పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించడంతో స్పీకర్ ఆ పది మంది ఎమ్మెల్యేల గురించి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. స్పీకర్ను కోర్టులు ఆదేశించలేవు కానీ.. ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టుతో ఘర్షణ పడటం కన్నా మధ్యేమార్గం ద్వారా వెళ్తే మంచిదన్న అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఆ పది మందికి స్పీకర్ ద్వారా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు వారు సమాధానం ఇవ్వాల్సి ఉంది.
దానం నాగేందర్ తప్ప మిగతా ఎవరూ సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన ఆ పార్టీలో చేరినట్లుగా రికార్డు అయింది. ఇప్పుడు స్పీకర్ ఆ ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణ ఆధారంగా నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తాము అధికారికంగా పార్టీ మారలేదని.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశామని చెబితే స్పీకర్ అ దిశగానే నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాలు కూడా అడ్డు చెప్పలేవు. కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే.
పది మందితో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలుక వెళ్తే ఎలా ఉంటుందా అని కూడా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీపై గతంలో ఉన్నంత అసంతృప్తి లేదు. అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ ఉంటుంది. అన్నీ చూసుకుని ఉపఎన్నికలకు వెళ్లి.. ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటే ఎలా ఉంటుందా అని రేవంత్ ఆలోచిస్తున్నారు. అయితే హైకమాండ్ ఇచ్చే సూచలను బట్టే తుది నిర్ణయం తీసుకోనున్నారు.