రాజమౌళికి ఓ అలవాటు వుంది. తన ఆడిటోరియాన్ని ముందే ప్రిపేర్ చేస్తారాయన. ఎలాంటి కథ చెప్పబోతున్నారు? సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయి? నేపథ్యం ఏమిటి? అనే విషయాల్ని ఓ ప్రెస్ మీట్ పెట్టి ముందే చెప్పేస్తారు. ఈగ, మర్యాద రామన్న, మగధీర, బాహుబలి, ఆర్.ఆర్.ఆర్… ఈ సినిమాల విషయంలో ఇదే జరిగింది. కానీ మహేష్ బాబు సినిమాకు సంబంధించి.. ఎలాంటి సినిమా తీస్తున్నారో, ఏం చూపించబోతున్నారో ఎలాంటి క్లూ ఇవ్వలేదు. మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు. వాటికి తెర పడే సమయం ఆసన్నమైంది.
నవంబర్‌లో ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్ రాబోతోంది. నవంబరు 11 లేదా 15 తేదీల్లో హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ప్లాన్ చేయడానికి రాజమౌళి డిసైడ్ అయ్యారు. అప్పుడే గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఈ గ్లింప్స్‌కు సంబంధించిన ఎడిటింగ్, ఆర్.ఆర్ కూడా పూర్తయినట్టు టాక్. ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఈ గ్లింప్స్ లో రాజమౌళి ఏం చూపించబోతున్నారనే విషయం ఆసక్తిని కలిగిస్తోంది.
ఇదివరకటిలా రాజమౌళి తన సినిమా నేపథ్యాన్ని ఈ గ్లింప్స్ లోనే చూపించబోతున్నారని టాక్. కథానాయకుడి పాత్రని గ్లింప్స్ లో పరిచయం చేస్తూ, ఈ సినిమా స్పాన్ ఏమిటన్న విషయాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లోనే వారణాసికి సంబంధించిన లావీష్ సెట్ వేశారు. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారు. కెన్యాలో కూడా ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. అక్కడ షూట్ చేసిన సన్నివేశాలే… ఇప్పుడు గ్లింప్స్ లో కనిపించబోతున్నాయని తెలుస్తోంది.
ఈ సినిమా కథకీ, రామాయణానికీ లింకు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మహేష్ శ్రీరాముడిగా కనిపించబోతున్నాడని కూడా అంటున్నారు. శ్రీరాముడిగా మహేష్ పై లుక్ టెస్ట్ చేశారని చెప్పుకొంటున్నారు. అ షాట్స్ ఏమైనా గ్లింప్స్ లో కనిపిస్తాయేమో చూడాలన్నది అభిమానుల ఆశ. మరి.. రాజమౌళి మాస్టర్ మైండ్ లో ఏముందో?