రుషికొండ ప్యాలెస్‌ను రిసార్టుగా మార్చేందుకు ప్రముఖ హోటల్ గ్రూపులు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. హోటల్స్ గా అయితే ఈ నిర్మాణాలు పనికి రావు.కానీ రిసార్టులుగా అయితే మార్చడానికి అవకాశం ఉంటుంది. కొండనుకొట్టేసి చదును చేసిన మరో తొమ్మిది ఎకరాలు ఖాళీగా ఉంది. అక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా గ్రీనరీని ఏర్పాటు చేసి.. రిసార్టుగా అభివృద్ధి చేసుకుంటే.. మంచి వ్యాపారం జరిగే అవకాశం ఉంది.
ఏపీ టూరిజం ఈ రిసార్టును నిర్వహించడం అసాధ్యం. ఎంతో ప్రైమ్ ప్లేసుల్లో హోటల్స్ ఉంటే వాటి నిర్వహణతో కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా.. అవినీతి కారణంగా తక్కువ ఆదాయమే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కేవలం నిర్వహణ కోసం పాతికలక్షలు ఖర్చు అయ్యే ప్యాలెస్ ను … కమర్షియల్ గా టూరిజం శాఖ నిర్వహించాలంటే నష్టాలు ఖాయం అవుతాయి. అదే ప్రైవేటుకు ఇస్తే.. వారు పెట్టుబడికి తగ్గ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది.
మరో వైపు ఏదైనా దేశ కాన్సులేట్ కు ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. విశాఖలో కాన్సులేట్లు పెట్టడం కష్టమే. ఇప్పుడు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. త్వరలో మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా రిసార్టుగా మార్చడానికే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.