రవీంద్రభారతిలో గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. రవీంద్రభారతి ప్రభుత్వానిది. అక్కడ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎస్పీ బాలు అభిమానులు అంతా కలిసి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంత మంది తెలంగాణ పేరుతో వచ్చి ఘర్షణకు దిగారు. శుభలేఖ సుధాకర్ తోనూ వాదన పెట్టుకున్నారు. రవీంద్రభారతిలో ఎస్బీ బాలు విగ్రహం పెట్టడం వల్ల ఆయనకు కొత్తగా వచ్చే పేరు ఏమీ ఉండదు ..కానీ ఎన్నో కలలతో రవీంద్రభారతికి వచ్చే కళకారులకు ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది.
ఎస్పీ బాలుకు ప్రాంతీయ ముద్రనా ?
శ్రీపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం… దాదాపుగా అన్ని దక్షిణాదిభాషల్లో వేలాది పాటలు పాడారు. అక్కడి వారంతా ఆయన తమ వాడే అనుకుంటారు. ఆయన మద్రాసులో స్థిరపడ్డారు. తమిళులు తమ వాడే అనుకుంటారు. అలా గౌరవిస్తారు. ఆయనను ఆంధ్ర పేరుతో దూరం చేసుకోరు. ఓ మహానుభావుడు తమ వాడు అని చెప్పుకోవడంలో వారికి సంతోషం ఉంటుంది. బాలు స్ఫూర్తితో మరింత మంది గాయకులుగా రాణించేందుకు .. ఆయన పేరును ఉపయోగించుకుంటారు. కానీ ఆయన నెల్లూరులో పుట్టాడు కాబట్టి తమ వాడు కాదని అనుకోరు. అదేం విచిత్రమో.. తెలుగువారే అనుకుంటారు.
తెలుగుకళాకారుల్ని అవమానించేది తెలుగువాళ్లే!
గద్దర్ పేరుతో ఏకంగా సినిమా అవార్డుల్నే ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవలే చనిపోయిన అందెశ్రీ పేరుతో మెమోరియల్ సెంటర్ నిర్మించనుంది రేవంత్ సర్కార్. వారికి ఏ గౌరవం తగ్గనీయలేదు. కానీ తెలంగాణ పేరుతో రవీంద్రభారతికి వచ్చి గొడవ చేసినవారు.. వీరి పేర్లను అడ్డం పెట్టుకుంటున్నారు. తెలంగాణ వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు అని పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తే ప్రచారం వస్తుంది కానీ.. తెలంగాణను మాత్రం రోడ్డున పడేస్తున్నారని గుర్తించరు.
గానగాంధర్వుడి విగ్రహంతో రవీంద్రభారతికి నిండుదనం
ప్రభుత్వం ఎవర్నీ తక్కువే చేయడంలేదు. తెలంగాణ కళా కారుల్ని గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా గౌరవిస్తోంది. అలా అని ఇతర దిగ్గజాలను.. కేవలం ఆంధ్ర ప్రాంతంలో పుట్టారన్న కారణంగా విగ్రహాలు ఉండకూడదు.. వారిని స్ఫూర్తిగా తీసుకోకూడదు అనుకుంటే ఎలా?. ఆయన తెలుగులో పాడిన పాటలు.. ఇప్పటికి ప్రతి వ్యక్తి.. ప్రతి సందర్భంలో ఏదో రోజు వింటూ ఉంటారు. ఆ గళాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు. విగ్రహం లేకపోయినా ఎస్పీ బాలుకు.. ఆయన కుటుంబానికి వచ్చేపేరు ఉండదు. కేవలం యువగాయకులకు స్ఫూర్తిగా ఆ నిండుదనం రవీంధ్రభారతిలో ఉంటుంది. వివాదం చేస్తే.. తెలంగాణ కళాకారుల్నికూడా.. ఇతర ప్రాంతాల వారు అలాగే చూసే ప్రమాదం ఉంది.
