గత వారమే.. ‘విష్ణు విన్యాసం’ సినిమా రిలీజ్ అయ్యింది. ఈలోగా శ్రీవిష్ణు నుంచి మరో సినిమా కూడా వచ్చేస్తోంది. అదే… ‘మృత్యుంజయ్’. నిజానికి ఈ రెండు సినిమాలూ ఒక రోజు గ్యాప్‌లోనే రావాలి. కానీ ఆ గండం తప్పించుకొని… ఓ వారం సమయం తీసుకొన్నాయి. ‘విష్ణు విన్యాసం’ చిత్రానికి రివ్యూల పరంగా పెద్ద స్పందన ఏం రాలేదు. దానికి తగ్గట్టుగానే తొలిరోజు బాక్సాఫీసు వసూళ్లు బోసిపోయాయి. అయితే.. రెండో రోజు, మూడో రోజు కాస్త నిలకడగా వసూళ్లు అందుకొంది. ఈరోజు నుంచి టికెట్లు ఎలా తెగుతాయి? అనేదాన్ని బట్టి ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీసు రిజల్ట్ అధారపడి ఉంది. సినిమా రిలీజ్‌కి ముందే లీక్ అయ్యిందని, బ్లాక్ మెయిలర్స్ బాధ తట్టుకోలేక హడావుడిగా సినిమాని ముగించామని చిత్రబృందం చెబుతోంది.
అయితే… ‘మృత్యుంజయ్’కి ఇలాంటి ఇబ్బందులు లేవు. కంటెంట్ అటూ ఇటుగా ఉంటే.. మరింత ఇబ్బంది పడాల్సివస్తుంది. పైగా ఇది సెపరేట్ జోనర్. ‘విష్ణు విన్యాసం’ పూర్తి ఎంటర్టైనర్. కథ అటు ఇటుగా ఉన్నా పట్టించుకోలేదు. కానీ ‘మృత్యుంజయ్’ ఒక థ్రిల్లర్. కథ, అందులోని మలుపులు కీలకం. కాబట్టి ప్రతీ విషయంలోనూ జాగ్రత్త పడాల్సిందే. శ్రీవిష్ణు బలమే కామెడీ. దాన్ని వదిలి చేసిన సినిమా కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. సుకుమార్ శిష్యులంతా మంచి హిట్లు కొట్టి, తమ కెరీర్‌ని స్ట్రాంగ్ గా నిర్మించుకొంటున్నవాళ్లే. మరి ఈ శిష్యుడు ఏం చేస్తాడో చూడాలి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. వాటికి మించిన విషయాలేవో సినిమాలో ఉండాలి. లేదంటే ఈ వారం కూడా శ్రీవిష్ణుకి ఎదురుగాలి తప్పదు.
