నాలుగు చేతులా సంపాదించడం ఎలాగో మన హీరోయిన్లని చూసి నేర్చుకోవాలి. సినిమాలు, యాడ్లు, షాపింగ్ మాళ్లూ, పార్టీల్లో డాన్సులూ ఓహ్.. ఎలా చూసినా డబ్బే. మొన్నటికి మొన్న గాలి వారి పెళ్లికి వెళ్లి లక్షలు కుమ్మరించుకొచ్చారు. అఫ్ కోర్స్.. ఇప్పుడు ఐటీ శాఖకు సమాధానం చెప్పుకోవాల్సివచ్చిందనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు మరోసారి నాలుగు రాళ్లు వెనకేసుకొనే అవకాశం వచ్చింది. అదీ.. ఈయేడాది చివరి రోజునే. డిసెంబరు 31 వచ్చిందంటే.. మన కథానాయికల కాల్షీట్లు ఎప్పుడో బుక్ అయిపోతాయి. ప్రతీ యేడాదీ ఇదే తంతు. ఆ రోజు.. మన హీరోయిన్లు ఎవ్వరికీ కనిపించరు. షూటింగులు బందు. పెద్ద పెద్ద ఇళ్లలో, వాళ్లు ఏర్పాటు చేసే పార్టీల్లో గానా బజానా కార్యక్రమానికి హాజరవుతుంటారు. తద్వారా.. ఆ ఒక్కరాత్రే లక్షలు సంపాదించుకొంటారు. ఈసారీ.. అదే జరగబోతోంది. తమన్నా, రకుల్, రాశీఖన్నా, పూజన్ బాజ్వా, ప్రియమణి, శాన్వీ నుంచి ముమైత్ ఖాన్ లాంటి ఒకప్పటి హాట్ భామల వరకూ అందరి కాల్షీట్లూ ఆ రోజు బుక్ అయిపోయాయని సమాచారం.
ఆ ఒక్కరాత్రి.. అందునా రెండు గంటల పాటు షో ఇచ్చినందుకు ఒకొక్కరికీ వాళ్ల రేంజునీ, ప్రస్తుత ఫామ్‌ని బట్టీ లక్షలు, కోట్లు అందుతాయి. ఇదంతా కథానాయికల సైడ్ బిజినెస్. పెద్ద నోట్ల ప్రభావంతో ఈసారి న్యూ ఇయర్ వేడుకల ఎప్పట్లా గ్రాండ్‌గా జరగవేమో, మన హీరోయిన్లకు పిలుపులు రావేమో అనుకొన్నారంతా. అయితే… ఆ ఎఫెక్ట్ న్యూఇయర్ పార్టీలపై పడడం లేదని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే స్టార్ హీరోయిన్లపై కర్చీఫ్‌లు వేసుకొన్నాయి కొన్ని సంస్థలు. ఒక్క హైదరాబాద్‌లోనే ఆరేడు చోట్లు సినీ స్టార్ల డాన్సింగు పోగ్రామ్లు ఏర్పాటు చేసినట్టు.. ఒకొక్క పార్టీకీ ఇంచుమించుగా కోటి రూపాయల వరకూ ఖర్చు పెడుతున్నట్టు టాక్.
గోవా, ముంబైలలోనూ ఈ తరహా పార్టీలు జరగబోతున్నాయని, అక్కడ కూడా సౌత్ ఇండియన్ స్టార్స్ పెద్ద సంఖ్యలోకనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఎవరెవరు ఎక్కడెక్కడ దర్శనమిస్తారో, ఈ పార్టీల ద్వారా ఎంతెంత సం పాదించుకొంటున్నారో… తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.