Subham Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ఓ అగ్ర కథానాయిక నిర్మాతగా మారి ఓ సినిమా తీసిందంటే కచ్చితంగా ఆ సినిమాపై ఆసక్తి నెలకొంటుంది. అలా ‘శుభం’ సినిమా జనంలోకి వెళ్లింది. ఈ సినిమాలో నటించిన వాళ్లంతా దాదాపు కొత్తవాళ్లే. టెక్నీషియన్లలోనూ స్టార్లు లేరు. ఈ సినిమాను ముందుండి నడిపించింది సమంతనే. అంతే కాదు… తానో పాత్ర కూడా పోషించింది. అలా… ఈ ప్రాజెక్ట్ పై కొంత ఫోకస్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సమంత స్టార్డమ్ ఈ సినిమాకు ఎంత వరకూ కలిసొచ్చింది? నిర్మాతగా సమంత అభిరుచి ఏమిటి?
భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగే కథ ఇది. కేబుల్ టీవీ ఉధృతంగా ఉంటూ.. అప్పుడప్పుడే డిష్ టీవీ వెలుగు చూస్తున్న కాలం. ఓ ఛానల్ లో ‘జన్మ జన్మల బంధం’ అనే సీరియల్ ప్రతీ రోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంటుంది. ఆ సీరియల్‌కు ఆ ఊర్లోని మహిళలు ఎడిక్ట్ అయిపోతుంటారు. సరిగ్గా రాత్రి 9 గంటల నుంచి 9.30 వరకూ వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ఆ అరగంటా… వాళ్లని ఎవ్వరూ ఆపలేరు. టీవీ కట్టలేరు. ఆ స్థాయిలో మహిళామణుల విజృంభణ ఉంటుంది. ఆ సీరియల్ వచ్చినప్పుడు వాళ్లు అలా మారిపోవడానికి కారణం ఏమిటి? మంత్రగత్తై మాయ (సమంత) చెప్పిన విరుగుడు ఏమిటి? అనేది అసలు కథ.
సినిమాలో మంచి పాయింట్ ఉంది. హారర్ జోనర్‌ని సీరియల్ కి కనెక్ట్ చేయడం ఇంట్రస్టింగ్ ఐడియా. త్వరగా కనెక్ట్ అయిపోయే విషయం కూడా. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో సీరియల్ లో మమేకమైపోయే ఆడవాళ్లు ఉంటారు. సీరియల్ లో పాత్రలకు ఏమైనా అయితే, వాళ్లకేదో అయిపోయినంత బాధ పడుతుంటారు. అందుకే పాయింట్ ఈజీగా రిజిస్టర్ అవుతుంది. పైగా సీరియల్స్ చుట్టూ బోలెడంత కామెడీ పండించే ఆస్కారం ఉంది. దాన్ని దర్శకుడు కొంత వరకూ వాడుకొన్నాడు. కథలోకి వెళ్లడానికి కాస్త టైమ్ పట్టింది. తొలిరాత్రి వేళ… వల్లి అనే పాత్ర సీరియల్ కి కనెక్ట్ అయిపోవడం దగ్గర్నుంచి అసలు కథ మొదలు అవుతుంది. అక్కడ్నంచి పెళ్లాల మధ్య నలిగిపోయే భర్తల పాట్లూ చూపిస్తూ కథని ముందుకు తీసుకెళ్లారు. కొన్ని చోట్ల కామెడీ వర్కవుట్ అయ్యింది. కొన్ని చోట్ల రిపీట్ అనే ఫీలింగ్ కలిగింది. సమంత ఎంట్రీ తరవాత వినోదం, ఉత్కంఠత మరింత పెరగాల్సింది. కానీ అది జరగలేదు. ఒకొక్క పదాన్నీ విడమర్చి, అదేదో ఎబ్రివేషన్లా చెప్పడం అనే క్యారెక్టరైజేషన్ సమంత పాత్రక అన్వయించారు. అది కొంత వర్కవుట్ అయ్యింది.
