన తప్పులే చేస్తున్నాడు. అసలు ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నాడో రంధ్రాన్వేషణ చేయాలి. అసలు వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తేల్చుకోవాలి. ఆయన ఆస్తులెన్నో లెక్కలు తీయాలి. అసలు ఏ ఉద్దేశంతో సాయం చేస్తున్నాడో కూడా.. కనుక్కోవాలి. మొత్తంగా… ఇలా.. చేసి.. చేసి… ” ఈ గొడవంతా ఎందుకురా బాబూ.. నేను.. నా సావు నేను సస్తా అనుకునేలా చేసి.. మరెవరికీ సాయం అందకుండా చేయాలి..!”… అప్పుడు కానీ కళ్లు చల్లబడవు.. సమాజంలో.. కొంత మంది సోషల్ మీడియా మేధావులకు..!

సోనూసూద్‌కు డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి…?

సోనూసూద్ రాజకీయ నాయకుడా..? బ్యాంకుల దగ్గర వేల కోట్ల అప్పులు తీసుకున్న వ్యాపారవేత్తనా..? జనం సెంటిమెంట్‌తో డబ్బులు సంపాదించే బాబానా..?…ఏవీ కాదు.. తాను అవకాశాల కోసం సిటీ బస్సుల్లో తిరిగి.. కష్టపడి సినిమాల్లో ఎదిగిన నటుడు. వచ్చిన సంపాదనతో.. కొన్ని హోటల్స్ పెట్టుకుని ఓ మాదిరిగా వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారి కూడా. అంతే అంతకు మించి ఆయనకు ఏ ఫోర్ట్ ఫోలియో లేదు. కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్నే.. పేదల కోసం ఉపయోగిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవ నచ్చి కొంత మంది విరాళాలు కూడా ఇచ్చి ఉండవచ్చు. లేకపోతే.. పూర్తిగా తన సొంత ధనమే పెట్టుకుంటూ ఉండవచ్చు. ప్రజల సొమ్ము పెట్టలేదు. అవినీతికి పాల్పడలేదు. పాల్పడే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు.. సోనూసూద్‌కు సాయం చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని… అనుమానంగా చూడటం… మనుషుల లక్షణమేనా..?. ఆయన ఇప్పటి వరకూ ఓ పది కోట్ల వరకూ ఖర్చు పెట్టి ఉంటారు. బస్సులు, రైళ్లు.. చాలా తక్కువ సందర్భాల్లో విమానాలు ఏర్పాటు చేశారు. అంత మాత్రానికే.. ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఏదో స్కాం చేసేసి.. ఈ విధంగా పంచేస్తున్నారనే అనుమానాలు ఎందుకు బయటకు తెస్తున్నారు..?. ఆయనపై లేనిపోని అనుమానాలు ఎందుకు కల్పిస్తున్నారు..? ఇవన్నీ.. సమాజంలో పేరుకుపోతున్న సైకో లక్షణాలకు సాక్ష్యాలు.

చేస్తున్న సాయానికి పబ్లిసిటీ వస్తే దానికి సోనూసూద్ ఏం చేస్తారు..?

సోనూ సూద్ ప్రత్యేకంగా పీఆర్ టీంలను పెట్టుకుని తాను చేస్తున్న సాయాలను ఎస్టాబ్లిష్ చేసుకోవడం లేదు. మీడియానే చేస్తోంది. ఆయన వలస కూలీలకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు కల్పించడం ప్రారంభించిన నెల తర్వాత మీడియాలో కవరేజీ ఓ మాదిరిగా రావడం ప్రారంభమయింది. ఒక్క బస్సు ఏర్పాటు చేసి.. జెండా ఊపగానే.. ఆయన గొప్ప సహాయశీలి అని ప్రచారం చేసేసుకోవడానికి సూపర్ స్టార్ కాదు. సోషల్ మీడియాలో అలాంటి ప్రమోషన్లు ఇచ్చే ఫ్యాన్ బేస్ లేదు. నిజానికి ఆయన మొదట.. ముంబైలో తన హోటల్‌ను క్వారంటైన్ కేంద్రానికి ఇచ్చేశారు. అప్పుడు మీడియాలో ఓ మూల వచ్చింది. ఆ తర్వాత.. వరుసగా సాయం చేస్తూ ఉండటం.. దేశంలో డబ్బు సంపాదించుకున్న ఏ ఒక్కరూ.. అలాంటి సాయం చేయకపోవడంతోనే మీడియా హైలెట్ చేసింది. ప్రచారం కోసమే.. సోనూసూద్ ఈ సాయం చేస్తున్నారని.. విశ్లేషించేవారికి.. కళ్లు మూసుకుపోయాయని.. అంటే.. తప్పు లేదు.

