రివ్యూ : నో వండ‌ర్‌… స్పైడ‌ర్‌

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

అయిన వారింట్లో పెళ్లంటే ఎన్ని ఊహిస్తామో క‌దూ.
మ‌ర్యాద‌లు బాగుంటాయి
వంట‌లు అదిరిపోతాయి
ఏర్పాట్లు బ్ర‌హ్మాండం
అటు ఏడు త‌రాలు… ఇటు ఏడు త‌రాలు చెప్పుకొనేలా ఉండాల్సిందే!
మ‌హేష్ – మురుగ‌దాస్‌ల సినిమా అన్నా – ఇన్నే ఎక్స్‌పెక్టేష‌న్స్‌!
మురుగ‌దాస్ మామూలు ద‌ర్శ‌కుడా?? బాలీవుడ్‌కి వంద కోట్ల రుచి చూపించిన తొలి ద‌ర్శ‌కుడు. ర‌మ‌ణ‌, గ‌జిని, తుపాకీ, క‌త్తి… అన్నీ బ్లాక్ బ్ల‌స్ట‌ర్లే. మ‌హేష్‌… మ‌నింటి సూప‌ర్ స్టార్‌ కొడితే దిమ్మ తిరిగి బాక్సాఫీసుకే బొమ్మ క‌న‌ప‌డుతుంది. మ‌హేష్ స్టామినా అది. ఆల్ టైమ్ రికార్డుల మొన‌గాడు. మ‌రి వీరిద్ద‌రి సినిమా అంటే.. ఇంకెలా ఉండాలి??

స్పైడర్ టైటిల్ – అందులో మ‌హేష్ లుక్ – వెనుక ఉన్న సంతోష్ శివ‌న్‌, హ‌రీష్ జ‌య‌రాజ్‌ల స్టామినా. రూ.150 కోట్ల బ‌డ్జెట్ ఇవ‌న్నీ… ఈ సినిమాని తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెట్టాయి. ట్రైల‌ర్ చూసిన‌వాళ్లు మొహాలు తేలేసినా – మురుగ‌దాస్‌పై న‌మ్మ‌కం ఎక్క‌డా స‌డ‌ల్లేదు. మ‌రి.. స్పైడ‌ర్ ఏమైంది?? టీజ‌ర్‌లా భ‌య‌పెట్టిందా?? లేదంటే అయిన‌వారి ఇంటి పెళ్లిలా ఘ‌నంగా క‌నిపించిందా?? స్పైడ‌ర్‌లో వండ‌ర్లు ఏంటి? బ్లండ‌ర్లు ఎన్ని??

* క‌థ‌

చెప్పుకోవ‌డానికి పెద్ద క‌థేం లేదు. ట్రైల‌ర్‌లోనూ, టీజ‌ర్‌లోనూ చూపించేసిన క‌థే. శివ (మ‌హేష్‌బాబు) ఇంటిలిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. ఫోన్ల‌ను ట్యాప్ చేయ‌డం త‌న ప‌ని. అయితే… త‌న తెలివి తేట‌ల‌తో ఓ సాఫ్ట్ వేర్ త‌యారు చేస్తాడు. ఎవ‌రు ఆప‌ద‌లో ఉన్నా.. ఆ సాఫ్ట్ వేర్ స‌హాయంతో వాళ్ల ఫోన్ సంభాష‌ణ విని, అవ‌స‌ర‌మైన వాళ్ల‌కు స‌హాయం చేస్తుంటాడు. ఓసారి ఓ అమ్మాయి ఆప‌ద‌లో ఉంద‌ని తెలిసినా కాపాడ‌లేక‌పోతాడు. అంతేకాదు.. మ‌రో ప్రాణం పోవ‌డానికి ప‌రోక్షంగా కార‌ణం అవుతాడు. అస‌లు ఆ రెండు హ‌త్య‌లు చేసిందెవ‌రు? అనే కోణంలోంచి ప‌రిశోధ‌న చేస్తే… భైర‌వుడు (సూర్య‌) ఆచూకీ తెలుస్తుంది. అత‌నో సైకో. చావు ఏడుపులంటే ఇష్టం. ఎంత‌మంది చ‌స్తే అంత సంతోషం. ఆ సైకో కార‌ణంగా హైద‌రాబాద్ న‌గ‌రానికి పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న నిజం తెలుస్తుంది. ఆ సైకో నుంచి… శివ హైద‌రాబాద్‌ని ఎలా కాపాడాడు అనేదే క‌థ‌.