సినిమాల్లో కొన్ని పాత్రల కోసం జనం ఎదురు చూడాలి. ఈ పాత్ర ఎప్పుడు వస్తుందా? అంటూ పడిగాపులు కాయాలి. అలాంటప్పుడు ఆ పాత్రని తీసుకొస్తే కిక్ వస్తుంది. సమంత చేసిన మాయ పాత్రనీ అలా డిజైన్ చేసుంటే బాగుండేది. చిన్న చిన్న పాయింట్ కథలు చెబుతున్నప్పుడు బాగుంటాయి. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కష్టం. పాయింట్ అర్థమయ్యాక కూడా అందులోంచి ఫన్ జనరేట్ చేయాలంటే రైటింగ్ స్కిల్స్ చాలా బాగుండాలి. అది ‘శుభం’ విషయంలో అరాకొరగానే కనిపించింది. సెకండాఫ్ తేలిపోతోందనుకొన్న దశలో `సినిమా బండి` టీమ్ ని ప్రవేశ పెట్టడం మంచి ఆలోచన. సినిమా బండితో ఆకట్టుకొన్న ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రానికి దర్శకుడు. కాబట్టి.. ఆయా సన్నివేశాలు మరింత సహజంగా కుదిరాయి. అయితే ‘సినిమా బండి’ సినిమాతో కనెక్ట్ అయ్యేవాళ్లే ఆయా సన్నివేశాల్ని ఎంజాయ్ చేయగలరు. లేదంటే… వాళ్లకు అవన్నీ మామూలుగానే కనిపిస్తాయి. సీరియల్ పాత్రలు, ఆ పాత్రల తాలుకూ ఉద్దేశాల్నీ.. సినిమాలోని ప్రధాన పాత్రలతో కలపడం, ఆడవాళ్లకూ, వాళ్ల ఆలోచనలకూ, వాళ్లు చేసే పనులకూ కాస్త గుర్తింపు, గౌరవం దక్కాలని చెప్పడం – హర్షించదగిన విషయాలు.
మూడు జంటల కథ ఇది. తెరపై కనిపించిన వాళ్లంతా సహజంగా ఉన్నారు. వాళ్ల ఎక్స్ప్రెషన్స్ చక్కగా కుదిరాయి. కాస్త తెలిసిన నటీనటుల్ని తీసుకొంటే ఇంకొంచెం బాగుండేది. `కొత్తవాళ్లతోనే సినిమా చేద్దాం` అనే ఆలోచనతోనే సినిమా తీస్తే – సర్దుకుపోవాల్సిందే. సమంత ది ఓ రకంగా అతిథి పాత్ర. కాసేపే కనిపించినా ఆ ప్రభావం ఉంది. ఆ పాత్రని ఇంకాస్త పెంచుకోవొచ్చు. కానీ.. కథని, మిగిలిన పాత్రల్నీ డామినేట్ చేయకూడదన్న ఉద్దేశంతో ఇలా కనిపించి, అలా మాయమై ఉండొచ్చు. టెక్నికల్‌గా సినిమా సో..సోగా ఉంది. పాటలు రాప్ మోడల్ లో సాగి, కథని, పాత్రల బాధనీ చెప్పడానికి ఉపయోగపడ్డాయి. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన `సినిమా బండి` చాలామందికి నచ్చింది. అదే దర్శకుడు మరో కొత్త తరహా ఆలోచనతో తీసిన సినిమా ఇది. ఐడియా పరంగా వినగానే ఎవరికైనా నచ్చుతుంది. కానీ దాన్ని సినిమాగా మలచడంలో ఇంకాస్త గట్టిగా, క్రియేటీవ్ గా ఆలోచించాల్సింది. వినోదం డోసు ఇంకొంచెం పెంచొచ్చు. నిర్మాతగా సమంత తొలి సినిమా. కొత్తవాళ్లతో చేసిన ప్రయత్నం కాబట్టి – తన ఆలోచనని, ప్రయత్నాన్నీ మెచ్చుకోవాల్సిందే.
హారర్ – కామెడీ ఈ రెండూ మిక్స్ చేసినప్పుడు దేనికి పెద్ద పీట వేయాలి? అనేది దర్శకుడి అభిరుచిపై ఆధార పడి ఉంటుంది. ఇది హారర్ సినిమానే అయినా.. భయం జోలికి దర్శకుడు వెళ్లలేదు. కొన్ని హారర్ ఎఫెక్టులు ఇచ్చినా అవి సరిపోలేదు. కేవలం వినోదానికే మొగ్గు చూపించాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నవ్వించినా పూర్తి స్థాయిలో ఈ సినిమా అలరించలేకపోయింది. ఓ మంచి సెటప్ ని సెట్ చేసిన దర్శకుడు ఆ సెటప్‌లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లినా, పూర్తిగా ఇన్వాల్వ్ చేయించలేకపోయాడు. పెద్దగా అంచనాలేం పెట్టుకోకుండా, కాసేపు కాలక్షేపం దొరికితే చాలు అనుకొంటే ‘శుభం’ ఒకసారి చూడొచ్చు.
తెలుగు360 రేటింగ్: 2.5/5