ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజకీయ సమరాలే కాదు, క్రీడా సమరాలు కూడా మొదలుకానున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలను నిర్వహించేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయ విమర్శలు , సభా కార్యక్రమాలతో ఒత్తిడికి గురయ్యే ప్రజాప్రతినిధులకు ఈ క్రీడలు ఒక గొప్ప ఆటవిడుపుగా మారనున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ఉత్సాహంగా సాగే ఈ సంప్రదాయం, గత పదేళ్లుగా రాజకీయాల్లో పెరిగిన వ్యక్తిగత వైషమ్యాలు , ప్రాంతీయ విభేదాల కారణంగా కనుమరుగైపోయింది. అయితే, పాత రోజులను మళ్లీ గుర్తు చేస్తూ సభలో స్నేహపూర్వక వాతావరణాన్ని తీసుకురావాలని స్పీకర్ గట్టి పట్టుదలతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు తమ కళా ప్రతిభను చాటి అందరినీ అలరించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు మైదానంలో తమ క్రీడా నైపుణ్యాన్ని చూపేందుకు సిద్ధమవుతున్నారు. క్రికెట్, వాలీబాల్, ఇతర క్రీడల ద్వారా ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా సరదాగా గడిపే అవకాశం దక్కనుంది.
ఈ క్రీడా సంబరాల్లో పాల్గొనే అదృష్టం మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులకు దక్కేలా లేదు. సభకు వెళ్లే విషయంలోనే ఆ పార్టీ అధినేత జగన్ కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో, ఇలాంటి సరదా కార్యక్రమాలకు తన పార్టీ ఎమ్మెల్యేలను అనుమతిస్తారా అనేది అనుమానంగా మారింది. తోటి సభ్యులతో కలిసి క్రీడల్లో పాల్గొనడం లేదా సరదాగా గడపడం వంటివి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా భావించే అవకాశం ఉంది. కనీసం మండలిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలకైనా ఈ పోటీల్లో పాల్గొనే వెసులుబాటు కల్పిస్తారా లేక వారిని కూడా దూరంగా ఉంచుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రాజకీయ ప్రత్యర్థులైనా ఆటల దగ్గరకు వచ్చేసరికి స్నేహితులుగా మారడం ప్రజాస్వామ్యానికి అందం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అసెంబ్లీలో గంభీరమైన వాతావరణం తగ్గి, సభ్యుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. కానీ, వైసీపీ సభ్యులు ఈ స్నేహపూర్వక పోటీలకు దూరంగా ఉంటే మాత్రం వారు ఒక మంచి అవకాశాన్ని , సరదా క్షణాలను కోల్పోయినట్లే.
