తలసాని రాజీనామా లేఖ అందలేదుట!

ప్రస్తుతం తెరాస ప్రభుత్వంలో కీలకమయిన వాణిజ్య పన్నుల శాఖకు మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గత సంవత్సరం డిశంబర్ 16వ తేదీన తెదేపా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, తెదేపా ద్వారా తను గెలుచుకొన్న శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖ తెదేపా కార్యాలయానికి చేరుకొంది. కానీ ఏడు నెలలు గడిచినా ఆయన తన శాసన సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖ మాత్రం స్పీకర్ కార్యాలయానికి చేరుకోలేదుట!

ఈ విషయాన్ని తెలంగాణా  ఉపకార్యదర్శి మరియు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డా. వై. నరసింహచార్యులు స్వయంగా దృవీకరించారు. “తలసాని రాజీనామా చేసారా లేదా?” అని సమాచార హక్కు క్రింద మాజీ కాంగ్రెస్ ఎమ్మేల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ నెల 8న లికిత పూర్వకంగా జవాబిస్తూ, “ఎమ్మేల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి మాకు రాజీనామా లేఖ రాలేదు,” అని సమాధానం ఇచ్చారు.

ఇంతకాలం తలసాని తను రాజీనామా చేసానని కానీ దానిని స్పీకర్ ఆమోదించలేదని చెపుతూ వచ్చారు. కానీ ఆయన అసలు తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపనేలేదని స్పష్టమయింది. ఆయన రాజీనామా చేసారో లేదో దృవీకరించుకోకుండా గవర్నర్ ఆయన చేత తెలంగాణా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. అలాగే ఇంతకాలం ప్రభుత్వం, స్పీకర్ కూడా తలసాని రాజీనామా లేఖ గురించి మాట్లాడకుండా గుంభనంగా ఉండటం ద్వారా గవర్నర్ ని, ప్రతిపక్షాలని, ప్రజలని కూడా మభ్యపెట్టినట్లయింది. ఈ అంశంపై దాఖలయిన ఒక పిటిషన్ని హైకోర్టు విచారణకు స్వీకరించినప్పుడు తెలంగాణా అడ్వకేట్ జనరల్ కూడా ఈ విషయాన్ని హైకోర్టుకి తెలియజేయకపోవడంతో ప్రభుత్వం హైకోర్టుని కూడా త్రప్పుద్రోవ పట్టించినట్లయింది.

తలసానితో సహా మిగిలిన ఎమ్మేల్యేల రాజినామా లేఖలు తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి వద్దనే ఉన్నాయని భావించిన హైకోర్టు “వారి రాజీనామాల ఆమోదించడానికి ఇంకా ఎంత సమయం తీసుకొంటారు?” అని ప్రశ్నించడం గమనిస్తే ఆవిషయం అర్ధమవుతుంది. ఇంతవరకు స్పీకర్ తెదేపా, కాంగ్రెస్ పార్టీలలో నుండి తెరాసలో చేరిన ఎమ్మేల్యేల రాజీనామా లేఖలను ఆమోదించలేదని అందరూ భావిస్తున్నారు. కానీ తలసాని తన రాజీనామా లేఖను పంపనేలేదని, అయినా ఆ విషయాన్ని ప్రభుత్వం కూడా ఇంతవరకు దాచిపెట్టి అందరినీ మభ్యపెడుతున్నట్లు స్పష్టం అయింది. ఈరోజు టీ-కాంగ్రెస్ నేతలు గవర్నర్ ని కలిసి తెలంగాణా శాసనసభ ఉపకార్యదర్శి ఇచ్చిన జవాబుని ఆయనకి అందజేసి తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరబోతున్నారు. ఈ విషయం హైకోర్టు దృష్టికి కూడా వెళ్ళడం తధ్యం. ఒకవేళ హైకోర్టు, గవర్నర్ దీనిపై తీవ్రంగా స్పందిస్తే తెరాస ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు తప్పకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com