* విశ్లేష‌ణ‌

ఈ క‌థ కోసం థియేట‌ర్‌కి వెళ్లాల్సిన ప‌ని లేదు. టీజ‌ర్‌లో, ట్రైల‌ర్‌లో చెప్పిన క‌థే. శివ ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? అనేది ముందే తెలిసిపోయింది. ఇక ఆస‌క్తిని రేకెత్తించాల్సిన అంశం.. శివ‌, ఆ సైకోని ఎలా ప‌ట్టుకొన్నాడు అనేదే. మురుగ‌దాస్ తెలివితేట‌పై అపార‌మైన న‌మ్మ‌కం ఉన్న‌వాళ్లంతా ఈ సినిమాని తుపాకీలాంటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిస్తాడ‌న్న భ‌రోసాతోనే చూస్తారు. అయితే మురుగ‌దాస్ అక్క‌డ‌క‌క్క‌డ పాస్ అవుతూ, అడ‌పాద‌డ‌పా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ.. ఎక్కువ సేపు టైమ్ పాస్ చేస్తూ.. చివ‌రికి వ‌చ్చేస‌రికి నిరాశ ప‌రుస్తాడు.

మ‌హేష్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌.. లీడ్ సీన్ చాలా పేల‌వంగా అనిపిస్తాయి. పైగా.. త‌మిళ వాస‌న‌! మ‌హేష్ లాంటి ఇంటిలిజెన్స్ ఉన్న క‌థానాయ‌కుడ్ని ప‌రిచ‌యం చేయాల్సిన తీరు ఇది కాదేమో అనిపిస్తుంది. కేవ‌లం మాట‌ల‌తోనే ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చిన మురుగ‌దాస్‌.. సినిమాలో ఎక్కువ భాగం ‘మాట‌ల‌తో’ న‌డిపించాడు. బండ‌రాయి ఎపిసోడ్ గురించి చాలా చ‌ర్చ జ‌రిగింది. ఆ సీన్‌లో మురుగ‌దాస్ ఇంటెలిజెన్సీ అంతా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఆశించారు. సెకండాఫ్ మొద‌లైనప్ప‌టి నుంచీ అంద‌రి క‌ళ్లూ దానిపైనే. అయితే… ఆ సీన్‌లో గ్రాఫిక్స్‌, మురుగ‌దాస్ ఇంటిలిజెన్సీ రెండూ జాయింటుగా తేలిపోయాయి.

ఈ క‌థ‌కు బ‌లం.. ఎస్‌.జె.సూర్య‌. ఆ క్యారెక్ట‌ర్‌ని డిజైన్ చేసుకొన్న విధానం అబ్బుర ప‌రుస్తుంది. మ‌న సినిమాల్లో విల‌న్‌ని విల‌న్‌లా చూపిస్తారు. అత‌ని గ‌తం, బాల్యం అన‌వ‌స‌రం. అయితే మురుగ‌దాస్ విల‌న్ పాత్ర‌ని బాల్యం నుంచి చూపించ‌డం మొద‌లెట్టాడు. అస‌లు భైర‌వుడు ఎందుకు అలా మారాడు? అత‌ని గుణ‌గ‌ణాలేంటి? అనేవిష‌యాల్ని చైల్డ్ ఎపిసోడ్ ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. చైల్డ్ ఎపిసోడ్ చూస్తున్న‌ప్పుడు ‘పెద్ద‌య్యాక వీడెంత భ‌యంకరంగా మారాడో’ అనిపిస్తుంది. అయితే ఆ ఇంటెన్సిటీ.. పెద్ద‌య్యాక పెద్ద‌గా క‌నిపించ‌దు. వాయిస్‌తో, న‌ట‌న‌తో చూపించిన భ‌యం తెలివితేట‌ల ద్వారా చూపించ‌లేక‌పోయాడు. బండ‌రాళ్లు దొర్లించ‌డంలో, ఆసుప‌త్రి బిల్డింగుని ప‌డ‌గొట్ట‌డంలో ప్ర‌తినాయ‌కుడి ఇంటిలిజెన్సీ ఏం క‌నిపించ‌దు. కేవ‌లం భ‌య‌పెట్టి ఆయా ప‌నుల్ని చేయించుకొంటాడంతే.

