జాతీయ గీతం గురించి అందరికీ తెలుసు. రాష్ట్ర గీతాలు ఉంటాయని చాలా మందికి తెలియదు.కానీ తమిళనాడులో రాష్ట్ర గీతం ఉంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో అందరూ జాతీయ గీతం ఆలపిస్తారు. కానీ తమిళనాడులో రాష్ట్రగీతం ఆలపిస్తారు. అదే అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయంలో మాత్రం జాతీయ గీతం ఆలపిస్తారు. దీనిపై గవర్నర్ రవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో ప్రసంగించకుండానే వాకౌట్ చేశారు.
గవర్నర్ ఆర్ఎన్ రవికి, స్టాలిన్ ప్రభుత్వానికి చాలా గొడవులు ఉన్నాయి. అయితే సంప్రదాయం ప్రకారం అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించినప్పుడు సభను ఉద్దేశించి గవర్నర్ తో ప్రసంగింపచేయాల్సి ఉంది. అందు కోసం గవర్నర్ వచ్చారు కూడా. కానీ ముందుగా జాతీయ గీతం వినిపించకుండా.. తమిళనాడు రాష్ట్ర గీతం వినిపించడంతో ఆయన అసహనానికి గురయ్యారు. జాతీయ గీతానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, దానిని సభ ప్రారంభంలోనే ఆలపించాలన్నారు.కానీ పట్టించుకోకపోవడంతో ఆయన వాకౌంట్ చేశారు. ఈ అంశంపై గతంలోనూ గవర్నర్ వాకౌట్ చేశారు. ప్రసంగం చదవకుండానే సభను వీడి వెళ్లారు.
గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభా మర్యాదలను, రాష్ట్ర గీతాన్ని గవర్నర్ అవమానించారని, కావాలనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా ఇదే అంశంపై ఇరువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండగా, వరుసగా మూడో ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే సభను కొనసాగించేలా ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇలాంటి వివాదాలు తమిళనాడులో పెద్దవి అవుతున్నాయి. సెంటిమెంట్ రాజకీయాలు పెరుగుతున్నాయి.
