తెలుగు సినిమాల్లోని హీరోల పాత్రలు సూపర్మేన్లని తలపిస్తుంటాయి. ఏ డిఫెక్టు లేకుండా మిస్టర్ పర్ఫెక్టుల్లా కనిపిస్తూ అందరినీ ఓ ఆట ఆడేసుకొంటుంటారు. దర్శకనిర్మాతలు కమర్షియాలిటీ అంటూ మరి కాసిన్ని హంగులు జోడించేసరికి ఆ పాత్రలు మనకు సంబంధమే లేనివన్నట్టుగా తయారవుతుంటాయి. కథానాయకుడు కూడా మనలో ఒకడే… అతనికి కూడా మనలాగే కొన్ని మైనస్సలుంటాయి… ఆ పాత్ర కూడా సగటు మనిషిలా తెరపై కనిపించొచ్చనే విషయాన్ని ఏ కొన్ని సినిమాలో గుర్తు చేస్తుంటాయి. ఏ ఇమేజ్ లేని హీరోల సినిమాల్లోనే ఆ తరహా పాత్రలు కనిపిస్తుంటాయి. కానీ ఇటీవల హీరోలుగా మారిన కమెడియన్ల సినిమాల్లో కూడా కమర్షియల్ హంగులే ఎక్కువైపోతున్నాయి. అందరూ ఆశించే వినోదం తప్ప అందులో అన్నీ ఉంటున్నాయి. దాంతో ప్రేక్షకులు వాటిపై కూడా మనసు విరగ్గొట్టుకొంటున్నారు. `గీతాంజలి`తో కథానాయకుడిగా సక్సెస్ అయిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి మాత్రం మరోసారి ఓ సహజమైన కథని ఎంచుకొని `జయమ్ము నిశ్చయమ్మురా` చేశాడు. భూమ్మీద నడిచే హీరో పాత్రలోనే కనిపించాడు. మరి ఆ కథ, అందులో వినోదం మాటేమిటో తెలుసుకుందాం పదండి.
* కథ…
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కరీంనగర్ కుర్రాడు సర్వమంగళం (శ్రీనివాసరెడ్డి). తెలివి తేటలు ఎక్కువే అయినా ఆత్మవిశ్వాసం తక్కువ. ఎప్పుడూ ఆత్మన్యూనతా భావంతో ఇబ్బంది పడుతూ జ్యోతిష్యాన్ని నమ్ముతుంటాడు. పిత (జీవా) చెప్పిందే వేదం అన్నట్టుగా ఆయన్ని గుడ్డిగా ఫాలో అవుతుంటాడు. పిత చెప్పినవన్నీ చేస్తూ వచ్చిన సర్వమంగళం కాకినాడ మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తాడు. అక్కడికి వెళ్లినా పిత చెప్పినట్టుగానే నడుచుకుంటుంటాడు. తన తల్లి బాగోగులు చూసుకోవాలంటే మళ్లీ సొంతూరు కరీంనగర్‌కే వెళ్లాలనుకొంటాడు. రాణి (పూర్ణ) నీ జీవితంలోకి వస్తేనే కరీంనగర్‌కి బదిలీ అవుతుందని పిత చెబుతాడు. సర్వమంగళం ఆఫీసు పక్కనున్న మీసేవా కేంద్రంలో పనిచేసే అమ్మాయే రాణి. పిత చెప్పిన సలహాతో రాణికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు సర్వమంగళం. మరి రాణి ఆయన్ని ప్రేమించిందా లేదా? వాళ్లిద్దరి మధ్యకి వచ్చిన చడ్డ (రవివర్మ), కాంత్ (శ్రీవిష్ణు)ల కథేమిటి? రాణి కన్న కలల కోసం సర్వ మంగళం ఏం చేశాడు? ఆయన కోరుకున్నట్టుగా కరీంనగర్‌కి బదిలీ అయ్యిందా లేదా? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
* నటీనటుల ప్రతిభ
సినిమాకి నటీనటులే బలం. ప్రతి నాలుగైదు సన్నివేశాలకి తెరపై ఓ కొత్త పాత్ర కనిపిస్తుంటుంది. ప్రతి పాత్ర కూడా తనదైన ప్రభావాన్ని చూపుతుంటుంది. ముఖ్యంగా కథానాయకుడు శ్రీనివాసరెడ్డి నటన సినిమాకి కీలకం. అంధవిశ్వాసంతో కూడిన ఓ యువకుడిగా ఆ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. ఆ పాత్రలో మధ్య తరగతి యువకుడిగా చక్కటి అమాయకత్వాన్ని ప్రదర్శించాడు. కమెడియన్‌గా ఆయనకి ఓ ప్రత్యేకమైన మార్క్ ఉన్నప్పటికీ అది ఈ కథలో కనిపించకుండా చూసుకోవడం ప్లస్సయింది. పూర్ణ కూడా మధ్య ఓ సగటు యువతిగా చాలా బాగా కనిపించింది. కథతో పాటు, ఇందులో పాత్రల్ని కూడా సహజంగా తీర్చిదిద్దడంతో మన చుట్టూ వ్యక్తులే గుర్తుకొస్తుంటారు. అడపా ప్రసాద్‌గా కృష్ణభగవాన్, తత్కాల్‌గా ప్రవీణ్, గుంటూరు పంతులుగా కృష్ణభగవాన్ చాలా బాగా నటించారు.
