గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సిట్ పోలీసుల దర్యాప్తులో వేగం పెరగనుందని తెలుస్తోంది. సోమవారం లేదా మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. భువనగిరి, హైదరాబాద్ కేంద్రంగా మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిన నయీం దందాలు అన్నీ ఇన్నీ కావు. భూకబ్జాలు, సెటిల్ మెంట్లు, హత్యలు అరాచకాలు చేసిన అతడికి చాలా మంది సహకరించారు.
మాజీ నక్సలైట్ అయిన నయీం, ఇంకా చాలా మంది మాజీలను తన గ్యాంగులో చేర్చుకుని అరాచకాలు కొనసాగించాడు. ఎందరో పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, వివిధ శాఖల అధికారులు అతడికి సహకరించారు. డీజీపీ స్థాయి అధికారికి కూడా సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే తనకు సంబంధం లేదంటూ దినేష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పారు.
నల్గొండ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి. దీంతో రకరకాల పేర్లు వినిపించాయి. చివరకు, టీడీపీ మాజీ మంత్రి ఉమామాధవ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తనకు సంబంధం లేదని ఖండించారు. ఇంకా చాలా మంది రాజకీయ నాయకులకు నయీంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను పోలీసులు పిలిపించి విచారించారు. విద్యార్థి ఉద్యమ కాలంలో నయీంతో దోస్తీ ఉన్న కృష్ణయ్య, ఇటీవల ఒకటిరెండు సార్లు నయీంతో మాట్లాడానని మీడియాతో చెప్పడంతో ఆయన్ని పోలీసులు ప్రశ్నించారు. ఇంకా నయీంతో లింక్ ఉన్న వారి జాబితా పెద్దదే అని మీడియాలో కథనాలు వచ్చాయి. అతడి డైరీలోని పేర్లను చూసి పోలీసులే విస్తుపోయారని కూడా వార్తలు వచ్చాయి.
నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఇప్పటి వరకూ మొత్తం 109 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అతడి కుటుంబ సభ్యులు, బంధులువు, గ్యాంగ్ సభ్యులు తదితరులు ఉన్నారు. వందల మంది సాక్షులను పోలీసులు విచారించారు. అయితే అసలు సిసలైన బడాబాబులను మాత్రం కాపాడుతున్నారని సిట్ పై ఆరోపణలు వచ్చాయి. అసలు సిట్ చీఫ్ పైనే ఆరోపణలు రావడం మరో విశేషం. మరి చార్జిషీటులో పెద్దచేపలు, బడాబాబుల గురించి పేర్కొంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.