సుబ్రహ్మణ్య స్వామి అంటే .. జయలలితపై అక్రమాస్తుల కేసులు వేసి ఆమెను ముప్పు తిప్పలు పెట్టి జైలుకు పంపించిన వ్యక్తి అని అందరికీ తెలుసు. ఆయన లాయర్ కాకపోయినా న్యాయవ్యవస్థను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్ బారిన పడి గల్లీ పిటిషన్లు వేసి కోర్టులతో చీవాట్లు పెట్టించుకునే పరిస్థితికి వచ్చారు.
తాజాగా సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నికలో హింస జరిగిందని దానిపై చర్యలు తీసుకోలేదని పిటిషన్ వేశారు. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు?. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నికతో ఆయనకు ఏం సంబంధం?. అయినా సరే ఆయన తమకు ఏదో బాకీ ఉన్నారని తాము చెప్పినట్లుగా పిటిషన్లు వేయాలన్నట్లుగా తీసుకు వచ్చి ఈ పిటిషన్ వేయించారు. ఆయనకూ తప్పలేదు. అంతకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ తరపున ఆయనతో. వేమూరి రాధాకృష్ణపై పిటిషన్ వేయించారు. ఇటీవల దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ విచారణలో ఆయనపై కోర్టు చాలా సార్లు అసహనం వ్యక్తం చేసింది.
అయినా ఇప్పుడు తగుదునమ్మా అంటూ వచ్చి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల వివాదంపై పిటిషన్ వేశారు. ఒకప్పుడు ఆయన న్యాయవ్యవస్థలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని పిటిషన్లు వేసి ఫలితాలు సాధించారేమో కానీ ఇటీవలి కాలంలో ఆయన పిటిషన్లకు లోయర్ కోర్టుల్లో కూడా విలువ ఉండటం లేదు. వైసీపీ లాంటి పార్టీలకు ఆయన ఆయుధంగా మారడంతో.. రాజకీయాల కోసం ఆయన వేస్తున్న పిటిషన్లు అని అందరికీ అర్థమైపోయింది.
ఒకప్పుడు సుబ్రహ్మణ్య స్వామిఅంటే.. అందరికీ కాస్త గౌరవం ఉండేది. ఆయన మాటలకు విలువ ఉండేది. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదు. అంతా వైసీపీతో స్నేహం మహత్యం. ఎవరైనా మాడి మసైపోవాల్సిందే.