ఒక్కసారి వదిలిన బాణం, నోటి నుంచి విడిచిన మాటా వెనక్కి రాలేవు. ఒకప్పుడు నోరు జారి.. అయ్యె.. అప్పుడు అలా అనేశానా?? అంటూ బాధపడడంలో అర్థం లేదు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి పరిస్థితి అలానే తయారైంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ విషయంలో నోరు జారిన పాపానికి ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నాడు. 2009 ఎన్నికల సమయంలో ప్రచారంలో ఉన్న ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురైన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్ చావుకి దగ్గరగా వెళ్లొచ్చాడు. ఎన్టీఆర్ ప్రమాద సమయంలో శ్రీనివాసరెడ్డి వెనుక కారులో ప్రయాణిస్తున్నాడు. `ఆ రోజు నేనున్నాను కాబట్టే ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడు` అంటూ తన స్నేహితుల దగ్గర నోరు జారాడు శ్రీనివాసరెడ్డి. అది ఆ నోటా.. ఈనోటా ఎన్టీఆర్‌కి చేరడం, అప్పట్నుంచి శ్రీనివాసరెడ్డిని ఎన్టీఆర్ దూరం పెట్టడం జరిగాయి. ఇప్పుడు ఆ ఎపిసోడ్‌ని గుర్తు చేసుకొని తెగ ఫీలవుతున్నాడు శ్రీనివాసరెడ్డి.
ఆ సంఘటన తరవాత ఎన్టీఆర్‌తో ఈ రెడ్డిగారికి మాటల్లేకుండా పోయాయి. ఎన్టీఆర్ సినిమాల్లో మనోడికి అవకాశాలూ దక్కలేదు. అయితే ఆ ఎపిసోడ్ శ్రీనివాసరెడ్డిని ఇంకా వెంటాడుతూనే ఉందేమో..?? జరిగిన పొరపాటుకు పశ్చాత్తాప పడుతున్నాడు. శ్రీనివాసరెడ్డి నిజంగానే నోరు జారాడో, ఏం చెప్పాడో అది ఎన్ని చిలవలు పలవలుగా తయారైందో వేరే విషయం. పొరపాటు జరిగిందని తెలిసిన వెంటనే శ్రీనివాసరెడ్డి.. ఎన్టీఆర్కే వివరణ ఇచ్చుకోవాల్సింది. `తప్పు మనది కాదు కదా` అంటూ మనోడు సైలెంట్ అయిపోయాడు. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు తేరుకొని.. `త్వరలోనే ఎన్టీఆర్ ని కలుస్తా` అనడంతో కొత్తగా ఒరిగేదేం ఉండదు. ఎప్పుడో ఏడేళ్ల క్రితం నాటి ఎపిసోడ్ ఇది. అప్పుడే పుల్ స్టాప్ పెట్టాల్సింది. దాన్ని ఎన్టీఆర్ కూడా మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఏరి కోరి దాన్ని మళ్లీ బయటకు లాక్కొచ్చాడు శ్రీనివాసరెడ్డి. ఈ ఎపిసోడ్ కొత్తగా తెలియడం వల్ల శ్రీనివాసరెడ్డికి ఒరిగేదేం లేదు. పైగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర ఇంకాస్త లోకువ అవుతాడు. ఇంత చిన్న లాజిక్‌ని ఈ కమెడియన్ ఎలా మిస్సయ్యాడో??