శ్రీనువైట్ల ఫార్ములా ఏంటో అందరికీ తెలిసిందే. హీరోగారు.. విలన్ ఇంట్లో తిష్ట వేసుకొని, అక్కడవాళ్లందరినీ బకరాలు గా మార్చి, కామెడీ చేసి… ఓ ఆటాడేసుకొంటాడు. అంతకు మించిన కథ ఏం ఉండదు. ఢీ నుంచి అదే ఫార్ములాని నమ్ముకొన్నాడు. ఈ ఫార్ములానే శ్రీనువైట్లని హిట్ డైరెక్టర్ చేసింది, డిజాస్టర్లలో నెట్టేసింది. అయినా సరే.. దాన్ని వదలడం లేదు శ్రీనువైట్ల. ఆఖరికి ఇప్పుడు వరుణ్ తేజ్ తో తెరకెక్కుతున్న మిస్టర్ సినిమా స్టోరీ కూడా సేమ్ టూ సేమ్ ఇంతేనట. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. మిస్టర్ స్టోరీ ఇలా సాగబోతోంది.
ఫారెన్ కుర్రాడు (వరుణ్ తేజ్) అక్కడో అమ్మాయి (హెబ్బా పటేల్) నుంచి తప్పించుకొని ఇండియా వస్తాడు. ఇక్కడ ఇంకో అమ్మాయి (లావణ్య త్రిపాఠీ) పరిచయం అవుతుంది. ఆమె కష్టాల్లో ఉన్నదని తెలుసుకొని ఆసరా ఇస్తాడు. అయితే ఇంట్రవెల్ బ్యాంగ్‌లో ఆ అమ్మాయిని ఎవరో (మురళీ శర్మ) కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ లావణ్యని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు. సొంత బంధువులే. ఆ గోలేంటో తెలుసుకోవడానికి హీరోయిన్ ఇంటికి వెళ్తాడు హీరో. తనని లావణ్య త్రిపాఠి లవర్ గా పరిచయం చేసుకొంటాడు. ఇంతలో.. విదేశాల్లో ఉంటున్న హెబ్బా పటేల్ కూడా అదే ఇంట్లో దిగుతుంది. అక్కడి నుంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంటుంది. హీరోయిన్ ఇంట్లోవాళ్లని బకరాలు చేసి, ఆడేసుకొంటాడు హీరో. చివరికి ఎవరిని పెళ్లి చేసుకొన్నాడీ మిస్టర్ అనేదే.. స్టోరీ! చూస్తుంటే కథలో కొత్తదనం లేదు. సరికదా.. తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన వందలాది సినిమాలు గుర్తొస్తున్నాయి. అయితే ట్రీట్ మెంట్ పరంగా, కామెడీ పరంగా.. శ్రీనువైట్ల తనదైన మార్క్ వేస్తే… మిస్టర్ ఆకట్టుకోవొచ్చు. మరి లీక్ అయిన మిస్టర్ కథ ఇదేనా, లేదంటే వేరేదేమైనా ఉందా? పాత కథని శ్రీనువైట్ల ఎంత తెలివిగా హ్యాండిల్ చేశాడు? ఈ విషయాలు తెలియాలంటే.. మిస్టర్ సినిమా బయటకు రావాల్సిందే.