అయితే మురుగ‌దాస్ నుంచి ఆశించే మెరుపులు లేక‌పోలేదు…సైకోని ప‌ట్టుకోవ‌డానికి కాల‌నీలోని కొంత‌మంది మ‌హిళ‌ల్ని వాడుకొన్న తీరు.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ ఎపిసోడ్ల‌న్నీ చ‌క చ‌క రాపిడ్ స్పీడ్ వేగంతో జ‌రిగిపోతుంటాయి. లాజిక్ ఆలోచించే లోగా… ఆ సీన్ పూర్త‌యిపోతుంది.

ఓ సీన్‌లో క‌స్ట‌డీలో ఉన్న భైర‌వుడు శివ‌ని క‌ల‌వాలనుకొంటాడు. భైర‌వుడు ఒంటిగంట‌కు ర‌మ్మంటే.. అక్క‌డున్న పోలీసులు ప‌ది నిమిషాలు ఆల‌స్యంగా శివ‌ని లోప‌ల‌కి పంపుతారు. ”ఒంటిగంట‌కు ర‌మ్మ‌ని చెబితే ప‌ది నిమిషాలు ఆల‌స్యంగా చెప్తారేంటి?” అని శివ అడిగితే… ”వాడి చేతికి వాచీ లేదు క‌దా? ఇప్పుడే ఒంటి గంట అయ్యింద‌ని చెప్పు” అని స‌మాధానం ఇస్తారు పోలీసులు. నిజానికి టైమ్ గొడ‌వ ఇక్క‌డెందుకు వ‌చ్చిందా? అనిపిస్తుంది. కానీ దాన్ని కూడా.. ద‌ర్శ‌కుడు తెలివిగా వాడుకొన్నాడు. అదెలా అనేది తెర‌పై చూస్తే తెలుస్తుంది.

శివ ఇంటిపై ఎటాక్ చేస్తాడు భైర‌వుడు. ఆ స‌మ‌యంలో అమ్మ‌, త‌మ్ముడు ఇంట్లో ఉంటారు. భైర‌వుడి బారీ నుంచీ వాళ్ల‌ని హీరో ఎలా కాపాడుకొన్నాడ‌న్న పాయింట్‌నీ చాలా ఆసక్తిక‌రంగా చెబుతాడు మురుగ‌దాస్‌.

ఇలా కొన్ని చోట్ల‌.. మురుగ స్క్రీన్ ప్లే క‌ట్టి ప‌డేస్తుంది. కానీ.. ఈ మ‌హ‌త్తు చాల్లేదు. ఎదురుగా ఉన్న‌ది సూప‌ర్ స్టార్ అయిన‌ప్పుడు దానికి త‌గ్గ మెరుపులే క‌థ‌లో ఉండాలి. హీరో – విల‌న్‌ల మధ్య పోరు చాలా ఇంటిలిజెంట్‌గా ఉంటుంద‌ని ఆశిస్తారు ప్రేక్ష‌కులు. ఆస్థాయి… స్పైడ‌ర్ లో క‌నిపించ‌లేదు. ర‌హ‌స్య గూఢ‌చారి అనే లెవిల్లో టైటిల్ ఉంది. దానికి త‌గ్గ‌ట్టే ఇంటిలిజెన్స్ బ్యూరో నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. కానీ.. హీరో చేసేది కేవ‌లం… ఫోన్ ట్యాపింగ్ మాత్ర‌మే. క‌థ అక్క‌డే దెబ్బ‌కొట్టింది. ఫోన్ ట్యాపింగ్‌ని వ‌దిలి హీరో బ‌య‌ట‌కు రాలేక‌పోయాడు. ఈ క‌థ‌లో ర‌కుల్ ల‌వ్ స్టోరీ ఇరికించాడు ద‌ర్శ‌కుడు. సాధార‌ణంగా మురుగ‌దాస్ క‌థ‌ల్లో క‌థానాయిక‌ల పాత్ర‌లు బాగుంటాయి. గ‌జినిలో అసిన్‌నీ, తుపాకీలో కాజ‌ల్ పాత్ర‌ల్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. దానికి పూర్తి రివ‌ర్స్‌లో సాగింది స్పైడ‌ర్ వ్య‌వ‌హారం. పార్న్ వీడియోలు చూసి. త‌న కోరిక‌ల్ని అణ‌చి వేసుకోవ‌డానికి ఎవ‌రితో ఒక‌రితో డేటింగ్ చేయాల్సిందే అని క‌థానాయిక అనుకోవ‌డం.. మురుగ‌దాస్ స్థాయి ద‌ర్శ‌కుడికి త‌గ‌దు.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

