దర్శక, రచయిత నీరజ్ పాండే క్రియేట్ చేసిన ‘స్పెషల్ ఆప్స్’ వెబ్‌సిరీస్‌కు మంచి ఆదరణ ఉంది. స్పెషల్ ఆప్స్ సీజన్ 1, 1.5 ఈ రెండు కూడా గ్రిప్పింగ్ కథనంతో ఒక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ‘రా’ ఆఫీసర్ హిమ్మత్ సింగ్‌గా కేకే మేనన్ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తొలి సీజన్లో టెర్రరిస్ట్ హంట్ ఉత్కంఠగా సాగింది. జియో హాట్ స్టార్ లో విడుదలైన తాజా సీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దేశం ఎదుర్కొన్న విపత్తు నేపధ్యంలో తీర్చిదిద్దారు. మరి ఏఐ వార్ ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ ఇచ్చింది? నీరజ్ పాండే మరోసారి తన మార్క్ చాటుకున్నాడా?
బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమినార్‌కి వెళ్లిన ఇండియన్ సైంటిస్ట్ పీయూష్ భార్గవ్ (ఆరిఫ్ జకారియా)ని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. పీయూష్ భార్గవ్ మామూలు వ్యక్తి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఘనుడు. ఇండియాకు సంబంధించిన అన్ని వ్యవస్థల రక్షణ వలయాన్ని సైబర్ ఎటాక్ నుంచి కాపాడగలిగే ఏఐ సైంటిస్ట్. పీయూష్‌ను ఓ ఆయుధంగా వాడుకొని ఇండియాపై ఓ భారీ సైబర్ ఎటాక్‌కు ప్లాన్ చేస్తారు దుండగులు. పీయూష్‌ను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యతను ‘రా’ ఆఫీసర్ హిమ్మత్ సింగ్ (కేకే మేనన్)కు అప్పగిస్తుంది ప్రభుత్వం. తన టీంతో కలిసి ఆపరేషన్ చేపట్టిన హిమ్మత్కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? డార్క్ వెబ్, సైబర్ ఎటాక్, ఏఐతో దేశానికి పొంచివున్న ముప్పును హిమ్మత్ టీం ఎలా తిప్పికొట్టిందన్నది మిగతా కథనం.
నీరజ్ పాండే మంచి క్రియేటర్. తను ఎంచుకున్న ఏ కథనమైనా ఆసక్తిగా చెప్పగలిగే నేర్పు ఉన్న దర్శకుడు. సీజన్ 1లో ఉగ్రవాదిని పట్టుకునే మిషన్ చూపించిన నీరజ్.. ఈసారి పూర్తి భిన్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ నేపధ్యంలో సీజన్‌ను నడిపాడు. ఈ ప్రయత్నం చాలా వరకూ థ్రిల్‌ను పంచింది. సైంటిస్ట్ కిడ్నాప్ సీక్వెన్స్‌తో నేరుగా కథలోకి వెళ్లారు. విలన్‌గా తాహిర్ రాజ్ భాసిన్ ఎంట్రీ అతనికి ఇచ్చే ఎలివేషన్ ఆసక్తికరంగా ఉంటాయి. తొలి ఎపిసోడ్‌లోనే సైబర్ ఎటాక్, డార్క్ వెబ్, ఈ థీమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి.
మొత్తం ఏడు ఎపిసోడ్ల సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్‌కి వారం పేర్లు పెట్టారు. ఎపిసోడ్ నిడివి దాదాపు గంట. పీయూష్ భార్గవ్‌ను దుండగుల నుంచి విడిపించుకుని తీసుకురావడం మెయిన్ మిషన్. అయితే ఇందులో కొన్ని సబ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. మాజీ రా అధికారి సుబ్రహ్మణ్యం (ప్రకాశ్‌రాజ్)కు సెపరేట్ ట్రాక్ ఉంది. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి దేశం విడిచిపోయిన విజయ్ మాల్యా లాంటి వ్యక్తులను గుర్తు తెచ్చే ఆ ట్రాక్ ఈ ఎఐ వార్‌లో అంతగా ఇమిడలేదు. దీనితో పాటు కొన్ని రిజిస్టర్ అవ్వని క్యారెక్టర్లు, ఉపకథలు ఉన్నాయి. అవి కాస్త గందరగోళానికి గురిచేస్తాయి.
ఈ సీజన్లో యాక్షన్‌కి పెద్దపీట వేశారు. ‘రా’ ఏజెంట్లు చేసే యాక్షన్ సీక్వెన్సులు అలరిస్తాయి. డార్క్ వెబ్ ద్వారా హవాలా డబ్బును కొట్టేసే సీక్వెన్స్, ప్రధాని కార్యాలయంపై జరిగిన సైబర్ ఎటాక్, రా ఏజెంట్ వినోద్ చేసిన సీక్రెట్ ఆపరేషన్.. ఇవన్నీ కథనంపై ఆసక్తిని పెంచుతాయి.
హిమ్మత్ పాత్రలో కేకే మీనన్ మరోసారి ఆకట్టుకున్నారు. ఆయన పాత్రకి యాక్షన్ ఉండదు. కానీ ఎప్పుడూ ఒక వార్‌జోన్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి పాత్రను పండించడం అంత తేలిక కాదు. మీనన్ లాంటి అనుభవం ఉన్న నటులకు మాత్రమే ఇలాంటి పాత్రలు సాధ్యపడతాయి. సైకిక్ నేచర్ ఉన్న విలన్ పాత్రలో కనిపించిన తాహిర్ రాజ్ భాసిన్‌కి కొన్ని మంచి సీన్లు పడ్డాయి. బాక్సింగ్ రింగ్ సీన్లో అతని డిఫెన్స్ తన మైండ్ గేమ్‌కు అద్దం పడుతుంది. రా ఏజెంట్లుగా కనిపించిన నటులు స్టైలిష్, డేరింగ్ పాత్రల్లో ఒదిగిపోయారు. సాయి మిఖేర్ క్యారెక్టర్‌ను ఇంకా డెవలప్ చేయాల్సింది. ప్రకాశ్‌రాజ్‌కు బలమైన పాత్రే దొరికింది కానీ అది కథలో అంతగా అతుక్కోలేదు.
సాంకేతికంగా సిరీస్ రిచ్‌గా ఉంది. ఫారిన్ లోకేషన్లలో తీసిన సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సులు చూస్తున్నప్పుడు ఖర్చు కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపధ్యంలో కథలు రాస్తున్నప్పుడు సహజంగానే హ్యూమన్ ఎమోషన్స్ ఎలివేట్ కావు. కథల అల్లికలోనే టెక్నాలజీ డామినేట్ చేస్తుంది. దర్శకుడు నీరజ్ పాండే ఈ అడ్డంకిని దాటడానికి వినోద్, సుబ్రహ్మణ్యం లాంటి పాత్రలతో ఎమోషనల్ ప్రయత్నం చేశాడు. కానీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే తొలి సీజన్లో ఉన్న స్క్రీన్‌ప్లే బిగి సీజన్ 2లో లోపిస్తుంది. కాకపొతే కాలక్షేపాన్ని ఇచ్చే కాంటెంట్ అయితే ఇందులో ఉంది. ఏఐ, సైబర్ ఎటాక్ లాంటి జానర్స్ ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ సీజన్ మరింతగా రుచించే అవకాశం ఉంది.