”సెల్యులాయిడ్ సైంటిస్ట్ నాగార్జున…!”
అవును.. ఈ మాటను కాదన్నవారెవరు?
తెలుగు సినిమాని ‘శివ’కు ముందూ.. ఆ తరవాత అని విభజించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఘనత రాంగోపాల్ వర్మకే కాదు. నాగార్జునకూ దక్కాల్సిందే. ఎందుకంటే శివ కథని, టేకింగ్కీ, మరీ ముఖ్యంగా రాంగోపాల్ వర్మనీ నమ్మిన ఏకైక వ్యక్తి… నాగార్జున. శివతో.. సైకిల్ చైనే కాదు.. తెలుగు సినిమాకు పట్టిన రొటీన్ సెంకెళ్లుకూడా తెంచేశాడు నాగార్జున.
అప్పటి నుంచీ నాగ్ దృక్పథం మారిపోయింది. ఓ ఒక్క పాత్రకో.. ఓ ఫార్ములాకో, రొటీన్ కథలకో పరిమితం కాకుండా.. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకొంటూనే ఉన్నాడు.
ప్రేమకథలు.. యాక్షన్ చిత్రాలు, రివైంజ్ డ్రామాలు, కుటుంబ బంధాలు, అల్లరి పాత్రలు, భక్తిభావ చిత్రాలు.. వీటితో పాటు ఫక్తు కమర్షియల్ సినిమాలు.. ఇలా అన్ని రకాల రుచులూ చూపించి, వెండితెరను నవరసభరితం చేశారునాగార్జున. కొత్త దర్శకులలో ప్రతిభ గుర్తించి వాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో నాగ్ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నుంచి ఇంతమంది దర్శకులు, టెక్నీషియన్లు రాగలిగారు.
అన్నమయ్య సినిమాలో నాగార్జున అనగానే చిత్రసీమ నివ్వెరపోయింది. అంతకు ముందే నిన్నే పెళ్లాడతా అంటూ ఓ రొమాంటిక్ సినిమా చేసి హిట్ కొట్టిన నాగార్జున – ఎలాంటి గ్లామర్ లేని పాత్రలో నటించడం ఏమిటి? అదీ ఓ ఆధ్యాత్మిక చిత్రంలో?? అంటూ ఆశ్చర్యపోయారు. నాగ్ కెరీర్‌కి ఆ సినిమాతోనే చమరగీతం అని భయపడినవాళ్లూ ఉన్నారు. కానీ… అందరినీ షాక్‌లో ముంచెత్తేలా… నాగ్ నట విశ్వరూపం చూపించాడాడందులో. ఓ స్టార్ హీరో రామదాసుగా, శిరిడీసాయిగా అవతారాలు మార్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు నమో వేంకటేశాయలో నటించినా… హాథీరామ్ బాబాగా అవతారం మార్చుకొన్నా.. జనం చూస్తారు. ఎందుకంటే… నాగ్ వెర్సటాలిటీకి ఉన్న పవర్ అలాంటిది.
నాగ్‌లో సృజనశీలుడు ఓ ఎత్తు.. నిర్మాత ఓ ఎత్తు!
ఎప్పటికప్పుడు ట్రెండ్ పట్టుకొని… దాంతో పాటు మమేకమైపోవడం నాగ్ కి బాగా తెలుసు. మార్కెట్ లోటు పాట్లు, లోతులు… ఎత్తులు అన్నీ తెలిసిన వ్యక్తి. అందుకే… నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియో సంస్థ నుంచి ఫ్లాపులు వచ్చాయి గానీ చెత్త సినిమాలు రాకపోవడానికి కారణం అదే. బుల్లి తెరపైనా నాగ్ తనదైన ముద్ర వేయగలిగాడు. అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి.. మిగిలిన భాషల్లో ఫెయిల్. తెలుగులో మాత్రమే సక్సెస్ అయ్యింది. దానికి కారణం నాగార్జున..!
నాగార్జున గ్లామర్ ఓ మ్యాజిక్. ఇరవై ఏళ్ల క్రితం నాగ్ ఎలా ఉండేవాడో.. ఇప్పుడూ అలానే ఉన్నాడు. ‘మన్మథుడు’ అనే ట్యాగ్ లైన్‌కు న్యాయం చేసేలా. ”ఒత్తిడి ఎక్కువ సేపు నన్ను ఇరకాటంలో పెట్టదు. ఎప్పుడూ రిలాక్స్‌గానే ఉంటుంటా. కోపం వచ్చినా కొద్ది సేపే. అందుకే ఇలా ఉన్నానేమో” అంటూ తన గ్లామర్ సీక్రెట్ బయటపెట్టేశాడు కింగ్. మనం నుంచి నాగ్ ప్రయాణం మరో మలుపు తిరిగింది. సోగ్గాడే చిన్నినాయినా తో ఈ సంక్రాంతికి సిసలైన వినోదం అందించారాయన. ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈరోజే పుట్టినరోజు జరుపుకొంటున్న కింగ్ నాగార్జున… భవిష్యత్తులోనూ మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని… ఇలానే అభిమానుల్నీ, తెలుగు ప్రేక్షకుల్ని నవరసాల్లో ముంచెత్తాలని కోరుకొంటూ…. నాగ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం!!