మ‌హేష్ బాబులో న‌టుడి గురించి ఇవాళ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాల్సిన ప‌నిలేదు. త‌న‌కు త‌గిన పాత్ర దొరికిన‌ప్పుడు రెచ్చిపోతాడు. అయితే.. స్పైడ‌ర్ క‌థ‌లో, పాత్ర‌లో ఆ ల‌క్ష‌ణం క‌నిపించ‌దు. మ‌హేష్‌లో చ‌లాకీద‌నాన్ని, ‘చిరున‌వ్వు’నీ ఈ క‌థ చంపేసింది. దాంతో.. మ‌హేష్ కూడా సాధార‌ణ స్టార్‌లానే క‌నిపిస్తాడు. ర‌కుల్ గురించి ఏం చెప్పుకోక‌పోవ‌డ‌మే బెట‌ర్‌. ఆ పాత్ర కేవ‌లం పాట‌ల‌కే ప‌నికొచ్చింది. సూర్య ఈ సినిమాకి ఒకానొక ఇంట్ర‌స్టింగ్ ఫ్యాక్ట‌ర్‌. అత‌ని క్యారెక్టరైజేష‌న్‌, న‌ట‌న‌… ఆక‌ట్టుకొంటాయి. సూర్య లేకుండా మ‌రో రొటీన్ ప్ర‌తినాయ‌కుడు ఈ పాత్ర‌లో క‌నిపిస్తే… మొత్తం సినిమా చూసే భాగ్యం ఒక్క ప్రేక్ష‌కుడికీ ద‌క్క‌క‌పోదును. సూర్య‌కి చెప్పిన డ‌బ్బింగ్ కూడా అతికిన‌ట్టు స‌రిపోయింది. ప్రియ‌ద‌ర్శి ఉన్నాడు కానీ… జూనియ‌ర్ ఆర్టిస్టు స్థాయి పాత్ర అయిపోయింది.

* సాంకేతిక వ‌ర్గం

ఇండియాలోనే పేరెన్న‌ద‌గిన సాంకేతిక నిపుణులు ప‌నిచేశారు ఈ సినిమాకి. క‌థ‌, క‌థ‌నాల్లో బ‌లం లేన‌ప్పుడు స్టార్లున్నా ప‌ని జ‌ర‌గ‌దు అని చెప్ప‌డానికి ఈ సినిమా ఓ నిద‌ర్శ‌నం. పాట‌లెప్పుడో తేలిపోయాయి. తెర‌పై చూస్తుంటే.. క‌థ‌కు అడ్డుత‌గులుతున్న ఫీలింగ్ త‌ప్ప ఇంకేం క‌నిపించ‌దు. ర‌చ‌యిత‌గా మురుగ‌దాస్ అక్క‌డ‌క్క‌డ మెప్పిస్తాడు. మ‌హిళ‌ల‌కు మించిన స్పైలు ఉండ‌ర‌ని చెప్పే సీన్‌లో మాట‌లు న‌చ్చుతాయి. అయితే మురుగ‌దాస్ స్థాయి 100 శాతం చూపించిన సినిమా మాత్రం కాదిది. తుపాకి, క‌త్తిలాంటి సినిమా చూద్దామ‌ని వెళ్తే.. దానికి డూప్‌ల‌ను చూపించాడంతే. సీజీ వ‌ర్క్స్ అయితే పేల‌వంగా క‌నిపించాయి.

* ఫైన‌ల్ ట‌చ్ : ‘బ్ర‌హ్మోత్స‌వం’ కంటే బెట‌ర్ అంతే!

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.