హోదా పై మాయమాటలు వొద్దు !

(వ్యాఖ్యానం)
ఆంధ్రప్రదేశ్ కు ”ప్రత్యేక తరగతి హోదా” విషయంలో బిజెపి చేస్తున్న దగానీ, ఎలా సమర్ధించుకోవాలో తోచని తెలుగుదేశం డొల్లమొహాల్ని ప్రజలు టివి చానళ్ళలో చూసేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల్లోనే వుంది. ఓట్లతో తెలుగదేశం, బిజెపిల కాంబినేషన్ ని నెత్తిక్కించుకున్న ప్రజల్లో ”హోదా”సెంటిమెంటు బలపడుతోంది. వైఎస్ జగన్ మోహన రెడ్డిని వ్యతిరేకించే వారు కూడా ఆయన నిరాహార దీక్షను శ్రద్ధాసక్తులతో పరిశీలిస్తూ వుండటమే ఇందుకు పెద్ద సాక్ష్యం. దీన్ని కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ కు అంత ప్రయోజనకరం!!

”హోదా” సంజీవనీ మంత్రం కాదని వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతూవుండి వుండవచ్చు. ”పెద్దకొడుకునై ఆంధ్రప్రదేశ్ కష్టం తీరుస్తా” అని తిరుపతి సభలో నమ్మబలికి అధికారం ఎక్కాక మూగనోము పట్టిన నరేంద్రమోదీ నమ్మకం కూడా అదే అయివుండవచ్చు. కానీ, ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించగలదని విద్యావంతులు, ఆలోచనాపరులు, మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని తటస్ధవాదులు నమ్ముతున్నారు.

ఎలాగంటే…స్పెషల్ కేటగిరీ హోదా వున్న రాష్ట్రాలకు మూడు విధాలుగా నిధులు లభిస్తాయి 1. సాధారణ కేంద్ర సహాయం, 2. అదనపు కేంద్ర సహాయం, 3. ప్రత్యేక కేంద్ర సహాయం. మొత్తం కేంద్ర సాధారణ సహాయం నుంచి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 30 శాతం నిధులు లభిస్తాయి. అందులో 90 శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంటు కాగా, 10 శాతం అప్పు. (హోదాలేని సాధారణ రాష్ట్రాలకు కేంద్ర సాధారణ సహాయంలో 30 శాతం మాత్రమే గాంట్లు, 70 శాతం రుణం) ప్రత్యేక కేటగిరీ హోదాగల రాష్ట్రాలు కేంద్ర పథకాలకు, విదేశీ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు అందే కేంద్ర అదనపు సహాయంలో గ్రాంట్లు, అప్పు నిష్పత్తి 90:10గా ఉంటుంది. ప్రత్యేక కేంద్ర సహాయం కింద ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు అంశాలవారీగా సహాయం అందుతుంది. ఈ కేటాయింపులు రాష్ట్ర ప్రణాళిక పరిమాణం, గతసంవత్సరపు ప్రణాళిక వ్యయం వంటి ఆంశాలపై అధారపడి ఉంటాయి. ఏమైనా కూడా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ మూడు విధాలుగానూ నిధులు…హెచ్చు గ్రాంట్లు లభిస్తాయి.

అంతకుమించి , ఎక్సైజ్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఆదాయం పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లలో గణనీయమైన తగ్గింపులు, మినహాయింపుల వల్ల కూడా లబ్ధి చేకూరుతుంది. ఎక్సైజ్ తగ్గింపుతో పరిశ్రమల స్థాపన పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు కలుగుతాయి.

వివిధ రాష్ట్రాలు కేంద్ర పన్నుల రూపేణా సమకూర్చే ఆదాయాన్ని బట్టి కేంద్ర ఆర్థిక సంఘం ఆర్ధిక వనరుల్ని ఆయా రాష్ట్రాలకు పంచుతుంది. ఈవిధంగా 2011-12 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన పన్నుల రాబడి నుంచి రెండున్నర లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు పంచింది. ఇది రాష్ట్రాలకు కేంద్రం అందించిన మొత్తం నిధుల్లో యభై రెండు శాతం. ఇదిగాక ప్రకృతి వైపరీత్యాలు, రోడ్ల నిర్వహణ వంటి అవసరాలకు అది ఆయా రాష్ట్రాలకు అంశాలవారీగా అందజేసే గ్రాంట్లు, అప్పుల విషయంలో విధి విధానాలను కూడా ఆర్థిక సంఘం సూచిస్తుంది. అయితే కేంద్ర పన్నులను రాష్ట్రాలకు పంపిణీచే యడంలో మాత్రం అది ఎలాంటి తేడానూ చూపదు. ప్రణాళికా సంఘం, అర్థిక సంఘాల ద్వారా కేంద్రం రాష్ట్రాలకు సాధారణంగా అందించే నిధులకంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు లభించే నిధులు పలు విధాలుగా ఎక్కువగా లభిస్తాయి.

రాయలసీమ, ఉత్తరాంధ్రలలో వ్యవ సాయం ఎప్పుడూ దైవాధీనమే. మధ్యాంధ్ర, నెల్లూరు జిల్లాల్లోని అత్యుత్తమ మైన, సారవంతమైన, బంగారం పండే భూముల్లో గణనీయమైన భాగం యజమానులు హైదరాబాద్ వలసపోవడంతో అక్కడ సాగు మూలన పడింది. దీంతో మొత్తంగా రాష్ట్ర వార్షిక స్థూల ఉత్పత్తి తీవ్రంగా పడిపోయింది. ఉపాధి అవకాశాలు, రాబడులు క్షీణించాయి. ఒకప్పుడు వలస కూలీలకు పనులను కల్పించిన ప్రాంతాల నుంచి ప్రజలు పొట్ట పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసలు పోవాల్సివస్తోంది. భూమినే నమ్ముకుని ఉన్న రైతుల ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేకుండాపోయిన ఆంధ్రప్రదేశ్ వృద్ధి దిగజారిపోతోంది. హైదరాబాద్‌ను కోల్పోవడంవల్ల సర్వీసు రంగం, పారిశ్రామిక రంగం రెవెన్యూలో దాదాపు సగం ఆకస్మికంగా ఆగిపోయింది. ప్రధాన పరిశ్రమలన్నీ అక్కడే ఉండటంతో పారిశ్రామిక ఉత్పత్తి, మార్కెటింగ్, రవాణా రంగాలలోని ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయి.

ఇన్ని కారణాలవల్లా, ఐదేళ్ళపాటు ఎపి కి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్ మోహన్ సింగ్ పార్లమెంటులో హామీ ఇచ్చివుండటం వల్లా, ఐదేళ్ళు చాలదు పదేళ్ళు కావాలని రాజ్యసభలో వెంకయ్యనాయుడు వాదించి ఒప్పించి వుండటం వల్లా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వవలసిందే. ప్రజాస్వామ్యంలో పార్లమెంటు కంటే అత్యున్నత వ్యవస్ధ ఇంకేదీలేదు. అంతెందుకు ప్రధాని అధ్యక్షుడుగా వున్న నీతి ఆయోగ్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డీసీ)కి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా గుర్తించే అధికారం ఉంది. ఒకవేళ చట్టసవరణ చేయాలన్నా కూడా ముందే మాట ఇచ్చిన బిజెపికి దాన్ని నిలబెట్టుకునే సంఖ్యాబలం కూడా వుంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు చేయవద్దని రేవంత్‌కు కోర్టు ఆదేశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వారించిన కోర్టు ఇక పై ఈడీ...

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

HOT NEWS

[X] Close
[X] Close