స్టా…..ర్…..హీరో. అభిమానులు దేవుళ్ళ జపం ఎన్ని సార్లు చేస్తారో తెలియదు కానీ ఈ సినిమా గాడ్స్(అని వాళ్ళ మాట) పేర్లను మాత్రం దినదినమూ జపిస్తూనే ఉంటారు. ఆ స్టార్స్‌కి వ్యతిరేకంగా సొంత అమ్మానాన్నలు మాట్లాడినా సరే ఈ అభిమాన ‘మూర్ఖులు’ తట్టుకోలేరు. వీళ్ళ మూర్ఖత్వంతో ఎన్ని వందల సార్లు శాంతిభద్రతల సమస్యలు క్రియేట్ చేశారో లెక్కే లేదు. సమాజ సేవ కోసమే పుట్టాం అని చెప్పుకుతిరిగే స్టార్ హీరోస్ వీళ్ళ బానిసత్వాన్ని ఇంకొంచెం పెంచి పోషిస్తూ ఉంటారు. ఆడియో రిలీజ్ వేదికల పై నుంచి, మీడియాతో మాట్లాడేటప్పుడు, ఇంకా సినిమాల్లో కూడా అభిమానులే మా ప్రాణం, అభిమానులకు పాదాభివందనం చేస్తున్నాం, అభిమానులను ఎంటర్టైన్ చేయడం కోసమే సినిమాలు తీస్తున్నాం…లాంటి రొటీన్ రొడ్డకొట్టుడు డైలాగులతో అభిమానుల పైత్యాన్ని పీక్స్‌కి తీసుకెళుతూ ఉంటారు. ఈ విషయంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోస్ అందరూ గ్రాండ్ మాస్టర్సే. ఒరిజినల్‌గా అభిమానుల విషయంలో ఈ స్టార్ హీరోస్ అభిప్రాయాలు ఎంత ——గా ఉంటాయో వాళ్ళతో వర్క్ చేసిన డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కథలు కథలుగా చెప్తూ ఉంటారు.
ఆ విషయం పక్కన పెడితే… అభిమానుల పైత్యమే ఇప్పుడు పసివాళ్ళ ప్రాణాలు తీసే స్థాయికి వెళుతోంది. కొంచెం ఘాటుగా అనిపించినా, అతిశయోక్తిగా ఉన్నా ఇది నిజమే. ఎందుకు చేస్తున్నామో కూడా తెలియనంత మూర్ఖత్వంతో ఇరవై వేల గ్యాలన్ల పాలను సౌత్ ఇండియన్ సూపర్ స్టార్‌గా చెప్పబడే రజినీకాంత్ సినిమా ‘కబాలి’ రిలీజ్ సందర్భంగా నేలపాలు చేశారు. 16వేల గ్యాలన్ల పాలతో రజినీకాంత్ పోస్టర్స్‌కి పాలాభిషేకం చేశారని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. అనధికారికంగా ఆ లెక్క ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. రజినీకాంత్ ఒక్కడే కాదు విజయ్, అజిత్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ…….ఇంకా బోలెడన్ని పేర్లు చెప్పుకోవచ్చు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే అభిమానులు చేస్తున్న ఈ మూర్ఖపు పని గురించి స్టార్ హీరోస్ అందరికీ తెలుసు. అయినా గట్టిగా స్పందించిన సందర్భం ఒక్కటీ లేదు. పైరసీ రక్కసి దెబ్బకు వాళ్ళ సినిమాల కలెక్షన్స్ దె్బ్బతింటున్నాయనే సరికి అన్ని భాషల స్టార్ హీరోస్ కూడా మామూలు హడావిడి చేయలేదు. ఎన్నోసార్లు ప్రభుత్వాధినేతలను కలిశారు. మా అభిమానులు పైరసీదారులను వదలిపెట్టరు. వాళ్ళే పైరసీ దారులను పట్టుకుంటారు అనే రేంజ్లో మాట్లాడి అభిమానులను కూడా రెచ్చగొట్టారు.
రజినీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎప్పుడూ సమాజం గురించి మాట్లాడుతూ ఉంటారు. తెలుగు, తమిళ్ వరకూ ఎక్కువ పాల నష్టం జరుగుతోంది వీళ్ళ సినిమాల రిలీజ్ టైంలోనే. అందుకే ఎప్పుడో రాజకీయాల్లోకి వస్తాం…ఏదో చేస్తాం..గుప్తదానాలు చేస్తున్నాం లాంటి వాటిని పక్కన పెట్టి ఈ దారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంది. ఆలోచన లేని కొంతమంది అభిమానులు ఎలాగూ మారరు. కానీ ఆలోచన ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఈ పాలాభిషేకాలు వద్దని ఆ స్టార్ హీరోస్ అందరూ కూడా అభిమానులకు చిత్తశుద్ధితో చెప్పేలా చేయాలి. సోషల్ మీడియా ద్వారా ఓ ఉద్యమమే లేవదీయాలి. ఆ వేడి స్టార్ హీరోస్‌కి తగలాలి. ఇమేజ్ కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోయే ఆ స్టార్ హీరోస్…ఆ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్తితులు వస్తే కచ్చితంగా బయటకు వస్తారు. జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ ఆల్రెడీ అభిమానులకు అప్పీల్ చేసి ఉన్నాడు. అలా చెప్పడమే కాదు చిత్తశుద్ధితో ప్రయత్నించేలా ఒత్తిడి తీసుకురావాలి. గట్టి ప్రయత్నాలు చేసిన స్టార్ హీరోస్‌ని అభినందనల వర్షంలో ముంచెత్తాలి.
పసి వాళ్ళను పరమాత్మతో పోల్చడం మన సంస్కృతి. ఇప్పుడు అలాంటి శిశువులు, గర్భస్థ శిశువులు కోట్లాది మంది న్యూట్రిషన్ ఫుడ్ దొరక్క దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకంటే ఈ తెరవేల్పుల కటౌట్స్, పోస్టర్స్ గొప్పవేం కాదు. అందుకే కొంత టైం కేటాయించి అయినా సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండ్ అయ్యేలా చేద్దాం. అభిమానులలో మార్పు తెస్తే ఆ స్టార్ హీరో ఇమేజ్ ఇంకా పెరుగుతుందనన్న విషయం స్టార్ హీరోస్‌కి తెలిసేలా చేద్దాం.