సోనూసూద్‌పై రాజకీయ అసూయ పెరగడమే నిందలకు కారణం..!

సోనూసూద్‌ చేస్తున్న సాయంపై.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చర్చ జరగడం లేదు. నిజానికి వలస కూలీలకు సాయం చేస్తున్నప్పుడు… మీడియాలో విపరీతంగా ప్రచారం రావడంతో.. అక్కడి శివసేన ప్రభుత్వానికి కూడా కంటగింపుగా అనిపించింది. అందుకే.. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్.. కొత్త మహాత్ముడు ఉద్భవించాడని.. ఆయన వెనుక బీజేపీ ఉందని విమర్శలు గుప్పించారు. కానీ.. సోనూసూద్ తర్వాత నేరుగా వెళ్లి .. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఏపీలో ఓ రైతుకు ట్రాక్టర్ సాయం చేయడం.. చంద్రబాబు స్ఫూర్తి అని మీడియాకు చెప్పడంతోనే.. అసలు చిక్కు వచ్చి పడింది. అంతే ఆయనపై.. లేని పోని ఆరోపణల దాడి ప్రారంభమయింది. ఆయన సాయం చేసిన దళిత రైతుపైనా … సోషల్ ఎటాక్ జరిగింది. సోనూసూద్‌కు డబ్బులెక్కడి నుంచి వస్తాయన్న దగ్గర్నుంచి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇది అలా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు.. ఎందుకంటే… రాజకీయం అంతే మరి..!

సాయం చేయరు.. చేసేవాళ్లను అడ్డుకోవడమే కొంత మంది కాలక్షేపం..!

వందలు, వేల కోట్ల సంపాదనా పరులైన సినీ తారలున్నారు. రాజకీయ నేతలున్నారు. ప్రజలు ఆదరిస్తే కుబేరులయిన వారు ఉన్నారు. వారెవరూ.. లాక్ డౌన్ సమయంలో సాయం చేయలేదు. అది వారిష్టం చేసినా.. చేయకపోయినా.. పట్టింపు లేదు. ఎందుకంటే.. ఎవరికైనా ఒకరికి సాయం చేస్తే.. వారివైపు ఆశగా చూసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ బాధలన్నీ ఎందుకని.. ప్రభుత్వానికి కోటో.. రెండు కోట్లో ఇచ్చి.. సెలబ్రిటీలు సర్దుకుంటారు. కానీ.. సోనూసూద్ మాత్రం.. ఆ టైప్ కాదు. తను చేయాలనుకున్నది చేస్తున్నారు. ఇప్పుడు.. ఆయన చేస్తున్నారని.. ఆయనపై బండలు వేయడం.. కొత్త లక్షణం. తమ అభిమాన తారలు.. అభిమాన నేతలు చేయడం లేదు కాబట్టి… ఆ సాయం సోనూసూద్ కూడా చేయకూడదన్నట్లుగా పరిస్థితి తయారైంది.

అతడు సినిమాలో.. మహేష్ బాబుతో సాయం పొంది.. ఇంట్లో పెళ్లి కూడా చేసిన తర్వాత .. ఆయనపై నిందలేస్తే … సునీల్.. డిఫెండ్ చేస్తాడు. ఎవరెవరికి ఎలా సాయం చేశాడో… వివరిస్తూ.. ఖచ్చితంగా అలా చేసినందుకు… నిందించాల్సిందేనంటాడు. ఎందుకంటే.. మంచికి మంచిరోజులు లేవు మరి..! ఎవరైనా మంచి చేస్తే అవమానాలు ఎదురవుతాయి. ప్రజాధనం దోచుకుని… పబ్లిసిటీ చేసుకునేవాళ్లు మాత్రం దేవుళ్లవుతారు. మనమింతే.. మన సమాజం ఇంతే.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ రాజధానిపై కేంద్రం తేల్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రానికి సంబంధం లేదని.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని... కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా.. రాష్ట్ర పరిధిలోనిదా...

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

HOT NEWS

[X] Close
[X] Close