హైదరాబాద్: మహేష్‌బాబు తాజా చిత్రం శ్రీమంతుడులో శృతిహాసన్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఈనెల 7న విడుదల ఈ చిత్రం విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. శృతిహాసన్ ఒక టీవీ ఛానల్‌లో ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీమంతుడుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన పాత శ్రీమంతుడు చిత్రానికి తన తండ్రి కమలహాసన్ పనిచేశారని, కొత్త శ్రీమంతుడు చిత్రంలో తాను పనిచేశానని చెప్పారు. ఇదొక ఆసక్తికరమైన అనుభవమని అన్నారు. తన తండ్రి పనిచేసిన శ్రీమంతుడు అప్పట్లో అందరినీ అలరించిందని, మహేష్ శ్రీమంతుడుకూడా ఆకట్టుకుంటుందని చెప్పారు. మహేష్ సెట్లో ఉంటే సందడే సందడని, అతను సింపుల్‌గా ఉంటాడని అన్నారు.
పాత శ్రీమంతుడు చిత్రానికిగానూ డాన్స్ డైరెక్టర్ దగ్గర సహాయకుడిగా కమలహాసన్ పనిచేశారు. మరోవైపు ఈ సినిమాలోని ‘టాటా వీడుకోలు’ అనే పాటలో అక్కినేని మిత్రులలో ఒకడిగా ఒకచోట తళుక్కుమన్నారుకూడా. తర్వాత బాలచందర్ కమల్‌ను ఒప్పించి నటనలోకి దించారు. మరోవైపు తన అభిమాన నటుడు కమలహాసన్ కుమార్తెతో నటించటం ఒక విచిత్రమైన అనుభవమని మహేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.