* టెక్నికల్ టీమ్
దర్శకుడి గురించే మొదట చెప్పుకోవాలి. ఆత్మన్యూనతతో ఇబ్బందిపడే ఓ సగటు యువకుడి కథతోనూ వినోదం పండించొచ్చని, ఆ వినోదంతో ప్రేక్షకుల్ని మెప్పింపొచ్చని నమ్మడంలో ఆయన ధైర్యం కనిపిస్తుంది. ప్రభుత్వ కార్యాలయంలో వాతావరణాన్నీ, సగటు మనిషిలోని అవకాశవాదాన్ని అత్యంత సహజంగా తెరపైకి తీసుకొచ్చిన విధానం ఆయన ప్రతిభకి అద్దం పడుతుంది. అయితే కథలో మలుపులే పెద్దగా రక్తికట్టించవు. ఫస్ట్‌హాఫ్‌లో వినోదం జోడించడంలో విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్ సాగదీతలా మారింది. నగేష్ బానెల్ కెమెరా పనితనం చాలా బాగుంది. అలాగే రవిచంద్ర బాణీలు కూడా అలరించేలా ఉన్నాయి. నేపథ్యసంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విభాగం విఫలమైనట్టు కొన్ని సన్నివేశాలు గుర్తు చేస్తాయి.
* విశ్లేషణ
ఇందులో చెప్పుకోదగ్గ కథేమీ లేదు. కథా నేపథ్యమే ప్రేక్షకుడికి కాస్త కొత్తదనాన్ని పంచుతుంది. కథనం ఆసక్తికరంగా మలచడంలోనూ దర్శకుడు కొన్నిచోట్ల పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్ సన్నివేశాలు చాలావరకు పాత్రల్ని పరిచయం చేయడానికే పరిమితమయ్యాయి. కీలకమైన రాణి, అడపా ప్రసాద్, పంతులు, తత్కాల్, చడ్డా తదితర పాత్రలన్నీ తెరపైకొచ్చాకే కథ ఊపందుకుంటుంది. సర్వమంగళం పాత్ర ప్రతి విషయానికీ జ్యోతిష్యంపై ఆధారపడటం… అమాయకత్వంగా మెలుగుతుండడం… ఆ బలహీనతల్ని ఆసరాగా చేసుకొని ఇతర పాత్రలు ఇబ్బంది పెట్టడంలాంటి సన్నివేశాలతోనే ఫస్ట్‌హాఫ్ సన్నివేశాలు సాగిపోతాయి. కామెడీ మాత్రం పెద్దగా పండదు. దాంతో సన్నివేశాలన్నీ చప్పగా సాగిపోతున్నట్టుగానే అనిపిస్తాయి. ఆద్యంతం ఒక ఫీల్ మాత్రం కంటిన్యూ అవుతుంటుంది. ఆ ఫీలే ప్రేక్షకుడిని మలిభాగం చూసేందుకు సిద్ధం చేస్తాయి. మలిభాగంలో వినోదానికి పెద్దపీట వేశారు. ఫస్ట్ హాఫ్‌లో తనని ఇబ్బంది పెట్టిన వ్యక్తులందరి పని పడతాడు సర్వమంగళం. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే అప్పటిదాకా ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడిన సర్వమంగళం ఉన్నట్టుండి ఆత్మివిశ్వాసాన్ని పొంది చేసుకొనే సన్నివేశాలు కథకి అతకలేదు. ఆ పాత్రలో అంత మార్పు రావడానికి బలమైన కారణాలు అవసరం. కానీ ఆ కారణాల్ని ఎఫెక్టివ్‌గా చూపించలేదు దర్శకుడు. అక్కడ కథలో మరిన్ని మలుపులుంటే బాగుండేది కానీ, కీలకమైన ఆ ప్లేస్లోనే కథ ఫ్లాట్‌గా మారడంతో సన్నివేశాలన్నీ ఊహకు తగ్గట్టుగానే తెరపై కనిపిస్తుంటాయి. పతాక సన్నివేశాల్ని మరింత లాగినట్టు అనిపిస్తాయి. తొలి సగభాగం ఫీల్‌ని క్యారీ చేస్తే, మలి సగభాగాన్ని వినోదంతో ఫిల్ చేశాడు దర్శకుడు. కృష్ణభగవాన్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గుండు సుదర్శనం, అదుర్స్ రఘు, ప్రభాస్ శ్రీను తదితర పాత్రల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా మంగళవారం అంటూ సాగే హంగామా సినిమాకి ప్రధాన బలం. శ్రీనివాసరెడ్డి తెలంగాణ యాసలో మాట్లాడటం, మిగిలిన పాత్రలు ఆంధ్ర యాసలో మాట్లాడటం… `దేశవాళీ వినోదం` అనే నినాదానికి యాప్ట్‌గా అనిపిస్తుంది. సహజమైన కథని, అంతే సహజంగా తీసుకొచ్చిన ప్రయత్నం విషయంలో మాత్రం దర్శకుడిని అభినందించాల్సిందే.
తెలుగు360 రేటింగ్: 2.25