టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చేపట్టిన లే ఆఫ్స్ గురించి ఇపుడు ఐటీ పరిశ్రమలో విస్తృత చర్చ జరుగుతోంది. టీసీఎస్‌ను అందరూ ఐటీ ఇండస్ట్రీలో ప్రభుత్వ కంపెనీలాగా భావిస్తూ ఉంటారు. ఉద్యోగానికి ఢోకా ఉండదని.. రూల్స్ అన్నీ పక్కాగా పాటిస్తూంటారని అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ లే ఆఫ్స్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ కంపెనీ లాంటిదని చెప్పి ఇలా చేశారేమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే లే ఆఫ్స్ అనేవి ప్రభుత్వ కంపెనీ లాంటిది అన్న ధీమా తో పని చేయని వారి కోసమే. స్కిల్స్ పెంచుకోనివారి కోసమే. మిగిలిన వారు అంతా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
భారంగా మారిన మ్యాన్ పవర్‌ను భరించే స్థితిలో లేని ఐటీ ఇండస్ట్రీ
ఒకప్పుడు బెంచ్ స్ట్రెంత్ ను ఐటీ కంపెనీలు బలంగా చూసేవి. ఉద్యోగులు ఎవరైనా హఠాత్తుగా మానేసి వెళ్లిపోయినా ప్రాజెక్టులకు సమస్యలు లేకుండా చూసుకునేవి. కానీ ఇప్పుడు బెంచ్ స్ట్రెంత్ అవసరం లేదు. ఏఐ , ఆటోమేషన్ వచ్చాక.. కంపెనీల తీరులో మార్పు వచ్చింది. ప్రతి ఉద్యోగి నుంచి ప్రొడక్టివిటీని ఆశిస్తున్నారు. ఎవరికైనా సరిపడా స్కిల్స్ లేకపోతే సొంత ఖర్చుతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. నేర్చుకుని ఏదో ఓ ప్రాజెక్టులో కుదురుకుంటే సరే .. లేకపోతే ఇంటికి పంపించడానికి వెనుకాడటం లేదు. టీసీఎస్‌లో జరిగింది ఇదే.
ఏ ప్రాజెక్టుల్లో లేకుండా ఖాళీగా ఉన్న వారికే లే ఆఫ్స్
ప్రభుత్వ ఉద్యోగంలో ఓ సారి చేరితే చాలు.. ఆఫీసులకు వచ్చి పని చేసినా.. చేయకపోయినా.. స్కిల్ ఉన్నా లేకపోయినా జీతాలు ఠంచన్ గా ఖాతాల్లో పడిపోతాయి. సీనియార్టీ ప్రకారం .. ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. టీసీఎస్‌ను ప్రభుత్వం సంస్థలాగా భావించి ఇంతే వస్తాయని అనుకుని..తమను తాము మెరుగుపర్చుకోని వారు.. రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చేసుకోని వారు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. ఒక్క టీసీఎస్‌లోనే కాదు.. చాలా కంపెనీలు ఇప్పుడు ఇలాంటి వారికి ఎందుకు జీతాలివ్వాలని ఆలోచిస్తున్నాయి. అందుకే లే ఆఫ్స్ ఇంకా పెరుగుతాయని అంటున్నారు.
ఏ కంపెనీకి పోషించాల్సిన అవసరం లేదు !
ఏ కంపెనీ అయినా పని చేయని, ఉపయోగపడని ఉద్యోగుల్ని పోషించాలని అనుకోదు. ఇవాళ కాకపోతే రేపు అయినా ఉపయోగపడతాడు అనుకుంటే అవకాశాలు కల్పిస్తుంది. వాటిని ఉపయోగించుకోవాలి. టెక్ ఇండస్ట్రీ అంతా మ్యాన్ పవర్ మీదనే నడుస్తుంది. ఆ మ్యాన్ పవర్ ఎంత కీలకమో.. సాఫ్ట్ వేర్ కంపెనీలకు తెలుసు. అందుకే తమకు పనికి వస్తాడనుకున్న ఏ ఒక్క ఉద్యోగినీ వదులుకోదు. దాన్ని గుర్తు పెట్టుకుని ఉద్యోగులు.. తమ స్కిల్స్ మెరుగుపర్చుకుంటే.. ప్రభుత్వాల కన్నా ఎక్కువగా.. బాగా చూసుకుంటాయి కంపెనీలు.