టాలీవుడ్ లో బిజీగా ఉన్న కథానాయికల్లో శ్రీలీల పేరు తప్పకుండా చెప్పుకోవాల్సిందే. పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయింది. వరుస ఆఫర్లు, భారీ ప్రాజెక్టులతో దూసుకుపోయింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసేసింది. కాకపోతే.. అందులో హిట్లు తక్కువ. రొటీన్ పాత్రలు చేస్తోంది, మరీ పాటలకే పరిమితం అవుతోందన్న విమర్శల్ని గట్టిగా ఎదుర్కొంది. అన్నీ ఇలాంటి సినిమాలే చేసుకొంటూ పోతే, తన ఇమేజ్ దెబ్బ తింటుందని, తిరోగమనం తప్పదని సినీ పండితులు హెచ్చరించారు. కాకపోతే శ్రీలీల మాత్రం ఈ విషయంలో పిచ్చ క్లారిటీతో వుంది.
ప్రారంభంలో తనకు సినిమాల్ని ఎంచుకోవడం తెలిసేది కాదని, వచ్చిన ప్రతీ సినిమానీ ఒప్పుకొన్నానని చెప్పుకొచ్చింది శ్రీలీల. అయితే తన ఎంపిక పట్ల తనలో ఎలాంటి అసంతృప్తీ లేదంటోంది. ”నా నుంచి అభిమానులు కొన్ని ఆశిస్తారు. అలాంటివన్నీ ఇస్తూనే నాకు నేను కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికిప్పుడు నా ఇమేజ్ మార్చుకోవాలని ఏం అనుకోవడం లేదు. కనీసం ఓ వర్గానికైనా నా పనితనం నచ్చుతుంది. అది నాకు సరిపోతుంది” అంటోంది.
రొటీన్ పాత్రలు వస్తున్నాయన్న మాట శ్రీలీల కూడా ఒప్పుకొంది. సినిమా కోసం, అందులోని పాత్ర కోసం శ్రీలీల హార్డ్ వర్క్ చేసి, మేకొవర్ మార్చుకొన్న సందర్భాలు కూడా లేవు. ఆ అవసరం కూడా రాలేదు. ఓవైపు చదువుకొంటూనే, మరోవైపు సినిమాలు చేయాలన్నది శ్రీలీల నిర్ణయం. రెండింటికీ టైమ్ కేటాయించాలంటే, కమర్షియల్ సినిమాలే నయం. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. సెట్లో కూర్చుని చదువుకొన్న సందర్భాలూ ఉన్నాయి. కేవలం పాత్రపైనే ఫోకస్ చేయాలి, ముందస్తు ప్రిపరేషన్ తీసుకొనే సెట్ కి వెళ్లాలి అనుకొంటే.. తను పూర్తిగా చదువుని పక్కన పెట్టాలి. అందుకే శ్రీలీల అంత రిస్క్ తీసుకోలేదు.
తెలుగు 360కి శ్రీలీల ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకొంది. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
