రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష శాసనసభ్యులు సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు ఎటువంటి పరాభవం ఎదుర్కొన్నారో, తమిళనాడు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె సభ్యులు కూడా అటువంటి చేదు అనుభవమే నిన్న ఎదుర్కొన్నారు. సభా వ్యవహారాలకి ఆటంకం కలిగిస్తున్నదున మొత్తం 80 మంది డిఎంకె సభ్యులని సభ నుంచి వారం రోజులు సస్పెండ్ చేయబడ్డారు.
ఇటీవల జరిగిన ఎన్నికలలో కొద్దిపాటి తేడాతో అధికారం చేజార్చుకొన్న డిఎంకె పార్టీకి శాసనసభలో మొత్తం 89 సభ్యులుంటే, అధికార అన్నాడిఎంకె పార్టీకి 133సభ్యులున్నారు. కనుక శాసనసభలో ఆ రెండు పార్టీల సభ్యులు నువ్వా నేనా అన్నట్లుగా వాదోపవాదాలు సాగిస్తుంటారు.
డిఎంకె పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా తరువాత కరుణానిధి కొడుకులు అళగిరి, స్టాలిన్ ల మధ్య మళ్ళీ ఆధిపత్యపోరు మొదలైంది. ఇదివరకు స్టాలిన్ తన రాజకీయ వారసుడని కరుణానిధి ప్రకటించి ఉన్నందున పార్టీపై తన ఆధిపత్యం చాటుకొనేందుకు స్టాలిన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నరు. బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే ‘నమకు నామే’ అనే పేరిట ఇటీవల రాష్ట్రంలో యాత్ర చేశారు.
అధికార అన్నాడిఎంకె సభ్యుడు గుణశేకరన్ ఆ యాత్రని కించపరుస్తూ శాసనసభలో మాట్లాడటంతో డిఎంకె సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభని స్తంభింపజేశారు. వారు ఎంతకీ శాంతించకపోవడంతో స్పీకర్ పి.ధనపాల్ వారందరినీ సభ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ మార్షల్స్ చేత బయటకి పంపించారు. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాలిన్ ఈనెల 22నుంచి రాష్ట్రా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, సభలు, ధర్నాలు నిర్వహించి అధికార పార్టీ దురహంకారాన్ని, స్పీకర్ పక్షపాత ధోరణి గురించి ప్రజలకి తెలియజేస్తామని చెప్పారు.
ఇప్పుడు తమిళనాడులో జరిగినది ఇదివరకే ఆంధ్రా, తెలంగాణా శాసనసభల్లో జరిగింది. కానీ ఏపి శాసనసభలో ప్రధానప్రతిపక్షంగా ఉన్న వైకాపా ఎంతగా రెచ్చిపోయి మాట్లాడినప్పటికీ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు చాలా సంయమనంగానే వ్యవహరించారని చెప్పవచ్చు. తనపై, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు కూడా ఆయన వైకాపాని అనుమతించారు. కానీ వైకాపా ఎమ్మెల్యే రోజా సభలో అనుచితంగా మాట్లాడటంతో ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. వైకాపా సభ్యులని కూడా సస్పెండ్ చేసినప్పటికీ రెండు మూడు రోజులకే అది పరిమితం చేశారు. స్పీకర్ వారిని సస్పెండ్ చేసినరోజుల కంటే వారే శాసనసభని బహిష్కరించి వెళ్ళిపోయిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
గత ఏడాది తెలంగాణా శాసనసభలో తెదేపా సభ్యులు అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ చేయబడ్డారు. అప్పుడు వారు కూడా ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపట్టారు. కానీ విచిత్రం ఏమిటంటే వారిలో ఇద్దరు తప్ప మిగిలిన వారు అందరూ అధికార తెరాసలోనే ఉన్నారిపుడు. ఈసారి శాసనసభలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సభ్యులు గట్టిగా నిలదీయలనుకొంటున్నారు కనుక వారిపై సస్పెన్షన్ వేటు పడుతుందేమో?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం, చట్టాలని రూపొందించడం కోసం శాసనసభలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ వాటిలో ఆ రెండు పనుల కంటే అధికార, ప్రతిపక్షాల రాజకీయ చర్చలు, వ్యక్తిగత విమర్శలు ప్రతివిమర్శలు వృధా ప్రసంగాలు, వాదోపవాదాలే ఎక్కువగా జరుగుతున్నాయి. తమిళనాడు శాసనసభలో జరిగిన ఈ ఘటనే అందుకు చక్కటి ఉదాహరణ.