తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. యువ ఓటర్లు అంతా విజయ్ వైపు వెళ్తారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో స్టాలిన్ కొత్త స్కీమ్ అమలు ప్రారంభించారు. ఆ స్కీమ్ కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికే వర్తించేలా ఉంటుంది.
ఎన్నికల హామీల్లో భాగంగా విద్యార్థులకు ఉచిత ల్యాప్ ట్యాప్ హామీని స్టాలిన్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు దాన్ని అమలు చేయడం ప్రారంభించారు. దాదాపుగా ఇరవై లక్షల మంది యువ విద్యార్థులకు వీటిని అందిస్తున్నారు. సోమవారమే పంపిణీ కూడా ప్రారంభమయింది. మొదటి విడతగా పది లక్షల మందికి ఇస్తున్నారు. ఈ ల్యాప్ ట్యాప్ లబ్దిదారులు అంతా ఇరవై ఏళ్ల లోపు వాళ్లే. పద్దెనిమిదేళ్లు నిండిన వారే. అంటే డీఎంకే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వారికి ఓటు హక్కు వచ్చింది. ఇప్పుడు వారు ప్రభుత్వం నుంచి ల్యాప్ ట్యాప్ బహుమమతిగా పొందుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చేదే కదా అని ఏదో డబ్బా ల్యాప్ ట్యాప్ లు పంపిణీ చేయడం లేదు. విద్యార్థుల కెరీర్ కు ఉపయోగపడేలా.. మంచి కన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్ ట్యాప్ లే పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే మరో పది లక్షల ల్యాప్ ట్యాప్ లు పంచనున్నారు. యువ ఓటర్లంతా.. డీఎంకే వైపు ఈ పథకం ద్వారా మళ్లితే.. అది రాజకీయ ఫలితాల్లో కీలకం అవుతుంది.
