బీహార్ లో ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ.. ఓ పథకం పేరుతో ప్రతి మహిళ అకౌంట్లో పది వేలు జమ చేశారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఓట్లు కొన్నారని ఇతర పార్టీలు మండిపడ్డాయి. ఆ పది వేల మ్యాజిక్ పని చేసిందో లేదో తెలియదు కానీ.. ఎన్డీఏ కూటమి మాత్రం తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడు అదే ఫార్ములాను తమిళనాడులో ప్రయోగించారు స్టాలిన్.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నగదును జమ చేశారు. కలైజ్ఞార్ మహిళా హక్కుల పథకం కింద ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసింది. ఈ పథకం కింద నెలకు రూ. వెయ్యి ఇవ్వాలనుకున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన నెలవారీ భృతి రూ. 3,000లను అడ్వాన్స్‌గా చెల్లించింది.
దీనికి అదనంగా వేసవి ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ.2,000లను బోనస్‌గా అందిస్తూ మొత్తం రూ. 5,000లను ఒకేసారి విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించిన స్టాలిన్.. ఎన్నికల సాకుతో కొందరు ఈ పథకాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన సోదరీమణులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న రూ. 1,000 నెలవారీ భృతిని రూ.2,000లకు పెంచుతామని స్టాలిన్ హామీ ఇచ్చారు.